- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధి కల్పన ప్రభుత్వ హక్కు!
2023-24 లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2019-20లో నమోదైన దానికంటే 18% అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ, గత ఐదు సంవత్సరాల కాలంలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో వృద్ధి లేదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఏకానమీ అనే సంస్థ తెలిపింది.
విద్యావంతుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నా ఉపాధి, ఉద్యోగాలు కల్పించనందువల్ల దేశంలో నిరుద్యోగుల రేటు పెరిగిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల వేళ నిరుద్యోగుల ఓట్లు దండుకోవడానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీల వల విసిరి అధికార పీఠాన్ని అధిరోహించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత పదేళ్ల పాలనలో ఆ ప్రక్రియను చిత్తశుద్ధితో చేపట్టకుండా కల్లిబొల్లి మాటలతో, అనేక లోపభూయిష్ట విధానాలతో నిర్లక్ష్యం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడినారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఇంతలా దిగజారడం ఇదే ప్రథమం. కరోనా సమయంలో ఉద్యోగ, ఉపాధులు కోల్పోయిన వారిలో సగం మందికి నేటికీ సరైన అవకాశాలు లభించలేదు.
నిరుద్యోగం పెరగడానికి కారణమిదే!
వందమంది పని 50 మంది చేస్తున్నారు! నిరుద్యోగుల పరిస్థితి ఇంత దారుణంగా ఉండడానికి మరో కారణం నయా సరళీకరణ విధానాల కారణంగా ఏర్పడిన పరిస్థితులతో ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వాల పెత్తనం తగ్గడం, పెట్టుబడిదారీ, ప్రైవేటీకరణ పెరగడంతో ఉద్యోగ కల్పనలో వృద్ధి సగానికి సగం తగ్గిపోయింది. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వందమంది చేసే పనిని 50 మందితోనే చేయిస్తున్నారు. తక్కువ మందితో పని చేయించుకొని ఎక్కువ లాభాలు ఆర్జించేందుకే ప్రైవేటు, కార్పొరేట్ పెట్టుబడిదారులు ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యం వారికి ఉండదు. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి తెచ్చిన ప్రభుత్వాలు ప్రైవేట్, కార్పొరేటీకరణకు పూనుకున్నాయి. లాభాల బాట నడిపే ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మడంలో మునిగిపోయారు. నింగి నుండి నేల వరకు అన్నింటిలో ప్రభుత్వాలకు వాటిపై నియంత్రణ లేకపోవడంతో నిరుద్యోగం భారీ స్థాయికి పెరుగుతుంది. ఈ నిరుద్యోగ సమస్య నిర్మూలించబడాలంటే ఉపాధి కల్పనను ఓ హక్కుగా గుర్తించాల్సిన అవసరం ఉంది.
నిరుద్యోగం సమాజ బాధ్యతే!
ఒక వ్యక్తి నిరుద్యోగిగా ఉండటం అతడు లేదా ఆమె తప్పు కాదు. ముమ్మాటికీ ఆ వ్యక్తి జీవించే సమాజంలో ఉన్న సామాజిక వ్యవస్థది. ఆ వ్యక్తికి ఉపాధి కల్పించడం ఆ వ్యవస్థకు చేతకాలేదని అర్థం. మరి అటువంటప్పుడు ఉపాధి కల్పన విషయంలో ముందుకు తేవలసిన డిమాండ్ ఎలా ఉండాలి.. సమీప కాలంలో నిరుద్యోగ సమస్య నుండి కొంత ఊరట కలిగించేదిగా, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలోనే కల్పించగలిగేదిగా ఉండాలి. అంటే ఉపాధి హక్కు ఒక సార్వత్రికమైన హక్కుగా ఉండాలి. రాజకీయ హక్కులు, పౌర హక్కులు ఏ విధంగా ప్రాథమిక హక్కులుగా గ్యారంటీ చేయబడ్డాయో అదే విధంగా ఉపాధి హక్కు కూడా గ్యారంటీ చేయబడాలి. ఉపాధి హక్కును గ్యారంటీ చేసి కనీస ప్రాథమిక ఆదాయాన్ని అమలు చేయడానికి జీడీపీలో 3 శాతం కన్నా ఎక్కువ ఖర్చు కాదు. ఒక నిరుద్యోగికి కనీస వేతనం నెలకు 20 వేల చొప్పున చెల్లించాలనుకుంటే ప్రస్తుతం నిరుద్యోగ రేటు 10% ఉంటుందని లెక్కవేస్తే దేశంలో ఉన్న నాలుగు కోట్ల మంది నిరుద్యోగులకు ఏడాదికి రూపాయలు 9.6 లక్షల కోట్లు అవసరమవుతుంది. ఇది మన జీడీపీలో 3.2శాతం.
కనీస ఆదాయం భిక్ష కాదు
రాజకీయ పార్టీలు సైతం అయిష్టంగానైనా ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని ఒప్పుకోక తప్పడం లేదు. అది వెంటనే సాధ్యం కాదని చెబుతూ ప్రతి ఒక్కరికి కనీస ప్రాథమిక ఆదాయం కల్పించాలన్న ప్రతిపాదనను ఓట్లు దండుకోవడానికి ముందుకు తెస్తున్నాయి. అది ఒక ఎన్నికల హామీగా ఉండటం చేత కొత్తగా వచ్చే ప్రభుత్వం దాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. కనీస ఆదాయం అనేది ప్రభుత్వాలు దయతో ఇచ్చే బిక్ష కాదు నిజానికి ఏ నిరుద్యోగి యాచకుడు కాదు. వారికి ఉద్యోగాలు కావాలి లేదా ఉపాధి కల్పించబడాలి. వాటిని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమవుతున్నప్పుడు, సంపన్నులకు ప్రభుత్వ రాయితీలు ఇవ్వొద్దు.
ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వెనక్కి తగ్గకుండా.. ఆ యువతరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి యువశక్తి నిర్వీర్యం కాకుండా చూడాలి. ఈ నిరుద్యోగం నానాటికి ఇలాగే పెరిగిపోతే యువశక్తిని ఇలాగే జాలిగా గాలికి వదిలేస్తే! రాబోయే రోజుల్లో మన దేశంలో విపత్కర పరిస్థితులు వచ్చినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.
మేకిరి దామోదర్,
సామాజిక విశ్లేషకులు,
95736 66650