- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంకెన్నాళ్లు ఈ లాకప్ చావులు!
తెలంగాణలో లాకప్ హత్యలు అనే పేరుతో నడుస్తున్న పోలీసుల హత్యా కార్యక్రమాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతుండటం స్థానిక ప్రభుత్వానికి సిగ్గుచేటు అనే చెప్పాలి. దశాబ్దాల క్రితం నక్సలైట్ల వేటతో మొదలైన పోలీసు రాజ్యం సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను అనుమానంపై పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేయటాన్ని నేటికీ కొనసాగిస్తోంది. ఏపీలో కూడా ఇటీవలే ఒక లాకప్ డెత్ తీవ్ర వివాదాస్పదమైంది. మెదక్ జిల్లాలో జనవరి 27న ఒక చైన్ స్నాచింగ్ ఘటనలో సీసీ పుటేజీల ఆధారంగా ఖాదిర్ ఖాన్ అనే 35 ఏళ్ల చిల్లర వ్యాపారి ఉన్నాడని అనుమానించిన పోలీసులు 29వ తేదీన అతని కోసం వేట మొదలెట్టారు. ఖాదిర్ ఖాన్ అక్కాబావలను పోలీసు స్టేషన్‌కి రప్పించుకుని అమానుషంగా ప్రవర్తించారు.
చివరకు జనవరి 30న ఉదయం 5.30 నిమిషాలకు మజీద్ దగ్గక ఖాదిర్ ఖాన్‌ని పట్టుకెళ్లేంతవరకు గాలింపు కార్యక్రమం సాగింది. ఖాదిర్‌ని కారులో ఎక్కించుకుని హైదరాబాద్ నుంచి మెదక్ వచ్చేవరకు పోలీసుల చిత్రహింసలు కొనసాగాయి. జనవరి 30న ఉదయం 9.30కు మెదక్ పోలీస్ స్టేషన్‌లోకి తీసుకెళ్ళి మొదటి అంతస్తులో తీవ్రంగా “టార్చర్' చేశారు. ఆ తరువాత వరుసగా నాలుగు రోజులు జనవరి 30, 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో ఖాదిర్‌ను తలక్రిందులుగా వేలాడదీసి ధర్డ్ డిగ్రీ టార్చర్ కొనసాగింది. అయినా చేయని నేరాన్ని ఒప్పుకోకపోయే సరికి అప్పుడు నేరస్తుడు కాదేమోనని, చనిపోతాడేమోనని భార్య సిద్దేశ్వరికి కబురు పంపించారు. ఆమె ఉదయం ఫిబ్రవరి 3న మెదక్ పోలీస్ స్టేషన్ చేరుకునే సరికి అప్పటికే ఎంఆర్‌ఓ దగ్గర బైండోవర్ చేపించి, ఖాదిర్‌ఖాన్‌ను అప్పగించారు. నీ భర్త నేరం చేశాడని మేము విచారణ చేశాం. 99 శాతం కాదని తేలిందని కానీ ఒక శాతం ఇంకా అనుమానం ఉందని చెప్పారు. “మీరు ఇంటి నుంచి బయటికి రావద్దని, మందులు మేము తీసుకొచ్చి ఇస్తాం, మీరు ఎవరికీ చెప్పొద్దు” అని తీవ్రస్థాయిలో ఆమెను భయపెట్టారు.
ఈ నాలుగు రోజులు ఫిబ్రవరి 3 నుంచి 7వ తారీకు వరకు ఇంట్లోనే ఉంచి పోలీసులు ఇచ్చిన మందుతో చికిత్స అందిస్తూ ఉంది. అప్పటికి ఇంకా అతను వాష్‌రూముకు వెళ్ళినా కనీసం యూరిన్ కూడా వదలలేని స్థితిలో ఆరోగ్యం క్షీణించి వుంది. దీన్ని గమనించి మెదక్ గవర్నమెంట్ ఆసుపత్రికి ఫిబ్రవరి 8న భార్య సిద్దేశ్వరి తీసుకు వెళ్ళింది. ఈ విషయం కూడా పోలీసుల దృష్టికి వెళ్ళగానే, డాక్టర్లతో మాట్లాడిన పోలీసులకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి, పరిస్థితి సీరియస్‌గా ఉందనే విషయం అర్థం అయ్యింది. పోలీసులు వెంటనే గవర్నమెంట్ ఆసుపత్రి నుండి డిచార్జి చేయించి కొంపెల్లి సమీపంలో ఉన్న “రేనోవా” ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అప్పుడు మాత్రం 8వ తారీకు నుంచి 11వ తారీకు వరకు మూడుసార్లు డయాలసిస్ చేశారు. ఈ ఆసుపత్రి ఖర్చు సుమారు 80 వేల రూపాయలు పోలీసులే భరించారు.
అయినప్పటికి ఖాదిర్‌ఖాన్ ఆరోగ్యం సీరియస్‌గా ఉన్నందున అక్కడి నుంచి (ఖాదర్‌ను) హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం పోలీసులే చేశారు. ఫిబ్రవరి 11వ తేదీ రాత్రి 11.30 నిమిషాలకు ఏఐజీ ఆసుపత్రి ముందు ఆంబులెన్స్‌లో నుంచి ఖాదిర్‌ఖాన్ దిగనంటే దిగనని మారం చేసి మీరు నన్ను చంపేస్తారు అని బాగా మొండికేసాడు. ఆ స్థితిలో అతనిని వెనక్కి తీసుకొచ్చి అర్ధరాత్రి సమయంలో కొడువాయి దర్గా దగ్గర వదిలివేసి పోలీసులు వెళ్ళిపోయారు. ఉదయం సిద్దేశ్వరి ఎలాగో కష్టపడి హైదరాబాదు గాంధీ ఆసుపత్రికి ఖాదిర్‌ఖాన్‌ను చేర్చింది. ఫిబ్రవరి 12న సుమారు 9.30 గంటల సమయంలో గాంధీ ఆసుపత్రి 5వ వార్డులోకి ఖాదిర్‌ఖాన్ చేరాడు. ఆనాటి నుండి ఫిబ్రవరి 16 సాయంత్రం వరకు నాలుగు సార్లు డయాలసిస్‌లు చేశారు. అయినా గాంధీ ఆసుపత్రిలో ఫిబ్రవరి 16 రాత్రి ఖాదిర్‌ఖాన్ మరణించాడు.
ఇలాంటి లాకప్‌డెత్‌లు తెలంగాణలో ఉండవద్దని చట్టబద్ద పాలన జరగాలని 1200 మంది అమరవీరుల సాక్షిగా తెలంగాణను సాధించుకున్నాం. భవిష్యత్‌లో మంచి జీవితాలను నిర్మించుకుందామనే ఆశపై గత 8 ఏళ్ళుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం దాడి చేస్తూనే ఉన్నది. హత్యలు, ఆత్మహత్యలు సర్వసాధారణమైపోయాయి. 20కి పైగా ఎన్‌కౌంటర్ హత్యలు, 10కి పైగా లాకప్ హత్యలతో పాలకులు ప్రజాస్వామ్యం పేరుతో పోలీసుల పాలన కొనసాగిస్తున్నారు. కేసీఆర్ పాత ప్రభుత్వాల్లాగానే పాలనంతా పోలీసుల చేతుల్లో పెట్టాడు. నేరం ఒప్పుకోని ఆరోపితులపై కిడ్నీలు, మలద్వారాలు పనిచేయకుండా పోలీసులు హింసా ప్రతాపాన్ని చూపిస్తున్నారు. దాంతో చేయని నేరం ఒప్పుకోనందుకు ఎంతోమంది లాకప్ హత్యలకు గురవుతున్నారు. ఖాదిర్‌ఖాన్ ఒక మైనార్టీ మతస్తుడు. ఆర్థికంగా బలహీనుడు. ముగ్గురు పిల్లలు కలిగిన పెద్ద కుటుంబం. ఈ లాకప్ హత్యలో ప్రధాన ముద్దాయిలైన ఎస్‌ఐ రాజశేఖర్, కానిస్టేబుల్స్ ప్రశాంత్, ప్రవీణ్‌లపై 302 హత్యానేరం కేసు నమోదు చేసి విచారణ జరపాలి. బాధిత కుటుంబానికి ఒక కోటి నష్టపరిహారం చెల్లించాలి. పిల్లల ఉన్నత చదువులకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. కేసీఆర్ పాలనలో జరిగిన అన్ని ఎన్‌కౌంటర్, లాకప్ హత్యలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి దోషులను శిక్షించాల్సిన అవసరం ఉంది.
ఎన్. నారాయణ రావు
ప్రధాన కార్యదర్శి, పౌరహక్కుల సంఘం