కేసీఆర్‌ను జనం క్షమించరు ఎందుకో తెలుసా?....

by Ravi |   ( Updated:2022-10-17 18:45:27.0  )
కేసీఆర్‌ను జనం క్షమించరు ఎందుకో తెలుసా?....
X

త ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రాజెక్టులు, ముఖ్యంగా కాళేశ్వరం, పరిశ్రమలకు భూముల కేటాయింపులు, లిక్కర్, విద్య, వైద్యం, ధరణి పేర భూముల డిజిటలైజేషన్, సింగరేణి, విద్యుత్ రంగాలలో ప్రజాధనం విపరీత దోపిడీకి గురైంది. ఈ విషయాలన్నీ ఆయా రంగాల నిపుణులు, మేధావులు, సోషల్ మీడియా, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ద్వారా పదే పదే సమాజం ముందుకు వచ్చాయి. అధికారం దక్కిన మొదటి రోజు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను లోబరుచుకుని అపార ప్రజాధనం దాగిన ప్రతి పాలసీని మార్చివేశారు. ముఖ్యమంత్రి కుటుంబం, ఆయన సామాజికవర్గం, అధికార పార్టీకి దగ్గరగా ఉండే కాంట్రాక్టర్లకు, వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దక్కే విధంగా అధికార దుర్వినియోగం చేశారు.

లిక్కర్ పాలసీ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో యేడాదికి కేవలం రూ.40 వేల కోట్ల అమ్మకాలు జరిగి, రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్ల ఆదాయం వచ్చేది. తెలంగాణలో 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. రూ. 32 వేల కోట్ల నుంచి రూ. 37 వేల కోట్ల ఆదాయం సాధించేలా ప్రభుత్వం లిక్కర్ పాలసీని అమలు చేస్తున్నది, గ్రామాలు, పట్టణాలు, నగరాలలో విపరీతంగా బ్రాందీ షాపులు, బార్లు, పబ్బులకు అనుమతి ఇచ్చారు. లిక్కర్ అమ్మకాలలో దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారు.

అధికారం చేతిలో ఉందని

లిక్కర్ తయారీ, అమ్మకాలు, ఆదాయము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగంలోని రాష్ట్రాల అధికారాల జాబితాలో ఇది ఏడవ అంశంగా ఉంది. అందుకే, రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అపార అధికారాలను ఉపయోగించి ప్రజలను మత్తులోకి నెడుతూ వేల కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నది. అధికార పార్టీ నేతలు బినామీలను పెట్టి మద్యం, డ్రగ్స్ అమ్మి లాభాలు గడిస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు మద్యానికి, డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నాయి. యువకులు, మధ్య వయస్కులు తాగుడుకు అలవాటు పడి అర్ధంతరంగా తనువులు చాలిస్తున్నారు. ఫలితంగా మహిళలు వితంతువులుగా మారుతున్నారు. రాష్ట్రంలో బడా లిక్కర్ కంపెనీలు, కాంట్రాక్టర్లకు అధికార పార్టీ అగ్ర నేతల కుటుంబాలకు అత్యంత దగ్గరి సంబంధాలు ఉన్నయనేది వాస్తవం.

తెలంగాణ ఏర్పడక ముందు వీరి ఆస్తులు గోరంత కాగా, ఎనిమిది సంవత్సరాలుగా అవి అంచెలంచెలుగా పెరిగి నేడు వేల కోట్ల రూపాయాలకు చేరుకున్నాయి. అధికార పార్టీ ఆస్తులు కూడా వేయి కోట్ల రూపాయలకు పెరిగాయి. ఈ విషయాన్ని కేసీఆర్ గత ఏప్రిల్ 28న పార్టీ ప్లీనరీలోనే స్వయంగా ప్రకటించారు. అక్రమంగా వారు పొందిన భూముల విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ కేసులో హైకోర్టు ఇప్పటికే ముఖ్యమంత్రికి వ్యక్తిగత నోటీసులు కూడా జారీ చేసింది. ఇంత అవినీతి డబ్బు ఉన్నందున రూ. వంద కోట్లతో విమానం కొనడం విచిత్రం కాదు.

Also read: కపట నాటకంతో వంచన

ఆ సంపాదన సరిపోదని

ఈ అక్రమ సంపాదన సరిపోని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉత్తరాది రాష్ట్రాలలోనూ లిక్కర్ పాలసీలు మార్చివేసారు. ఆయా ప్రభుత్వాలకు అవినీతితో డబ్బు ఎలా సంపాదించవచ్చో నేర్పిన ఘనత కూడా వీరిదే. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి కుటుంబంతో సంబంధాలు కలిగిన కొందరు ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కుంటున్నారు. అరెస్టులు కొనసాగుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులలో జరిగిన అవినీతి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. కాగ్ రిపోర్ట్ కూడా ఈ అవినీతిని ప్రస్తావించినది. 2020లో కల్వకుర్తి ప్రాజెక్టులోని మూడు పంప్ హౌస్‌లు మునిగిపోయాయి. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టులో జరిగిన ఘటనలో 15 మంది ఉద్యోగులు చనిపోయారు. ఇంటర్ పరీక్షల జవాబు పత్రాలు దిద్దిన కంపెనీల నిర్వాకంతో 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 26 లక్షల క్యూసెక్కుల వరదకే 'కాళేశ్వరం' పంపు హౌస్‌లు మునిగిపోయాయి.

వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయ్యింది. పట్టాదారు పుస్తకంలో కబ్జా కాలం తొలగించడం లక్షలాది పేద రైతు కుటుంబాలను నిరుపేదలుగా మార్చింది. ధరణి అక్రమాలతో అనేక మంది చిన్న, సన్న కారు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు అధికార పార్టీ పెద్దల, వారి బినామీ దారుల పేర్ల మీదికి మారాయి. విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు కారుచవకగా కట్టబెడుతున్నారు. 'దళితులకు మూడెకరాల భూమి' ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారు. రెండు పడక గదుల ఇండ్లు కట్టి ఇవ్వలేదు. దాదాపు రెండువేల మంది తెలంగాణ ముద్దుబిడ్డల ప్రాణత్యాగంతో సాధించుకున్న తెలంగాణలో పేదలు బతుకలేని పరిస్థితి వచ్చింది.

Also read: విధులు మరిచిన విపక్షాలు

అడిగితే అణిచివేస్తున్నారు

రాష్ట్రాన్ని అందినకాడికి దోచుకుని, ఇదేమిటని అడిగిన ప్రతి ఒక్కరిని అణచివేసి పోలీస్ పాలనను నెలకొల్పారు. తెలంగాణను మరొక శ్రీలంకగా తయారు చేసారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ నేడు దేశం గురించి మాట్లాడటం విడ్డూరం. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌అర్‌గా మార్చి రాష్ట్రంలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరు. కేంద్రం దేశాన్ని బడా పెట్టుబడిదారులకు, అదానీ, అంబానీకి తాకట్టు పెడితే, కేసీఆర్ తెలంగాణ ప్రజాధనాన్ని తన సామాజిక వర్గానికి, తన కుటుంబానికి, కాంట్రాక్టర్లకు, అధికార పార్టీ నాయకులకు దోచిపెడుతున్నారు. రాష్ట్రంలో ఇంత అవినీతి జరిగినా కేంద్రం 'నిమ్మకు నీరు ఎత్తినట్టు'గా ప్రవర్తిస్తున్నది. వీటన్నింటి మీద సమగ్ర విచారణ జరగాలి. అధికార పార్టీని గద్దె దించితేనే తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేరుతాయి.


-చిక్కుడు ప్రభాకర్

కన్వీనర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక

Advertisement

Next Story

Most Viewed