- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్యాగాలను గుర్తించరా?
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఎందరో యోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఏ ఆకాంక్షల కోసం వారు బలిదానం చేశారో అవి మాత్రం నెరవేరడం లేదు. అమరుల కుటుంబాల పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. వారి గురించి సీఎం కేసీఆర్ ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కావడం లేదు. 1952లో ముల్కీ ఉద్యమ కాలంలో ఎనిమిది మంది ప్రాణత్యాగం చేశారు. 1969లో 369 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు వారి కుటుంబాల చరిత్ర లేకుండా పోయింది. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ కాగడా ఎత్తుకొని ఎందరో ఆయన బాటన నడిచారు. ఇందులో చాలా మంది తమ ప్రాణాలను అర్పించారు.
మరి, కేసీఆర్ ఎందుకు అమరవీరుల స్థూపం వద్దకు పోవడం లేదు? అంత తీరిక లేకుండా ఉన్నారా? ఎన్నో సందర్భాలలో ఆయన 'మీరు ప్రాణాలు తీసుకోకండి. మనం కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకుందాం' అని చెప్పారు. నాడు విద్యార్థుల త్యాగం చూసి చలించిపోయిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అమరవీరుల తల్లుల కడుపుకోతను పట్టించుకోవడం లేదు? వారిని ఎందుకు కలవడం లేదు? అమరుల కుటుంబాలు ఎన్నడూ దీక్షలు కానీ, ధర్నాలు, రాస్తారోకోలు కానీ చేయలేదు. ఎందుకు ఈ దూరం పెరిగింది? తొలి అసెంబ్లీలో అమరుల త్యాగాల గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? సమాధానం చెప్పాలి. కేసీఆర్ స్వయంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. అలాంటి గొప్ప నాయకుడిని ఎక్కడా చూసి ఉండం. కానీ, అమరుల త్యాగాలను కూడా మీరు గుర్తించాలి సార్.
మాకలాంటి కోరికలు లేవు
అమరుల కుటుంబాలలో ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ కావాలని కోరుకోవడం లేదు. తన కుటుంబంలో ఎవరో ఎమ్మెల్యే, ఎంపీ అవుతారని శ్రీకాంతాచారి చనిపోలేదు. తన చివరి కోరిక 'తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు' అంటూనే ప్రాణాలు వదిలారు. ఖమ్మం నుంచి సురేశ్‌నాయక్, వరంగల్ నుంచి బొజ్యానాయక్, ఇషాన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి స్వర్ణక్క, నల్గొండ నుంచి వేణుగోపాల్, హైదరాబాద్ నుంచి సిరిపురం యాదయ్య, రంగారెడ్డి నుంచి యాదిరెడ్డి, నిజామాబాద్ నుంచి పోలీస్ కిష్టయ్య, కరీంనగర్ నుంచి జీవన్ ఇలా దాదాపు 1,200 మంది తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలు కోల్పోయారు. మొదటి విడతలో 450 మందిని గుర్తించారు. కొందరికి సహాయం చేశారు. కొందరికి ఉద్యోగాలు వచ్చాయి.కొంత ఊరట కలిగింది. కానీ, అమరుల కుటుంబాలు తమకంటూ ఓ గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నాయి. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాయి.
ప్రతి వీరుడి త్యాగానికి ప్రతీకగా ఒక స్థూపం, ప్రతి కుటుంబానికి వ్యవసాయ భూమి, తల్లిదండ్రులకు పెన్షన్, అధికార గుర్తింపు, విద్య, ఉపాధిహామీ, వైద్య సదుపాయాలు కల్పించాలి. జాబ్ చేస్తున్నవారికి కుటుంబాలకు దగ్గరగా పోస్టింగ్ ఇవ్వాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అమరుల కీర్తి స్థూపం నిర్మాణం పూర్తి చేయాలి. అందులో ప్రతి వీరుడి కథనీ డిజిటల్ రూపంలో తీసుకొని, వచ్చే తరం చూసే విధంగా ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్‌పీ నేత ప్రవీణ్‌కుమార్, వైఎస్ఆర్ టీపీ అధినేత్రి షర్మిల పోటాపోటీగా నినాదాలు చేస్తూ వస్తున్నారు. అమరుల స్థూపం వద్దకు మాత్రం పోరు. స్వయంగా ఈ దేశ ప్రధాని మోడీ నివాళి అర్పించారు. రాహుల్‌గాంధీ సహా ప్రతి ఒక్కరూ అమరుల త్యాగం గురించి ప్రచారం చేస్తున్నారు. అంత గొప్ప మనసు ఉంటే కేంద్ర ప్రభుత్వం తరపున అమరుల కుటుంబాలకు సహాయం చేయాలి.
నరేశ్‌నాయక్ జర్పుల
తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు
85005 85982