సమ్మిట్ సరే.. సదుపాయాల మాటేంటి?

by Ravi |   ( Updated:2023-03-02 19:46:08.0  )
సమ్మిట్ సరే.. సదుపాయాల మాటేంటి?
X

వాస్తవ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మార్చి 3, 4 తేదీల్లో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు వాణిజ్య నగరం విశాఖ వేదిక కాబోతోంది. ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం. ఇక్కడ పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషి. పరిశ్రమల స్ధాపనకు, పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎంత అనుకూలంగా ఉందో స్పష్టమవుతోంది. ప్రధానంగా పరిశ్రమలు అనుమతులు విషయంలో సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ విధానం అమల్లో వుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి 21 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నారు. న్వెస్ట్ ఇండియా సంస్థ ప్రకారం దేశంలో పెట్టుబడులకు అత్యంత అనువైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. 974 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం, నాలుగు ప్రాంతాల్లో 6 పోర్టులు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటికి అదనంగా మరో నాలుగు పోర్టులను నిర్మించనున్నారు. 6 విమానాశ్రయాలు కూడా ఉండగా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతుంటే అందులో ఏపీలోనే మూడు మూడు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం వివిధ దశల్లో వుంది. మౌలిక సదుపాయాలు మరింత విస్తృత పరచటానికి ప్రభుత్వం కృషిచేస్తోంది.

ఇతర రంగాలపై దృష్టి పెట్టాలి

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిలో భాగంగా రామాయపట్నం , మచిలీపట్నం , కాకినాడ గేట్వే, భావనపాడు పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనుంది. 2024 జనవరి నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి నౌకను తీసుకురావాలని లక్ష్యం గా నిర్దేశించుకుని ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు, 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే లక్ష్యంతో పనిచేస్తోంది. గ్రీన్ఎనర్జీ రంగంలో గత సదస్సులలో రూ. 1.26 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగితే, అప్పుడే అందులో రూ. 40,000 కోట్లు త్వరలో వాస్తవ రూపం దాల్చనున్నాయి. రాష్ట్రంలో కేజీ బేసిన్‌లో సహజవాయువు నిల్వల లభ్యత వల్ల పెట్రోలియం, గ్యాస్‌ ఆధారిత రంగాలలో విరివిగా విదేశీపెట్టుబడులను ఆకర్షించే దిశగా ప్రస్తుత మున్న విధానాన్ని సమీక్షించాలి. 48 రకాల ఖనిజాల లభ్యత ఉండగా ఖనిజాధార కంపెనీల ఏర్పాటుకు అనుకూలత ఎక్కువ. నదీ పరివాహక ప్రాంతంలో రొయ్యలసాగు, సముద్ర ప్రాంతలో దొరికే మత్స్యసంపద, పుడ్‌ ప్రాసెసింగ్, రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే ప్రధాన వనరులు. టెక్ట్స్‌టైల్, హస్తకళా వస్తువులు, పర్యాటక రంగంలో పెట్టు బడులకు అనుకూలం కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోవాలి. తీర ప్రాంతంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య పద్దతిలో విధానాల రూపకల్పనకు చొరవచూపాలి. విదేశీ పెట్టుబడులు అంటే ఫార్మా ఐ.టి రంగాలనే భ్రమను తొలగించుకుని పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇతర రంగాలపై దృష్టిని కేంద్రీకరించాలి. ఎక్కువ మంది యువతకు ఉపాధిని కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించాలి. స్మార్ట్‌ఫోన్ తయారీ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తివైపు దృష్టి సారించాలి.

ఒప్పందాలు కాదు...కార్యాచరణ ముఖ్యం

అనంతపురం జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత అరుదుగా లభించే లిథియం ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్వేలో గుర్తించింది. ఖనిజం వెలికితీతకు కావాల్సిన మౌలిక సదుపాయాలు పరిపాలన అనుమతులపై , పర్యావరణ పరిరక్షణపై సత్వరం దృష్టి సారించాలి. సెల్‌ఫోన్ల రీచార్జింగ్, లాప్‌ట్యాపులు, టిజిటల్ కెమెరాల బ్యాటరీలు, గుండెకి ప్రత్యామ్నాయంగా పనిచేసే పేస్ మేకర్, కదిలే బొమ్మలు, ఆట వస్తువులు, గడియారాల బ్యాటరీలకి కూడా లిథియం మూలకాన్ని ఎక్కువగా వాడతారు. ఇక భవిష్యత్తు ఈ ఎలక్ట్రిక్ వాహనాలదే అని నిపుణులు అంచనా వేస్తున్న క్రమంలో లిథియం నిల్వల ద్వారా ఆదాయం, ఉపాధికి కూడా లభించే అవకాశం ఉంది. నాణ్యమైన విద్యుత్, పరిశ్రమకు అనుకూలమైన ప్రాంతంలో స్థలం కేటాయింపు, రాయితీలు, పారదర్శక పారిశ్రామిక విధానం సత్వర అనుమతులపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఆర్థిక, పారిశ్రామిక, ఆటవీ, ఖనిజ, పర్యావరణ, పర్యాటక శాఖలలోని కార్యదర్శులతో కూడిన ప్రత్యేక సమన్వయ బృందాన్ని ఎర్పాటుచేయ్యాలి. పెట్టుబడులను ఆకర్షించి ఒప్పందాలు చేసుకుంటే సరికాదు అది కార్యాచరణ దాల్చాలి. రాష్ట్రంలో ఉన్న వనరులను వినియోగించు కుంటూ పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ విజయవంతంగా పరిశ్రమలు నదపవచ్చు అన్న నమ్మకాన్ని కలిగిస్తూ వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, మెరైన్‌, ఆటోమొబైల్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, టూరిజం, పెట్రోలియం, గ్యాస్‌ ఆధారిత ఆధారిత పరిశ్రమలు వంటి రంగాలపై దృష్టి సారించి ఆ దిశగా పెట్టుబడులు వచ్చే విధంగా కృషి చేసిన రోజున ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో పురోభివృద్దిని సాధించగలదు .

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story

Most Viewed