చరిత్ర మర్చిన అధ్యాయం 'తురముఖం'

by Ravi |   ( Updated:2023-09-23 01:00:16.0  )
చరిత్ర మర్చిన అధ్యాయం తురముఖం
X

‘తురముఖం’ కార్మిక ఉద్యమంలో వచ్చిన పరిణామ క్రమానికి సంబంధించిన మలయాళం సినిమా అని చెబితే చాలా సింపుల్‌గా చెప్పినట్లే. కేరళ చరిత్రలో విస్మృతికి గురి అయిన ఒక అధ్యాయం తురముఖం సినిమాగా వచ్చింది. ఒకానొక కాలంలో, ఒకానొక స్థలంలో -కొన్ని జీవితాలను ఒక నవలా క్రమంగా వర్ణించిన సినిమా ఇది. ఆనాడు జరిగిన తిరుగుబాట్లను యథాతథంగా చూపటం ఈ సినిమాకు చారిత్రక కోణాన్ని ఇచ్చింది. అయితే ఆ చరిత్రను పూస గుచ్ఛటానికి కొన్ని కాల్పనిక పాత్రలను తీసుకుని కథకు రక్త మాంసాలు ఇవ్వడం వలన ఈ సినిమాను కాల్పనిక చారిత్రక ఇతివృత్తం అనవచ్చేమో.

నవల నుండి సినిమాగా..

ఈ సినిమా వాస్తవానికి కెఎం చిదంబరం 1968లో అదే పేరుతో రాసిన నాటకానికి సినిమాకరణ. ఈ సినిమాకరణ చేసింది ఎవరో కాదు అతని కొడుకు గోపన్ చిదంబరం. కెఎం చిదంబరం బతికి ఉండగా ఈ నాటకాన్ని ఆయన ప్రదర్శించనివ్వలేదు. ఆయన మరణం తర్వాత 2018లో ఈ నాటకాన్ని గోపన్ చిదంబరం ఆధ్వర్యంలో మట్టన్ చెరీలోని ఉరూ ఆర్ట్ థియేటర్ వాళ్లు ప్రదర్శించారు. మట్టన్ చెరీ ప్రాంతంలోనే జరిగిన పోరాట కథ ఇది. స్థానిక వ్యక్తులే ఈ నాటకంలో నటించారు. నాటకం ఎలా ఉందో తెలియదు కానీ, ఈ సినిమా కథ చాలా నెమ్మదిగా నడుస్తూ -ఒక్కో ఘటన, ఒక్కో ఎమోషన్, ఒక్కో పాత్ర, ఒక్కో సంభాషణ మనసులో స్థానం సంపాదించుకుంటాయి. తురముఖం అంటే ‘రేవు’ అని అర్థం. పేరు చూసి కేరళలోని త్రివేండ్రంలో ‘విళింగమ్’ పోర్ట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి సంబంధించిన సినిమా అని అనుకునే అవకాశం ఉంది.

ఈ సినిమా 1953 కాలానిది. నిజానికి అంతకంటే ముందు నుండే 1930లో కొచ్చిన్ రేవు నిర్మాణం అయినప్పటి నుండే కథ ప్రారంభం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా అంతకంటే ముందు కేరళ మలబారు ప్రాంతంలో 1920లలో జరిగిన మోప్లా తిరుగుబాటు నుండే కథా మూలాలు ఉంటాయి. మూడు దశాబ్దాల కథను ఒక ధారగా, విసుగు పుట్టించనీయకుండా నడిపించటం చిన్న విషయం కాదు. కొచ్చిన్ రేవు దగ్గర మట్టన్ చెరిలో నివాసాలు ఏర్పరచుకున్న కొన్ని ముస్లిం కుటుంబాల కథ ఇది. కొచ్చిన్‌లో అప్పుడే కట్టిన రేవులో కూలీలుగా పని చేస్తుంటారు వాళ్లు. కొత్త కొత్త కుటుంబాలు పొట్ట చేతిన పట్టుకొని వారితో చేరుతుంటాయి. వీరందరూ మోఫ్లా తిరుగుబాటు తరువాత అక్కడకు వలస వచ్చి పనిచేసుకుంటుంటారు.

మోఫ్లా తిరుగుబాటు నేపథ్యం..

ప్రసిద్ధ మోఫ్లా తిరుగుబాటు గురించి ఇక్కడ కొంత తెలియటం అవసరం. కేరళలోని మలబారు ప్రాంతంలో జరిగిన తిరుగుబాటు అది. దీన్ని మప్పిలా తిరుగుబాటు అని కూడా అంటారు. కులీన హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన ఈ తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం భూస్వాములకు కొమ్ముకాసి అణచివేసింది. ఆరు నెలలు సాగిన ఈ పోరాటంలో బ్రిటిష్ సైన్యం చేతిలో 10,000 మంది దాకా ప్రజలు చనిపోయారు. దాదాపు 50,000 మందిని నిర్బంధించారు. వారిలో 20,000 మందిని అండమాన్ జైళ్లకు పంపించారు. 10,000మంది అదృశ్యం అయ్యారు.

కౌలు రైతులకు, భూస్వాములకు మధ్య జరిగిన ఈ వైరుధ్యానికి తరువాత కాలంలో మతం రంగు పులిమారు. ముస్లిములతో బాటు అనేకమంది ముస్లిమేతరులు ఈ తిరుగుబాటుకు మద్దతునిచ్చి నడిపించారు.

రైతులు ముస్లిములుగా, భూస్వాములు నాయర్లు (నంభూతి బ్రాహ్మలు) గా ఉండటం కాకతాళీయమే. మొదటిగా ఈ పోరాటం భూస్వామ్య వ్యతిరేక పోరాటం. రెండో విషయం స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైన ఈ ఉద్యమాన్ని బ్రిటిష్ వారి జోక్యంతో వారికి వ్యతిరేకంగా జరిగిన జాతీయ ఉద్యమంగానే పరిగణించాలి. తరువాత కాలంలో రైతులు ధ్వంసం చేసింది కూడా బ్రిటిష్ వ్యవస్థలనే. జాతీయోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న ఆ కాలంలో దానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ కూడా ఈ ఉద్యమాన్ని కూడా అనేకానేక రైతు తిరుగుబాట్ల లాగానే సొంతం చేసుకోలేదు. కానీ 1971లో కేరళ ప్రభుత్వం ఈ తిరుగుబాటులో పాల్గొన్న వారిని స్వాతంత్ర్య సమర యోధులుగా గుర్తించింది.

టోకెన్ దొరికితేనే పని

ఆ తిరుగుబాటు ప్రాంతం నుండి వచ్చిన మైము కుటుంబంలో భార్య పార్తూ, కొడుకులు మౌదు, హంజా, ఇంకా కూతురు కచ్చి ఉంటారు. పిల్లలు ‘మొఫ్లా తిరుగుబాటు వర్ధిల్లాలి’ అని నినాదాలు ఇస్తూ ఆడుకుంటుంటే -భార్యాభర్తలు తమ మొఫ్లా గతాన్ని తలబోసుకొనే ఒక దృశ్యం ఉంటుంది. ‘కొంతమందిమి పారిపోయాము. కొంతమంది అండమాన్ వెళ్లారు. కొంతమంది స్వర్గానికి వెళ్లారు’ అంటుంది పార్తూ. కానీ కష్టజీవులకు ఎక్కడికి వెళ్లినా బ్రతుకు పోరాటమే. ఆత్మాభిమానాన్ని, ఆవేశకావేశాలను చంపుకుంటేనే ఆ కుటుంబానికి నాలుగు వేళ్లు లోపలకి వెళ్లేది. కానీ అన్నివేళలా అది సాధ్యం కానీ పరిస్థితులు ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ‘యజమానులు ఏవో విసురుతుంటే, ఏక వస్త్రంతో ఉన్న బడుగు ప్రజలు వాటి కోసం తన్నుకునే దృశ్యం’ ఒకటి వుంటుంది. వారిని అదుపు చేయటానికి వినోదం చూస్తున్న యజమానుల తరఫున వాళ్ల శరీరాల మీద కొరడాలు మోగించేవాళ్లు ఉంటారు. నాణాలు విసురుతున్నారేమో అనుకుంటాము. రేవులో పని పొందటానికి టోకెన్లు విసురుతున్నారని అర్థం అవుతుంది. పని తక్కువ, కార్మికులు ఎక్కువ ఉన్న ఆ కాలంలో అమానవీయమైన చప్పా వ్యవస్థ ఉండేది. చప్పా (టోకెన్) దొరికిన వాళ్లకే ఆ రోజు పని. ‘దీనికన్నా దొంగతనానికి పోవటం నయం’ అనే గొంతు కార్మికులలో నుండి వినబడుతుంది.

ప్రతి దృశ్యం కళాత్మకమే..

ఈ అవమానకర చప్పా వ్యవస్థ మార్పు కోసం, అందరికీ పని కావాలనే డిమాండ్స్‌తో జరిగిన పోరాటాలు అక్కడ 20 సంవత్సరాల పైగా జరిగాయి. 1953లో జరిగిన కార్మిక సమ్మెలో ముగ్గురు కార్మికులు చనిపోయాక, వీరికి కొన్ని హక్కులు వచ్చాయి. ఆ క్రమాన్ని ఈ సినిమా వివరిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చాక యూనియన్లు పెట్టుకోవటానికి అనుమతి వచ్చాక కూడా చాలా కాలం ఆ యూనియన్లు యజమానులు చేతుల్లోనే వున్నాయి. యూనియన్లలో పట్టు సాధించటానికి ఒక పోరాటం, తమ డిమాండ్స్ సాధించుకోవటానికి ఒక పోరాటం -నిరంతరం పోరాటాల్లో మునిగి తేలే ఆకలి కళ్ల కార్మికులు కనిపిస్తారు ఈ సినిమా అంతా. పని దొరక్క వట్టి చేతులతో ఇంటికి వచ్చి -సగం ఇల్లు, సగం బహిరంగం అయిన గుడిసె వాకిట్లో కూలబడ్డ హంజా పాత్రను ఎన్నటికీ మరవలేము. ఆ ఇళ్లు కార్మికుల జీవితాలకు ఎక్కడా గోప్యత నివ్వలేవు. 1920 నుండి 1950ల మధ్య కార్మిక ప్రజల ఇళ్ల పరిసరాలు, తిండి తిప్పలు, వేషధారణలను జాగ్రత్తగా అధ్యయనం చేసి తీశారీ సినిమాను. మోకాళ్ల మీద కూర్చొని ఒక్కో బియ్యం గింజను ఏరుకొంటూ ముందుకు జరిగే పార్తూ బాధాకరమైన శరీర కదలికలను చూపే ఒక్క దృశ్యం చాలు ఈ సినిమాలో ప్రతి దృశ్యాన్ని ఎంత శ్రద్ధగా తీశారో అర్థం అవటానికి. ప్రేక్షకుల పట్ల గౌరవం ఉన్న వాళ్లు మాత్రమే అలా తీయగలరు.

ఒక్కో పాత్ర ఒక్కో అద్భుతం..

ఈ సినిమాలో అద్భుతమైన పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలన్నీ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాయి. దర్శకుడు ఆయా పాత్రల సైకాలజీని పట్టుకొని అందులో ఇమిడి పోయి నటించే నటులను ఎన్నుకొన్నారు. సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన రాజీవ్ రవి చాలా మంచి సినిమాలు తీశాడు. అవి అన్నాయుమ్ రసూలుమ్, నాన్ స్టీవ్ లోపెజ్, కమ్మట్టి పాలెం, కుట్టవుమ్ శిక్షావుమ్ సినిమాలు. మొదటి సినిమా ‘కమ్మట్టి పాలెం’ లో కొచ్చిన్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో మోసపోయిన సమూహాల గురించి తీశాడు.

మలయాళంలో కార్మిక వర్గం మీద తీసిన సినిమాలు చాలా వచ్చాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా పటిష్టమైన దర్శకత్వ, స్క్రీన్ ప్లే ప్రతిభతో తీసిన సినిమా ‘తురముఖం’ రెండు సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ సినిమా ఏ మాత్రం నిరుత్సాహ పర్చలేదు. ఈ సినిమాను ‘సోని లివ్’ లో వీక్షించవచ్చు.

రమాసుందరి

మాతృక సంపాదకురాలు

94405 68912

Advertisement

Next Story

Most Viewed