మార్కుల ఉరితాళ్లకు విద్యార్థుల బలి

by Ravi |   ( Updated:2023-05-11 00:00:50.0  )
మార్కుల ఉరితాళ్లకు విద్యార్థుల బలి
X

రీక్షలు మనిషి ప్రతిభను కొలవడానికి నైపుణ్యతను బయటి ప్రపంచానికి ప్రకటించడానికి ఉపయోగపడతాయి. పరీక్ష అంటే నిర్దిష్ట సమయంలో విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీయడానికి నిర్ణయించే ప్రతిభా ప్రదర్శన. ఐతే ఒకే సమయంలో ఏ ఇద్దరూ విద్యార్థులూ సమానమైన లక్ష్యాలను నెరవేర్చలేరనేది కూడా ఒక వాస్తవం. మనదేశంలోని విద్యావ్యవస్థ బానిసలను తయారు చేస్తుందని, మనకు విషయ పరిజ్ఞానం ఉండదని కేవలం బట్టీ పట్టే విధానం ఉందని ఈ విద్యావ్యవస్థ డొల్లతనం బయటపెట్డాడు ఒక మహానుభావుడు. అలాగే ఒక రచయిత చెప్పినట్లు ఈ ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరూ వెనక బెంచీల నుండే వచ్చారు. కావున ఒక పరీక్షలో గొప్ప మార్కులు వచ్చాయనీ అవే తుదికంటా ఉంటాయని అదే స్థాయి ప్రతిభ విద్యార్థిలో కొనసాగుతుందని అంచనా వేయడం చాలా పెద్ద తప్పు.

వారికి స్ఫూర్తి కథలు చెప్పండి..

ఈరోజు గొప్ప పదవుల్లో ఉన్న నాయకులు, పెద్ద ఉద్యోగాలు చేసేవారంతా నూటికి ఎనభై శాతం తొంభై శాతం మార్కులు వచ్చినవారుండరు. కేవలం అత్తెసరు మార్కులతో పాసై తర్వాత వాళ్ల పట్టుదలతో ప్రతిభను సృజనాత్మకతను మెరుగుపరచుకొని జీవితంలో అనుకున్న ఆశయాలను నెరవేర్చుకున్నవారే ఎక్కువ. అయితే ప్రస్తుతం పరీక్షల ఫలితాల్లో తమ బిడ్డలకు అత్యధిక మార్కులొస్తే సోషల్ మీడియాలో ప్రదర్శించి కుతూహలం ప్రదర్శిస్తున్నారు. కానీ దీని ప్రభావం తక్కువ మార్కులొచ్చిన, ఫెయిల్ అయిన విద్యార్థులపై ప్రభావం పడుతుంది. ఈ నిరుత్సాహం ఆత్మహత్యలను ప్రేరేపిస్తుంది. విద్యార్థులకు తక్కువ మార్కులొస్తే తల్లిదండ్రులు కూడా సమాజంలో తమ గౌరవం తగ్గుతుందని దానిద్వారా తలెత్తుకొని జీవించలేమనే భ్రమను మన విద్యా వ్యవస్థ నూరిపోసింది. అయితే వాస్తవానికి దీనికి పరిష్కారం ఉపాధ్యాయులే సూచించాలి. మార్కులు తక్కువొచ్చినప్పటికీ సమాజంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో చెబుతూ ఆశావాద భావాలను ఇనుమడింపజేయాలి.

ఈ మధ్య కాలంలో మార్కులు తక్కువగా వచ్చాయని కొందరు, పరీక్షలు సరిగా రాయలేదని మరికొందరు, ఫెయిలయ్యామని ఇంకొందరు.. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులు ఎందరో ఉన్నారు. అసలు ఆత్మహత్య చేసుకునే స్థితిని ఒక విద్యార్థి బుర్రలోకి మన సమాజమే ప్రేరేపిస్తుంది. అందుకే ఇది అందరూ కలిసి చంపిన సామాజిక హత్య అవుతుంది. ఇంటి పక్కల వాళ్ళు సూటిపోటి మాటలనడం తల్లిదండ్రులు కొట్టడం, ఎదుటివారి విద్యార్థులతో పోలికలు పెట్టడంతో తమలోని సున్నితమైన మనసుపై తీవ్ర ప్రభావం చూపి కండ్లముందర పెరిగిన బిడ్డలు ఉరితాళ్లకు వేలాడుతున్నారు. తల్లిదండ్రులు వీలున్నప్పుడల్లా మీ బిడ్డలకు మీ అనుభవాలను పాఠాలుగా చెప్పండి. ఒక్కపూట తిండిలేక పడిన బాధలు పూసగుచ్చినట్లు ధారబోయండి. కష్టాల నష్టాల సమయంలో మీరెట్లా ఈ జీవితపు సంద్రాన్ని ఈదినారో బోధించండి. రూపాయికి కూలీచేసి పరిగ కంకులను ఏరుకొచ్చి ఆకలితీర్చిన ఆవేదనల జీవితసారాలను చెప్పండి. విద్యార్థులకు మీ కథలే స్ఫూర్తిని రగిలించి కొత్త ఆశలు చిగురిస్తాయి.

ప్రతిభకు కొలమానం అవి కాదు..

విద్యార్థులను చైతన్యపర్చడానికి, తక్కువ మార్కులొచ్చిన, ఫెయిల్ అయిన వారు జీవితంలో అత్యంత విజయాలు సాధించిన కథలు మనకు సాహిత్యంలో అనేకం ఉన్నాయి. పంచతంత్ర కథలు, వరదరాజు కథ, కండ్లు లేకున్నా కలెక్టర్ అయిన ఘటన, అబ్రహం లింకన్ పరాభవం వంటి అనేకం మనకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా విద్యార్థులు ఉత్తేజితమై రేపటిలోకి ఆశా దృక్పథం చిగురు తొడుగుతుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కార్పోరేట్ విద్యాసంస్థలు కూడా విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆ సంస్థలు మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కోసం విద్యార్థులకు విషయ అవగాహన విధానం పక్కకుదోసి బట్టీ పట్టే విధానం అవలంభించడం వలన సృజనాత్మక శూన్యత ఇమిడిపోయి చదివినంతసేపే గుర్తుండి కేవలం పరీక్షలకోసం మాత్రమే సన్నద్ధం చేసే విద్యా సంస్థలను ప్రభుత్వాలు కట్టడి చేయాలి. ఆకాశానికే పున్నమి అమావాస్య ఉంటుంది. మనిషి జీవితంలో కూడా ఓటమి పునాదేసుకొని కట్టకట్టుకుని ఉండదు. ఈ సమాజంలో చదువులేకున్న, చదువులో వెనకబడిన, చదువులో ఫెయిలైన ఎందరో గొప్ప వ్యక్తులుగా మారారు, చరిత్రను తిరగరాశారు. మార్కుల ఉచ్చులో పడి విద్యార్థుల భవిష్యత్తును తూకమేయకండి. మార్కులేమీ ప్రతిభను కొలవడానికి అసలైన తూనికలు కావు. పరీక్షల ఫలితాలు వెలువడుతున్న సమయంలో కవులు, రచయితలు, ఉపాధ్యాయులు, మేధావులు, తల్లిదండ్రులు వారి మానసిక పరిస్థితుల జాగృతికై ఆలోచించాలి, తక్కువ మార్కులొచ్చి కుంగుబాటుకు గురయ్యే విద్యార్థులకు భరోసానిచ్చే బాధ్యత ఈ సమాజానిదే.

అవనిశ్రీ

99854 19424

Advertisement

Next Story

Most Viewed