వామ్మో పాముకాటుతో అంతమంది చనిపోయారా!నిపుణులు ఏం చెబుతున్నారంటే

by Ravi |   ( Updated:2022-09-03 15:15:13.0  )
వామ్మో పాముకాటుతో అంతమంది చనిపోయారా!నిపుణులు ఏం చెబుతున్నారంటే
X

గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు పాముకాటుకు ప్రథమ చికిత్స చేసే విధంగా శిక్షణ పొందాలి. హైదరాబాద్ సీసీఎంబీ-లకాన్స్ ముఖ్య శాస్త్రవేత్త డా. కార్తికేయన్ వాసుదేవన్ బృందం మానవులు-పాముల మధ్య జరిగే సంఘర్షణ, పాముకాటు, ఎపిడెమియాలజీ, పాము విషం మీద పరిశోధన చేస్తున్నది. పాముకాటు నివారణ, విష ప్రభావం నియంత్రణతో 2030 నాటికి పాముకాటు మరణాలు, వైకల్యాలను 50 శాతానికి తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యూహం రూపొందించింది. ప్రతి జిల్లాలోనూ ఫారెస్టు, వెటర్నరీ, వైద్య శాఖ అధికారులచే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆ వ్యూహాన్ని అనుసరించాలి. తెలంగాణను పాముకాటు లేని రాష్ట్రముగా నిలిపేందుకు కృషి చేయాలి.

ప్రపంచంలో పాముకాటుతో యేటా దాదాపు 81 వేల నుంచి 1,38,000 మంది మరణిస్తున్నారు. అంతకు మూడు రెట్లు ఎక్కువగా అంగవికలురుగా మారుతున్నారు. అయినా పాలకులు పాముకాటును ముఖ్య ప్రజారోగ్య సమస్యగా గుర్తించడంలో విఫలం చెందారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో పాముకాటును 'నెగ్లెక్ట్ ట్రాపికల్ డిసీస్'గా గుర్తించింది. గత 20 సంవత్సరాలలో మన దేశంలో పాముకాటుతో సగటున యేటా 58 వేల మంది చొప్పున సుమారు 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని 'సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్త్ రీసెర్చ్-2020' అంచనా వేసింది. ఇందులో 70 శాతం మరణాలు ఎనిమిది రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలలోనే జరిగాయని వెల్లడించింది. ఇందులో తెలంగాణ కూడా ఉండడం గమనార్హం. పాము కాటు వేసినప్పుడు నాటు మందు వాడడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. కొద్ది మంది బాధితులకు పాము కాటు వేసిన భాగంలో గాయాలు మానకపోవడం, వాపు రావడం, పాము కుట్టిన అవయవం సరిగా పనిచేయకపోవడం, చూపు మందగించడం లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇంటికే పరిమితమై ఆర్థికంగా, మానసికంగా బాధపడుతూ తమ విలువైన జీవిత క్షణాలను కోల్పోతున్నారు.

వాటిని సంరక్షించాలి

మన రాష్ట్రంలో 34 రకాల పాముల జాతులు మనుగడలో ఉన్నాయి. అందులో నాగుపాము, కట్లపాము, ఇసుక పింజరి, రక్తపింజరి అనే విషపూరిత పాములు ఉన్నాయి. అంతరించిపోతున్న కొండచిలువను షెడ్యూల్-I లో చేర్చారు. ఇది విషం లేని పాము. దీనిపై ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విషపూరిత పాములు కూడా జీవ వైవిధ్యం లో ఒక భాగం. కొన్ని పాములు మనుగడ కోసం ప్రకృతి ప్రసాదించిన ప్రత్యేక విషాన్ని కలిగి ఉంటాయి. ఈ విషం తన ఎరను కదలకుండా చేయడం కోసం, వాటిని చంపడం కోసం ఉపయోగపడుతుంది. అంతే కానీ, పాము మనుషులను కావాలని కాటు వేయదు. పగబట్టి వచ్చి కాటు వేసి చంపదు.

పాములు కూడా ఆహార గొలుసులో సమతుల్యతను కాపాడుతాయి. రైతులకు మిత్రులుగా ఎలుకల జనాభాను తగ్గిస్తాయి. ఎలుకల నుంచి మనుషులకు ప్లేగు, బ్లాక్ డెత్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. ప్రస్తుతం పాములు తీవ్ర ముప్పులో ఉన్నాయి. వాటి నివాస విధ్వంసం, పట్టణ అభివృద్ధి ద్వారా కొన్ని జాతులు రానున్న రోజులలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. సహజంగా మనం పాములను ప్రేమించాల్సిన పని లేదు. కానీ, కనీసం వాటికి హాని కలిగించకుండా దూరంగా ఉండి, వాటి జీవించే హక్కును కాపాడితే చాలు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యూహం

తెలంగాణలో చాలా మందికి పామురాయి గురించి తెలుసు. పాములను హింసించి దీనిని బయటకు తీసి పాముకాటుకు విరుగుడుగా ప్రచారం చేసి అమ్ముతారు. నిజానికి అది పెద్ద మూఢ నమ్మకం. రెండు తలల పాముకు ఔషధ గుణాలున్నాయనే ప్రచారమూ అలాంటిదే. వన్యప్రాణులను హింసించి చేసే అక్రమ వ్యాపారాలను కట్టడి చేయాలి. పాము కాటు వేసినప్పుడు ఆకు పసరులాంటివి ఉపయోగించకూడదు, కాటు వేసిన భాగాన్ని కొయ్యకూడదు. బాధితుడిని నడిపించడం లాంటివి చేయకూడదు. అతడు భయపడకుండా ఉండేలా చూసి, పాము కుట్టిన భాగాన్ని కదపకుండా, తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నిర్లక్ష్యం చేస్తే విష ప్రభావంతో జీవితాలను కోల్పోయే ప్రమాదం ఉంది. పాముకాటు విరుగుడును పాము నుండి తీసిన విషం ద్వారానే తయారు చేస్తారు.

యాంటీ స్నేక్ వేనోమ్ (ASV) ఒక్కటే పాముకాటుకు ఉన్న సరైన చికిత్స విధానం. అందుకే పాముకాటు వేసిన వారిని తొందరగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. జంతువులను కాటు వేస్తే పశు వైద్య కేంద్రానికి తీసుకెళ్లాలి. ఇందుకోసం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో రవాణా సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు పాముకాటుకు ప్రథమ చికిత్స చేసే విధంగా శిక్షణ పొందాలి. హైదరాబాద్ సీసీఎంబీ-లకాన్స్ ముఖ్య శాస్త్రవేత్త డా. కార్తికేయన్ వాసుదేవన్ బృందం మానవులు-పాముల మధ్య జరిగే సంఘర్షణ, పాముకాటు, ఎపిడెమియాలజీ, పాము విషం మీద పరిశోధన చేస్తున్నది. పాముకాటు నివారణ, విష ప్రభావం నియంత్రణతో 2030 నాటికి పాముకాటు మరణాలు, వైకల్యాలను 50 శాతానికి తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యూహం రూపొందించింది. ప్రతి జిల్లాలోనూ ఫారెస్టు, వెటర్నరీ, వైద్య శాఖ అధికారులచే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఆ వ్యూహాన్ని అనుసరించాలి. తెలంగాణను పాముకాటు లేని రాష్ట్రముగా నిలిపేందుకు కృషి చేయాలి.

శ్రీనివాస్ సిరిపురం

ఎపిడెమియాలజీ రీసెర్చ్ స్కాలర్

85003 70612

Advertisement

Next Story