కుక్కలవి.. ఆకలి దాడులు

by Ravi |   ( Updated:2024-07-28 00:30:27.0  )
కుక్కలవి.. ఆకలి దాడులు
X

మనిషి, లేదా మనుషులతో ఎక్కువగా మచ్చిక చేసుకునే జంతువుల్లో కుక్కలు ప్రత్యేకం. ఇందులో సందేహం లేదు. మనతో చాలా సులువుగా జర్నీ చేస్తాయి. విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకున్నది కూడా కుక్కలే. వాటిని ఇంట్లో కాపలాగా పెట్టు కుంటాం. మనుషుల కంటే ముందుగా ప్రమాదాన్ని గుర్తించగల శక్తి కుక్కలకు ఉంటుంది. అయితే ఇతర జీవులతో కూడా మనిషికి సంబంధం ఉందన్న విష యాన్ని మరిచి, స్వార్థంగా మారిపోతున్నాడు మనిషి.

3 లక్షలకు పైగా కుక్క కాట్లు..

ఇలా విశ్వాసానికి బ్రాండ్ ఐన కుక్కలు ఇప్పుడు చిన్న పిల్లలు, వృద్ధులపై దాడులు చేస్తున్న సంఘటనలు వింటుంటే ఆందోళన కలిగిస్తున్నాయి. వీధి కుక్కల దాడిలో చిన్నారులు, వృద్ధులు బలైపోతున్నారు. వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోవడంపై ఇటీవల హైకోర్టు కూడా సీరియస్ అయింది. కట్టడి ప్రయత్నాలపై ప్రభుత్వ వైఫల్యం మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క హైదరాబాదు నగరంలోనే 3 లక్షలకు పైగా ప్రజలు కుక్క కాటుకు బలైనట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే వీధి కుక్కల దాడులపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. వీధి కుక్కల దాడులకు బలైపోయిన వారిలో పొట్టకూటి కోసం, బతుకుదెరువు కోసం వచ్చి గుడిసెల్లో ఉంటున్న వారే ఎక్కువ. అందుకే ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదని, ధనవంతుల పిల్లలు అయితే వెంటనే స్పందిస్తారని విమర్శలున్నాయి.

దాడులకు కారణాలు..

అసలు కుక్కలు మనుషులపై ఎందుకు దాడి చేస్తున్నాయి? కుక్కలకి పిచ్చెక్కటానికి కారణమేమిటి? విశ్వాసానికి మారుపేరుగా ఉన్న కుక్కలు ప్రాణాంతకంగా వ్యవహరించడానికి కారణమేంటి? దీనికి ముఖ్య కారణం వాటికి కావలసిన తిండి దొరకకపోవడమే. ఒకప్పుడు వీధి చివరలో ఉన్న చెత్త కుండీలోనైనా వాటికి ఆహారం దొరికేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చెత్తను కూడా తరలించి డంపింగ్ యార్డుల్లో పడేస్తున్నారు. దీంతో కుక్కలకు తిండి దొరకక, రోగాల బారిన పడుతున్నాయి. ఆకలితో మనుషులపై దాడులు చేస్తున్నాయి. వాటికి వ్యాక్సినేషన్ కూడా సరిగా లేదు. ప్రభుత్వ అధికారులు నామమాత్రంగా సమీక్షలు జరిపి చేతులు దులుపుకుంటున్నారు. కుక్కలకు ఆహారం దొరికేలా చే సి, వాటికి వ్యాధులు రాకుండా చేస్తే సమస్య నుంచి బయటపడే చాన్స్ ఎక్కువగా ఉందని మేధావులు అంటున్నారు.

మానవ తప్పిదాలు..

కుక్కల దాడుల వెనుక కూడా మనుషుల స్వార్థం, తప్పిదాలే కనిపిస్తున్నాయి. విశ్వాసంగా ఉన్న కుక్కలు ప్రాణాంతకంగా మారడానికి కారణం మనమే అని గ్రహించాలి. ఉదాహరణకు పార్కుల్లో, లేదా జనసంచారం లేని రోడ్లు, ఇతర ప్రదేశాల్లో కొందరు మద్యం ప్రియులు, తాము తాగిన ప్లాస్టిక్ గ్లాసుల్లో మిగిలిన మద్యం, తిని విడిచిపెట్టిన చికెన్, మటన్ ముక్కలు అక్కడనే వదిలేస్తున్నారు. వాటిని కుక్కలు తిని మద్యం మత్తు తలకెక్కడంతో అటుగా పోయే ప్రజలపైకి దూసుకొస్తున్నాయి. ఆ దాడుల్లో అర్భకులకు, పిల్లలకు గాయాలవుతున్నాయి. మానవ జీవనానికి ముప్పుగా మారుతున్నవన్నీ...మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- పట్ట హరిప్రసాద్,

జర్నలిస్ట్

87908 43009

Advertisement

Next Story

Most Viewed