బీఎస్‌ఎన్‌ఎల్‌ని ఎలా దిగజార్చారంటే..

by Ravi |   ( Updated:2024-10-10 01:01:20.0  )
బీఎస్‌ఎన్‌ఎల్‌ని ఎలా దిగజార్చారంటే..
X

సరసమైన ధరలలో సార్వత్రిక నాణ్యత గల సేవలందించాలనే ప్రాథమిక లక్ష్యంతో టెలికాం కమిషన్ 1988లో, శ్యాం పిట్రోడా అధ్యక్షతన ఏర్పడింది. టెలికాం పాలసీకి చెందిన ఈ లక్ష్యాన్ని అప్పటి టెలికాం డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు అసాధారణ రీతిలో సాధించారు. దేశంలోని ప్రతి మూలలో పూర్తిగా స్వదేశీ సి.డాట్ ఎక్స్ఛేంజీలను వ్యవస్థాపించడం ద్వారా ఈ లక్ష్యం చాలా వరకు సాధించబడింది. దేశవ్యాప్తంగా సి.డాట్ ఎక్స్ఛేంజీల విస్తరణ, దేశంలోని మారుమూల అందుబాటులో లేని ప్రాంతాలలో స్థిర లైన్ టెలికాం సేవలను అందించడమే కాకుండా టెలికాం సాంద్రతను విస్తృతంగా పెంచింది.

1995లో జాతీయ టెలికాం పాలసీ అమలులోకి వచ్చినప్పుడు టెలికాం సేవల ప్రైవేటీకరణ జరిగింది. ఢిల్లీ, ముంబై జంట నగరాలు మాత్రమే ఎంటిఎన్ఎల్ అధికార పరిధిలో ఉన్నాయి అప్పుడే ప్రభుత్వం ఎయిర్‌టెల్, రిలయన్స్ వంటి ప్రైవేట్ ఆపరేటర్ల మొబైల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రైవేట్ ఆపరేటర్‌లు భారీ మొబైల్ సెగ్మెంట్ మార్కెట్‌ను స్వాధీనం చేసుకునే వీలు కల్పించేందుకు అవకాశం ఇచ్చింది. అయితే, మొబైల్ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం తన సొంత కంపెనీ అయిన ఎంటిఎన్ఎల్‌ని అనుమతించలేదు.

బీఎస్‌ఎన్‌ఎల్ రావడంతో..

1998లో టెలికాం ఉద్యోగుల సంఘాలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పుడు, ముంబై, ఢిల్లీలో మొబైల్ సేవలను ప్రారంభించడానికి ఎంటిఎన్ఎల్‌కి లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేసింది. ప్రైవేట్ ఆపరేటర్లు - ఎయిర్‌టెల్, రిలయన్స్ 2000 సంవత్సరంలో మొబైల్ సేవలను ప్రారంభించడానికి అనుమతించబడ్డాయి, కానీ 2002 వరకు మొబైల్ సేవలను ప్రారంభించడానికి ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్‌‌కి లైసెన్స్ ఇవ్వలేదు. 2002 సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు మొబైల్ సేవలను ప్రారంభించడానికి అనుమతించడంలో జాప్యంపై తీవ్రంగా నిరసన తెలుపడంతో మొబైల్ సేవలను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించవలసి వచ్చింది. మొబైల్ రంగంలో బీఎస్ఎన్‌ఎల్ ప్రవేశించడంతో, ప్రైవేట్ ఆపరేటర్లు వసూలు చేసే అవుట్‌గోయింగ్ కాల్‌కు నిమిషానికి రూ. 15 రూపాయలు ఇన్‌కమింగ్ కాల్‌కు 8 రూపాయలు టారిఫ్‌లు మూడు నిమిషాలకు రూ.2.40కి పడిపోయాయి.. టెలికాం రంగంలో ఈ అద్భుతమైన, సంచలనాత్మక పురోగతి బీఎస్ఎన్ఎల్ మొబైల్ సేవల్లో ప్రవేశంతో మాత్రమే వచ్చింది.

భారీ నష్టం అప్పుడే..

2006 సంవత్సరంలో మొబైల్ విభాగంలో ఎయిర్‌టెల్ మార్కెట్ వాటా 19% కాగా, మొబైల్ విభాగంలో బీఎస్ఎన్ఎల్ వాటా 18%తో పోటీలో ఉండేది. బీఎస్ఎన్ఎల్ మొబైల్ విభాగంలో 2007 సంవత్సరం వరకు వేగంగా ఎదుగుతుండగా, 45.5 మిలియన్ల మొబైల్ లైన్లను అందించడానికి పరికరాల సేకరణ కోసం ప్రతిష్టాత్మకమైన టెండర్‌ను అప్పటి టెలికాం మంత్రి ఏకపక్షంగా రద్దు చేయడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కి ఘోరమైన దెబ్బ తగిలింది. మొబైల్ పరికరాల తీవ్రమైన కొరత కారణంగానే, నమ్మశక్యం కాని వేగంతో అభివృద్ధి చెందుతున్న బిఎస్ఎన్ఎల్ కుప్పకూలి అప్పటి నుండి కోలుకోలేకపోయింది. మళ్లీ, 2013 సంవత్సరంలో 3G స్పెక్ట్రమ్ కోసం వేలం జరిగినప్పుడు, పాన్ ఇండియా స్పెక్ట్రమ్ కేటాయింపు కోసం బీఎస్ఎన్ఎల్ వేలం పాడడానికి 12,000 కోట్ల రూపాయలకు లైసెన్స్ ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేసింది. ముగ్గురు ప్రైవేట్ ఆపరేటర్లు కలిసి తమకు నచ్చిన సర్కిల్‌లను నిర్ణయించడం ద్వారా లైసెన్స్ ఫీజుగా రూ. 12,000 కోట్లు చెల్లించి ప్రవేశించారు.

100 శాతం ప్రభుత్వ వాటా..

అయితే, 2014లో ప్రైవేట్ ఆపరేటర్లకు 4G స్పెక్ట్రమ్ కేటాయించి, జియో టెలికాం మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటికీ బీఎస్ఎన్ఎల్‌‌కి 4జి స్పెక్ట్రమ్ కేటాయించలేదు. ఇప్పటివరకు 4జీ సేవలను విడుదల చేయడానికి అనుమతించలేదు. ఈ విధాన ఉల్లంఘన కారణంగా, ఇతర ప్రైవేట్ ఆపరేటర్లు కూడా భారీ నష్టాలను చవిచూశారు, అయితే వారు ప్రభుత్వానికి బకాయిపడిన రూ. 1,64,000 కోట్లను మాఫీ చేయడం ద్వారా వారికి ప్రభుత్వం తగిన విధంగా పరిహారం చెల్లించింది. కార్మికుల నిరంతర పోరాటం వలన బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరించబడకుండా జాగ్రత్తపడిందని చెప్పడం చాలా సందర్భోచితమైనది. బీఎస్ఎన్ఎల్ కార్మికుల అలుపెరగని పోరాటం కారణంగా, ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్‌‌లో 100% వాటాను కలిగి ఉంది. పైగా, బీఎస్ఎన్ఎల్ మాత్రమే ప్రభుత్వం 100% వాటాను కలిగి ఉన్న ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Advertisement

Next Story