- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఢిల్లీలో నూతన తెలంగాణ భవనం నిర్మాణం

దిశ, తెలంగాణ బ్యూరో: భావి అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మాణాన్ని చేపడుతుందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. తెలంగాణ భవన్‌లోని పటౌడీ హౌస్, నర్సింగ్ హాస్టల్, గోదావరి బ్లాక్‌లలో కలియ తిరిగారు. వారికి, రెసిడెంట్ కమిషనర్, ఆర్ అండ్ బీ శాఖకు చెందిన అధికారులు ప్రస్తుతం తెలంగాణ భవన్ లోని మౌలిక సదుపాయాలు, కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను వారికి వివరించారు. ఇక్కడి పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చిన జితేందర్ రెడ్డి ప్రస్తుతమున్న నిర్మాణాలను మెరుగుపరచడంతో పాటు వాటిని ఆధునీకరించే దిశగా అధికారులకు పలు విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ప్రతిపాదిత నూతన తెలంగాణ భవన్ నిర్మాణానికి అవసరమైన సన్నద్ధతే లక్ష్యంగా జితేందర్ రెడ్డి తెలంగాణ భవన్‌ను పరిశీలించారు.
దీనికి ముందు జితేందర్ రెడ్డి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఆర్ అండ్ బీ అధికారులతో సహా తెలంగాణ భవన్ సీనియర్ అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత తెలంగాణ భవన్‌లోని సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, ప్రతిపాదిత నూతన తెలంగాణ భవన్ నిర్మాణానికి వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించే దిశగా ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో వారి విలువైన సూచనల మేరకు నూతన తెలంగాణ భవనన్ నిర్మిస్తామని జితేందర్ రెడ్డి తెలిపారు.
న్యూఢిల్లీని సందర్శించే తెలంగాణ పౌరులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల అవసరాలను సమర్థంగా తీర్చే విధంగా నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామన్నారు. నూతన తెలంగాణ భవన్ సుసంన్నమైన తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఆధునిక నిర్మాణ రీతులు, సమకాలీన సౌకర్యాల కల్పనతో అత్యద్భుతంగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. నూతన తెలంగాణ భవన్ దేశ రాజధానిలో తెలంగాణ అధికారులు, ప్రజా ప్రతినిధులకు కార్యక్షేత్రంగా మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పురోగతికి చిహ్నంగా కూడా నిలుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పౌరులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి కట్టుబడి ఉందని, తెలంగాణ ప్రభుత్వ దార్శనికతకు నూతన తెలంగాణ భవన్ నిదర్శనంగా నిలుస్తుందని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు.