అభివృద్ధి బాటలో ప్రభుత్వం!

by Ravi |
అభివృద్ధి బాటలో ప్రభుత్వం!
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనను ఇటీవలే పూర్తి చేసుకుంది. అగాధంలో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే, గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థలను పటిష్టం చేస్తూ ప్రజలకు వీలైనంతగా మేలు చేస్తూ జనరంజక ప్రజా పాలన ఇచ్చామని అధికార పక్షం సంతృప్తి వ్యక్తం చేస్తోంది.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ వంద రోజుల్లో నెరవేర్చాలంటే ఏ ప్రభుత్వానికైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం కావాలి. రూ.10 లక్షల కోట్లు అప్పులు, లక్ష కోట్లు బకాయిలు వారసత్వంగా సంక్రమించిన క్లిష్ట పరిస్థితిలో అధికారం చేపట్టిన చంద్రబాబు నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చే విధంగా డీఎస్సీ నోటిఫికేషన్, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, సామాజిక పెన్షన్లను రూ.4000 లకు పెంచడం, నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై మొదటి ఐదు సంతకాలు చేయడం ద్వారా అన్ని వర్గాల సంక్షేమానికి, అభ్యున్నతికి సమాన ప్రాధాన్యత ఇచ్చారు.

నిజానికి ఏ ప్రభుత్వ పని తీరును కూడా మొదటి వంద రోజుల్లో బేరీజు వేయడం సబబు కాదు. ఎందుకంటే మంత్రివర్గ కూర్పు, అధికారుల ఎంపిక, ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడం, పాలనలో ప్రాధాన్యతలను గుర్తించడం, నామినేటెడ్ పదవులను భర్తీ చేయడానికే మూడు నెలలు చాలవు. తన పాలన చరమాంకంలో మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న మాట తప్పడమే కాక తనకు ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతిని ఆపేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. మరోవైపున ఎన్డీయే ప్రభుత్వం జారీచేసిన డీఎస్సీ నోటిఫికేషన్, పైలట్ ప్రాజెక్టుగా నైపుణ్య గణనను మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం, పారిశ్రామిక వేత్తలను పెట్టుబడులు పెట్టే విధంగా ఆకర్షించడం ద్వారా నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు చేస్తున్న కృషిని విమర్శించడం హాస్యాస్పదం.

ఆ నైతిక హక్కు వైసీపీకి ఉందా?

సామాజిక పెన్షన్ల విషయానికి వస్తే వైకాపా హయాంలో విడతల వారీగా పెంచి నాలుగున్నరేళ్లకు పెన్షన్ రూ.3000 చేసి 63 లక్షల మందికి ఇస్తే, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం 2024 ఏప్రిల్‌లో హామీ ఇచ్చిన నాటి నుండే వర్తించే విధంగా ఒకేసారి ఒక్కొక్కరికి రూ.7000 (పెంచిన పెన్షన్ 4000,బకాయిలు 3000) మొత్తం రూ.4800 కోట్లు 65.18 లక్షల మంది పేదవారికి పంపిణీ చేయడం ఎలా మోసం అవుతుంది. రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇక పంటల బీమా విషయానికి వస్తే విపత్తులతో నష్టపోయే రైతులకు ఉదారంగా సాయం చేయడం మాని, పంట నష్ట పరిహారాన్ని తగ్గించి ఇచ్చే కప్ అండ్ క్యాప్ (80-110) బీమా విధానాన్ని (ఇందులో రూ.100 ప్రీమియం కడితే పంట నష్టానికి రూ.110 మించి పరిహారం ఇవ్వరు) ఎంచుకుని రైతాంగాన్ని దారుణంగా వంచించిన గత వైకాపా ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు పంటల బీమా విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు ఉందా?

ఆర్థికస్థితిని బాగుపర్చడమే లక్ష్యంగా..

వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు పెట్టిన బకాయిలు రూ.1674.47 కోట్లు, ఆరోగ్యశ్రీకి పెట్టిన బకాయిలు రూ.1600 కోట్లలో ఇప్పటి వరకు రూ.700 కోట్లు, నీరు-చెట్టు బకాయిలు రూ.256 కోట్లు, రాజధాని కౌలు రైతుల బకాయిలు రూ.400 కోట్లు, పేదల గృహ నిర్మాణ బకాయిలు రూ.50 కోట్లు ఎన్డీయే ప్రభుత్వం చెల్లించింది. ఇంటింటికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం దీపావళి నుండి అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి బాధ తీర్చుతున్నారు. విద్యుత్ చార్జీలు పెంచమన్న హామీకి కట్టుబడ్డారు, ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించారు. గ్రామ పంచాయతీలకు రూ.1452 కోట్లు నిధులు జమ చేయడంతో పాటు ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించారు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు సాధించారు. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని స్థితి నుండి ప్రభుత్వ ఉద్యోగులు నెలలో మొదటి తేదీనే జీతాలు అందుకుంటున్నారు.

అదనపు సాయం అందించారు..

ఇటీవల వరదల వల్ల నష్టపోయిన వారికి రూ.602 కోట్ల నిధులతో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ గైడె‌లైన్స్ ప్రకారం ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ప్రభుత్వం సాయం చేసింది. తన పాలనానుభవం, పట్టుదల, కృషితో చంద్రబాబు నాయుడు క్రమంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నారనేది జగమెరిగిన సత్యం.

జగన్మోహన్ రెడ్డి పాలనలో బ్రష్టుపట్టిన అధికార వ్యవస్థను సంస్కరించి, దిగజారిన శాంతిభద్రతలను పునరుద్ధరించి, రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తి స్వాతంత్ర్యాన్ని పరిరక్షించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని .. అదే సమయంలో తప్పు చేసిన అధికారులను చట్టం ముందు నిలబెడతామని అధికార పక్షం స్పష్టం చేస్తోంది.

మారిన చంద్రబాబు.., సరికొత్త విజన్

చంద్రబాబు .. ఆయనంతే ..మారడు అనే వారికి ఇటీవల ఒక్కసారిగా ఇరవైకి పైగా నామినేటెడ్ పదవులు భర్తీ చేయడం, మిగిలిన వాటిని కూడా త్వరలో భర్తీ చేయడానికి నిర్ణయించడం విస్మయం కలిగించింది. గత ప్రభుత్వం నుండి వారసత్వంగా సంక్రమించిన ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ, అనుకోని విపత్తుల్ని సమర్థంగా అధిగమిస్తూ, రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు దూసుకెళ్తున్నారు. వరద కష్టాల్లోంచి ప్రజలను బయట పడేయడంలో చంద్రబాబు చూపిన విజన్, పాలన విపత్తు నిర్వహణలో భావితరాలకో పాఠం. వంద రోజుల్లోనే సకారాత్మకమైన తన మార్కు పాలన చూపిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో పయనిస్తుందని ఆశిద్దాం.

లింగమనేని శివరామ ప్రసాద్

79813 20543

Advertisement

Next Story

Most Viewed