- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన పండుగలు:గోగు పూల వసంతం
కుల, మత, లింగ, వయో భేదాలు లేకుండా, పేద, ధనిక, మధ్యతరగతి అనే భేదభావం లేకుండా ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ హోలీ. చిగురించే ఆకులు, వికసించే పుష్పాలతో వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి అంతా రంగురంగుల పూలతో నయనానందకరంగా ఉంటుంది. మనిషి జీవితం కూడా కష్టసుఖాల కలబోత అని, మనిషి జీవితం రంగులమయం కావాలని ప్రకృతి ఇచ్చే సంకేతంగా దీన్ని చెప్పుకోవచ్చు.
హోలీ అనగా అగ్ని అని, అగ్నితో పునీతమైంది అని అర్థం. హోలీనే కాముని పున్నం, డోలికోత్సవం, రంగుల పండుగ, వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ చేసుకునే పండుగ కాబట్టి దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగ జరుపుకుంటాం.
పురాణ కథలు
దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన పరమేశ్వరుడు హిమాలయాలలో తపో దీక్షలో ఉండగా మన్మథుడు పూలబాణం వేసి దీక్షను భగ్నం చేశాడు. ఆగ్రహించిన శివుడు మూడో కన్ను తెరిచి (కాముడు) మన్మథుడిని భస్మం చేశాడు. రతీదేవి కోరిక మేరకు మన్మథుడిని బ్రతికించి, ఎవరికీ కనపడకుండా కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిస్తాడు. కామ దహనం చేసిన తర్వాత రోజున హోలీని జరుపుకుంటున్నాం. మరో కథనం ప్రకారం శ్రీకృష్ణుడిని రాధ నల్లవాడని హేళన చేయగా, తనను ఏడిపించడానికి సరదాగా రంగులు పూస్తూ గోపికలతో పాటు రంగుల పండుగ జరుపుకున్నట్లు తెలుస్తున్నది.
మరో కథనం ప్రకారం ప్రహ్లాదుడు హోలిక దహనం వలన హోలిక దహనానికి గుర్తుగా మనము హోలీ పండుగను జరుపుకుంటున్నాం. మనలో ఉన్న చెడును దహనం చేసి నిర్మల, స్వచ్ఛ మనసుతో ఎదుటివారికి ప్రేమను పంచడం, వారితో సంతోషాలు పంచుకోవడం అన్నది ఇందులోని పరమార్థం. హోలీ పండుగకు సంబంధించి హాలుని గాథా సప్తశతిలో పాల్గుణ ఉత్సవం, మదనోత్సవం అని, దండి దశకుమార చరిత్రలో వసంతోత్సవం అనే పేర్లు, వాటికి సంబంధించిన వర్ణణ మనకు కనిపిస్తుంది.
సహజ రంగులు వాడుదాం
ప్రాచీన కాలంలో చెట్ల ఆకులు పూలతో ముఖ్యంగా మోదుగ పువ్వులను ఉడికించి రసం చేసి ఆ ద్రవాలను ఒకరిపై ఒకరు చల్లుకునేవారు. కొన్ని రోజులకు పసుపు, కుంకుమలను నీళ్లలో కలిపి రంగులు చల్లుకునేవారు. ఇప్పటి వారు రసాయనాలతో కలిగిన రంగులు, కోడిగుడ్లు, బురద ఇంకా విషపూరిత ద్రవాణాలతో హోలిని జరుపుకుంటున్నారు. హోలీ పండుగ రోజు చల్లుకునే ప్రమాదకర రసాయన రంగుల ప్రభావం మనకు రెండు మూడు నెలల వరకు ఉంటుంది. క్యాన్సర్ కారకాలైన రసాయనాలను ఉపయోగించడం ద్వారా చర్మ సంబంధమైన వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. ప్రకృతిలో కాలుష్యం కూడా ఏర్పడుతుంది. మనిషి జీవితంలో ఒక్కో రంగు ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది.
ప్రకృతి సిద్ధమైన రంగులతో శరీరానికీ, మనసుకూ ఆహ్లాదం కలుగుతుంది. రంగు మన ఆలోచనల మీద కూడా ప్రభావం చూపుతుంది. తెలుపు స్పష్టతకు, స్వచ్ఛతకు ప్రతీక. సున్నితత్వం, ప్రశాంతతను కలిగిస్తుంది. ఆకుపచ్చ రంగు జీవ చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఎరుపు రంగుకు ఆకర్షించే గుణం ఎక్కువ. ఉత్సాహానికీ, ఉద్వేగానికి ప్రతీక. నీలం రంగు దివ్యత్వానికి ప్రతీక. మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను చురుకుదనాన్ని ఇస్తుంది. నలుపు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, చెడు శక్తులను తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. అందుకే మన సాంప్రదాయం ప్రకారం సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి, ఆనందంగా. సంతోషంగా, ఆరోగ్యకర వాతావరణంలో హోలీ పండుగను జరుపుకుందాం. పర్యావరణ పరిరక్షణకు మన వంతుగా కృషి చేద్దాం.
కొమ్మాల సంధ్య
లెక్చరర్, తాడ్వాయి, ములుగు