- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫేక్ న్యూస్‌ను అరికట్టాలి!

ఆధునిక టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని మంచికి వాడుకుంటే మంచి సమా జాన్ని నిర్మించుకోవచ్చు. దానిని చెడుకు వాడుకుంటే! ఆ ఫలితాలతో చెడునే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి కాలంలో "నిజం చెప్పులేసుకోక ముందే ఫేక్ న్యూస్ (అబద్ధం) ప్రపంచాన్నే చుట్టేస్తుంది". అలా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ శరవేగంగా వ్యాపిస్తూ పెత్తనం చెలాయిస్తుంది. ఎంతలా అంటే తప్పుడు సమాచారమే నిజం అనే రీతిలో ప్రచారం చేయడం బాగా పెరిగిపోయింది. ఫేస్ బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలు ఇందుకు వేదికలవుతున్నాయి.
సమాజాన్ని వక్రమార్గం పట్టిస్తూ..
ఎదుటి మనిషి ఓ ఎత్తుకు చేరుకున్నప్పుడు ఆ స్ఫూర్తితో మనము అంతటి స్థాయిని అందుకోవాలని ఆరాటపడడంలో తప్పులేదు. అలాంటి ప్రయత్నమేదీ చేయకుండా బురద జల్లో, రాళ్లు విసిరో మనకంటే ఓ మెట్టు కిందికి లాగాలనుకోవడం ముమ్మాటికీ అనైతి కం. ఇలాంటి తీరు సమాజానికి శ్రేయస్కరం కాదు. ఆధునిక టెక్నాలజీ సాయంతో రూపొందుతున్న ఫేక్, డీఫ్ ఫేక్ వీడియోలు, ఏఐ డీప్ ఫేక్ వీడియోల ఫోటోలు మార్ఫింగ్‌తో ప్రముఖ వ్యక్తులు, రాజకీయ నాయకులు, సినీ తారల వ్యక్తిగత జీవితాలను బజారుకీడ్చడంతో కుటుంబాలు మానసిక ఆవేదనకు లోనవుతున్నారు. ఇవి సమాజాన్ని వక్ర మార్గం పట్టిస్తున్నాయి.
యువతలోనే ఎక్కువ..
ఈ సమస్యపై ఐ ఎస్ బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్), సైబర్ పీస్ అనే సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం అనేక వివరాలు వెలుగులోకి వచ్చాయి.. ప్రస్తుతం వార్తలు, సమాచారం కోసం సామాజిక మాధ్యమాలను చూస్తున్న వినియోగదారుల సంఖ్య దాదాపు 74.89 శాతానికి చేరింది. అందులోనూ 68.21 శాతం మంది వీడియో సమాచారాన్ని ఇష్టపడుతున్నారు. దీంతో అసత్య ప్రచారం 77.4% సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రచారంలోకి వస్తోంది. అందులో ఎక్స్ ద్వారా 61%, ఫేస్ బుక్ ద్వారా 34% అసత్య ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. తప్పుడు వార్తల ప్రభావానికి లోనయ్యే వారిలో 18-24 సంవత్సరాల యువత అధికంగా ఉంటోంది. వీరిలోనూ తక్కువ ఆదాయాలు గల కుటుంబ సభ్యు లు, తక్కువ విద్యార్హతలు గల యువతీ యువకులే ఎక్కువ. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరు తున్న తప్పుడు వార్తల్లో రాజకీయ రంగానికి సంబంధించినవి 46% ఉంటున్నాయి. సాధారణ అంశాలు, మత సంబంధ విషయాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
అవగాహన పెంపొందించాలి!
సామాజిక మాధ్యమాల్లో కనిపించే తప్పుడు వార్త ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు పంపుతున్నారో స్పష్టంగా వెల్లడి కాదు. ఏదో ఒక ఐడీ నుంచి వచ్చి సోషల్ మీడియాలో చలామణి అవుతుంది. ఐడీ కూడా ఫేక్ దే ఉండొచ్చు. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెస్తున్నారు. సమాజంలో టెక్నాలజీ వల్ల జరిగే ఉదంతాలను చూస్తుంటే.. టెక్నాలజీ ఎవరికోసం ఎందుకు వచ్చిందో అర్థం కానీ పరిస్థితి. ఇలా టెక్నాలజీని విచక్షణ కోల్పోయి దుర్వినియోగం చేస్తున్న తీరు అమానుషం. అసత్యాలను నిరోధించడానికి సమిష్టి కృషి ఎంతో అవసరం. సైబర్ సెక్యూరిటీ చర్యలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి. ప్రజలు కూడా సమిష్టి బాధ్యతతో వ్యవహరించాలి. అస(అర్ద)త్యాల ప్రచా రాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలకు పూనుకోవాలి. సాంకేతిక పరిష్కారాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రచార సాధనాలపై ప్రజల్లో చైతన్యం, అవగాహన పెంపొందించాలి.
-మేకిరి దామోదర్
95736 66650
- Tags
- Fake news