- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోధనకు సమయమీయండి..
ప్రభుత్వ పాఠశాలల్లోని ఉదయం అల్పాహారంతో మొదలై సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరయ్యే పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ అందించడంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో నిమగ్నమవుతున్నారు. దీంతో నాణ్యమైన విద్యను అందించడానికి, తరగతి గది బోధనకు సన్నద్ధం అవడానికి సమయం దొరకడం లేదనేది మెజారిటీ టీచర్ల అభిప్రాయం.
అల్పాహార పథకానికి నేటికి స్పష్టమైన విధివిధానాలు రూపొందించలేదు. కానీ ఈ పథకం ప్రార్థనా సమయం కన్నా ఒకగంట ముందుగా అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో ప్రధానోపాధ్యాయులతో పాటు ఒకరో, ఇద్దరో ఉపాధ్యాయులు హాజరవ్వాల్సి రావడం, స్థానిక కుకింగ్, హెల్పర్స్ సమయానికి తయారు చేయకపోవడంతో అల్పాహారం అందించడం తలకు మించిన భారంగా మారింది. ఆ తదుపరి రాగి జావ అందివ్వగానే బియ్యం లెక్కలు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం తయారు చేయించడం తోనే పుణ్యకాలం గడిచిపోతోందని ఇక బోధనకు సమయమేదని టీచర్లు వాపోతున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన పాఠశాలల్లో ఈ పథకం అమలు కొన్ని ఎన్జీవో సంస్థలకు అప్పగించడం ఊరట కలిగించే అంశం.
వినూత్న పథకాలతో బేజారు
ఇక పాఠశాల ప్రారంభం కాగానే టీచర్లు హడావిడిగా మొబైల్ ఫోన్లు పట్టుకుని తరగతి గదుల్లోకి పరిగెత్తడం నిత్యకృత్యమైపోయింది. ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేయాల్సిందిగా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడంతో ఇందులో నిమగ్నమయిపోతున్నారు. దీనికి గ్రామీణ ప్రాంతాల్లో ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడం, కొన్నిసార్లు సర్వర్ మోరాయించడం తదితర కారణాలతో హాజరు నమోదు కావడం లేదు. పైగా విద్యార్థుల హాజరు, ఇవన్నీ కాక పై అధికారులు గూగుల్ షీట్స్, స్ప్రెడ్ షీట్స్ ద్వారా ఏదో ఒక సమాచారం అడుగుతూ ఉండడంతో ఆ సమాచారం అందించడానికి ఒక ఉపాధ్యాయిడిని కేటాయించక తప్పట్లేదు. ఇలాంటి వాటి వల్ల కేవలం 20 నిమిషాలు బోధనకు కేటాయించడం శోచనీయం.
టెక్నాలజీని ఉపయోగించి డాటా సేకరించడంతో పాటు వివిధ ప్రోఫార్మాలను నింపడంతోనే సమయం గడిచిపోతుంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రోఫార్మా అడగడం ఉన్నతాధికారులకు పరిపాటిగా మారడం, బోధనేతర సిబ్బంది లేకపోవడంతో ఇవన్నీ నింపి పంపడం ఉపాధ్యాయులకు తలకుమించిన భారంగా మారింది.
అందరి లక్ష్యం ఒక్కటే!
విద్యార్థులకు చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు వంటి కనీస సామర్థ్యాల సాధనకు రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణా సంస్థ ఏటా క్లిప్, క్లాప్, ఏబీసీ పేరుతో వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. కారణం కార్యక్రమాలు బాగానే ఉన్నా, తరగతి గది బోధనకు ఎక్కువ సమయం కేటాయించకపోవడం.40 మంది విద్యార్థులున్న తరగతి గదిలో ప్రతి విద్యార్థినిని ఆదర్శ పఠనం చేయించడం, బహుళ తరగతి బోధన ఏ విధంగా సాధ్యమవుతుందో పెద్దలే వివరించాలి. టీచర్లను అది చేయాలి, ఇది చేయాలి, ఇంతే చెప్పాలి, ఇలాగే చెప్పాలి, బోధనలో సోపానాలు పాటించాలి, మల్టీ గ్రేడ్, మల్టీ లెవల్ టీచింగ్ చేయాలని నిర్దేశించడం సరికాదు. దీనికి తోడు డైరీ రాయండని, ఇలా రాయండని నిర్బంధం చేయడం కూడా సరికాదు.
విద్యాహక్కు చట్టం, నేషనల్ కరికులం ప్రేమ్ వర్క్, జాతీయ నూతన విద్యా విధానం అన్నింటి యొక్క అంతిమ లక్ష్యం విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించడమే. ఈ మేరకు ప్రాథమిక స్థాయిలో తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి. బడులలో బోధనేతర సిబ్బందిని నియమించాలి. అల్పాహారం మధ్యాహ్న భోజనం వంటి పథకాలకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. టీచర్లకు బోధనలో స్వేచ్ఛనివ్వాలి, సమయమివ్వాలి. అప్పుడే ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టవచ్చు. ఆ దిశగా నూతన సర్కారులో విద్యా శాఖల ఉన్నతాధికారులు అడుగులు వేస్తారని ఆశిద్దాం.
సుధాకర్ ఏ.వి.
రాష్ట్ర కార్యదర్శి, STUTS
- 90006 74747