విస్తరిస్తున్న డ్రగ్స్ వ్యాపారం!

by Viswanth |   ( Updated:2023-03-16 19:15:35.0  )
విస్తరిస్తున్న డ్రగ్స్ వ్యాపారం!
X

భారతదేశంలో డ్రగ్స్ వ్యాపారం విస్తరిస్తున్నది. దేశంలో డ్రగ్స్ కేంద్రాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ నెల 12న అస్సాంలో 20 కోట్ల రూపాయల విలువ గల హిరాయిన్‌ను పట్టుకున్నారు. ఒకరిని అరెస్ట్ కూడా చేశారు. ముంబై, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌లను తలదన్నే విధంగా గుజరాత్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా తయారు అయ్యింది. ఓడరేవుల నుంచి, విమాన మార్గం నుంచి ఆఫ్ఘానిస్తాన్, మయన్మార్, పాకిస్తాన్, ఇరాన్‌ల నుంచి వివిధ రకాల డ్రగ్స్ వస్తున్నాయి. వాటిని పంజాబ్, ముంబైలలో అమ్ముతున్నారు. ఇప్పుడు గుజరాత్ కూడా డ్రగ్స్ సరఫరాకు కేంద్రం అయింది. ఇటీవల 21,000 కోట్ల విలువగల మూడువేల కిలోల హెరైన్‌ను గుజరాత్‌లో ఓడరేవు నుంచి పట్టుకున్నారు. ఈ ఓడరేవు గుజరాత్‌కి చెందిన వ్యాపారవేత్త అదానికి చెందిన ఓడరేవు.

వీరు అరెస్టు కాకపోవడానికి కారణం!

గత 27 ఏండ్ల నుంచి గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటిదాకా పలు సందర్భాల్లో పట్టుబడిన డ్రగ్స్ విలువ 75 వేల కోట్లు దాకా ఉంటుంది అంటున్నారు. గతంలో‌ను ఒకసారి 35,000 కోట్ల రూపాయల విలువ గల డ్రగ్స్ పట్టుకున్నారు. 350 కోట్ల విలువగల చరస్ పట్టుకున్నారు. ముంబై‌లో సముద్ర మార్గంలో వచ్చిన డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. గత ఏడాది 1,026 వేల కోట్ల విలువగల 513 కేజీల డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ ఓవర్‌డోస్ కారణంగా 2017లో 745 మంది, 2018లో 875 మంది, 2020లో 514 మంది, 2021లో 700 మందికి పైగా మృత్యువాత పడినట్లు ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ తెలుపుతుంది. గుజరాత్‌లో ఇందుకు సంబంధించి ఒక పెద్ద నెట్‌వర్క్ ఉంది. ఇక్కడ డ్రగ్స్ శుద్ధి చేసే ఫ్యాక్టరీలు, భారీగా ల్యాబ్‌లు కూడా ఉన్నాయి. అందుకే గుజరాత్ డ్రగ్స్‌కు ఒక అడ్డాగా మారింది. అరెస్టులు కేవలం చిన్నస్థాయి వారివే జరుగుతున్నాయి? అసలు ఈ నెట్‌వర్క్‌లో పెద్దోళ్ళు తప్పించుకుంటున్నారా? లేక రాజకీయ ఫండింగ్ పొందుతున్న వారి అండదండలతో తప్పిస్తున్నారా అనేది తెలియదు. ఇంత పెద్ద నెటవర్క్‌కు పెద్దల అండదండలు ఉండే ఉంటాయి అందుకే అరెస్ట్‌లు జరగడంలేదు. గతంలో పంజాబ్ బార్డర్‌లో డ్రగ్స్ శుద్ధి కేంద్రాలు ఉండేవి. ఇప్పుడవి గుజరాత్ షిఫ్ట్ అయినా, ఒకటీ, అర పంజాబ్‌లోనే ఉన్నాయంటారు. ఇటీవల విడతల వారీగా హోమ్ మంత్రి అమిత్ షా ఒక లక్షకు పైగా కిలోల డ్రగ్స్‌ను తగలబెట్టారు. ఆ సందర్భంగా యువత‌ను డ్రగ్స్ నుంచి కాపాడాలని, ప్రభుత్వం కృషి ఫలిస్తుందన్నారు. నిజానికి చెదల మాదిరి డ్రగ్స్ యువతను నిర్వీర్యం చేస్తున్నాయి. దీనికి కారణం అయిన ఆ చీకటి బహిరంగ వ్యాపారంలో బిగ్ ఫేస్ ఎవరిది తేలాలి.

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్!

ఏఐఐఎంఎస్ రిపోర్ట్ ప్రకారం డ్రగ్స్ అడిక్ట్ దేశంలో 18 లక్షల మంది ఉంటే అందులో 4.6 లక్షల మంది పిల్లలు ఉన్నారు. యూజర్స్ కేటగిరిలో 12.6 లక్షల మంది ఉన్నారు. ఇది అక్టోబర్ 2021లోని రిపోర్ట్, అయితే ఈ ఏడాది కాలంలో డ్రగ్స్ వ్యాపారం, దిగుమతి పెరిగిన కారణంగా యూజర్స్ సంఖ్య పెరిగి ఉంటుంది. 2022 జూలై 9 లెక్కల ప్రకారం భారతదేశంలో వంద మిలియన్ల మంది కోకైన్, కన్నబిస్, హెరైన్ లాంటి డ్రగ్స్ వాడుతుంటారని సమాచారం. యూపీ, బెంగాల్, ఢిల్లీ, మణిపూర్, బీహార్‌లలో హెరైన్‌ను యూత్‌లో యావరేజ్‌గా 10 నుంచి 17 శాతం మంది వినియోగించుతున్నారు. ఇంటర్ నేషనల్ స్ట్రీట్ మార్కెట్‌లో ఒక కేజీ డ్రగ్స్‌కు 7 కోట్ల రూపాయలు పలుకుతున్నది. దేశంలోని డ్రగ్స్ ప్రభావం ఉన్న మొత్తం 272 అతి ఎక్కువ జిల్లాల్లో నషా ముక్త్ భారత్ అభియాన్‌ను కేంద్రం అమలు చేస్తున్నది. ఇందుకోసం 13,000 మంది వాలంటీర్లను నియమించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2017 -2019 మధ్యన ఓవర్ డోస్‌తో మరణించిన వారిలో 55 మంది 14 సంవత్సరాల లోపు వయస్సు వారు ఉండడం మన దేశంలోని డ్రగ్స్ తీవ్రతను స్పష్టం చేస్తున్నది. 30 నుంచి 45లోపు వయస్సు ఉన్నవారు మృతుల్లో 745 మంది ఉన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారిని కౌన్సిలింగ్ చేయడం లాంటి చర్యలేవి కూడా తక్కువే చేస్తున్నాయి. అసలు దేశంలోనికి రాకుండానే కట్టడి చేసే మార్గాన్ని అన్వేషించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అది పాటిస్తే మంచిది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా, కేంద్రం క్యాబినేట్‌లోని మరో ఆరుగురు మంత్రులు, అంబాని, అదానిలది కూడా గుజరాత్ రాష్ట్రం దేశానికి మోడల్ అంటారు. దేనికి? ఇప్పుడు డ్రగ్స్‌కు కేంద్రం అయినందుకే మోడలా, లేక నాణ్యమైన పనిచేయని కారణంగా వందేండ్లకు పైగా చరిత్ర ఉన్న మోర్బీలోని హ్యాంగింగ్ వంతెన కూలి 150 మంది అమాయక ప్రజలు, అందులో 56 మంది చిన్నారులు ఊపిరి కోల్పోయినందుకే నా మోడల్ అనాలా? పీఎం మోడీజీ చెప్పండి. ఎన్నికలు, అధికారం ఇదేనా పాలన. దేశాన్ని కాస్త పట్టించుకోండి, దేశ ప్రజల గోడు వినండి!

ఎండి.మునీర్

9951865223

Advertisement

Next Story