చర్చా వేదికగా ఐక్యరాజ్యసమితి!

by Ravi |   ( Updated:2023-09-13 23:31:05.0  )
చర్చా వేదికగా ఐక్యరాజ్యసమితి!
X

ఐక్యరాజ్యసమితి ప్రపంచ శాంతి, ప్రపంచ దేశాల ప్రజల హక్కుల రక్షణ కోసం, యుద్ధాల నివారణకు, విపత్కర సమయాల్లో ఆయా దేశాలను ఆదుకోవాలనే గొప్ప ఆశయాలు, సిద్ధాంతాలతో 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. కానీ ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్యలకు ఎటువంటి పరిష్కారం చూపలేకపోతోంది. ఇదే విషయాన్ని ఇటీవలి భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శించి, ఐక్యరాజ్యసమితి దాని అనుబంధ సంస్థ అయిన భద్రతా మండలిలో కీలక సంస్కరణలు తీసుకురావాలని సూచించారు.

ఐక్యరాజ్యసమితి విఫలమైనందునే..

దాదాపు 78 సంవత్సరాల కింద ఏర్పడిన ఐక్యరాజ్యసమితిలోని సిద్ధాంతాలు, నియమ నిబంధనలు ఆనాటి కాలానికి సరిపోతాయి. కానీ మారుతున్న కాలాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా తమ సిద్ధాంతాలు నిబంధనలు మార్చుకున్నప్పుడు మాత్రమే ఆయా సంస్థలు మనుగడ సాగిస్తాయి. అయితే ఐక్యరాజ్యసమితి మాత్రం ఆవిర్భావ కాలం నాటి సిద్ధాంతాలతోనే ఉంటోంది. ఈ కాలానికి తగినట్లు తనని తాను మార్చుకోలేకపోవడంతో అనేక సందర్భాల్లో అపప్రథను ఎదుర్కొంటోంది. ఐక్యరాజ్య సమితిలోని సంస్థాగత లోపాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పలు విపత్కర సమస్యల్ని సమూలంగా పరిష్కరించ లేకపోతోంది. పైగా అన్ని ప్రపంచ దేశాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించలేకపోతోంది. సుమారు వంద కోట్ల అత్యధిక పేద జనాభా కలిగిన 54 ఆఫ్రికా దేశాలకు ఇందులో సరైన ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆయా దేశాల సమస్యలపై తమ గొంతుకను వినిపించే వారు లేకపోవడంతో ఆ దేశాలు పేదరికపు కూపంలో నుండి, ఆకలి చావుల నుండి బయటపడలేక పోతున్నాయి. అంతేగాక పలుదేశాల్లో ఐక్యరాజ్యసమితి పీస్ కీపింగ్ ఫోర్సెస్‌(శాంతి దళాలు) పనిచేస్తున్నప్పటికీ వాటి పనితీరు కోరల్లేని పాములాగా ఉంది. దీంతో వివిధ దేశాలు G7, G20 వంటి పలు కూటములుగా ఏర్పడుతున్నాయి.

వీటో పవర్ దుర్వినియోగం చేస్తూ..

ఐక్యరాజ్యసమితిలో ఆరు రంగాలు ఉండగా, ప్రధానంగా భద్రతామండలి హక్కుల రక్షణలోనూ, యుద్ధ నివారణలోను ప్రముఖ పాత్ర వహిస్తోంది. అయితే ఈ భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ సహా ఐదు దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలు. వీటినే P-5 దేశాలంటారు. ప్రపంచ శాంతి స్థాపనలో ఇతర ప్రముఖ దేశాల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమైనది.. కానీ భద్రతా మండలి ఈ విషయంపై దృష్టి సారించడం లేదు. ఉగ్రవాదం ప్రధాన సమస్యగా కలిగిన భారత్, జపాన్, ఆఫ్రికా, బ్రెజిల్ వంటి ప్రముఖ దేశాలు చాలా కాలంగా పూర్తిస్థాయి సభ్య దేశాలుగా మారుటకు ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడుట లేదు. కేవలం 10 దేశాలకు రెండేసి సంవత్సరాల చొప్పున తాత్కాలిక సభ్యత్వం కల్పిస్తున్నప్పటికీ, ఈ తాత్కాలిక సభ్య దేశాలకు శాశ్వత సభ్య దేశాలతో పోలిస్తే అధికారాలు తక్కువే! తాత్కాలిక దేశాల నిర్ణయాలకు, అభిప్రాయాలకు అంతగా ప్రాధాన్యం లేకుండా పోతున్నది. ఇప్పటివరకు భారత్ ఎనిమిదిసార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికై పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదంపై పలు సందర్భాల్లో చర్యలకు డిమాండ్ చేసినప్పటికీ, చైనాకి పాకిస్తాన్ మిత్ర దేశం కావడంతో ఆ దేశం వీటో అధికారంతో భారత్ సిఫార్సు చేసిన చర్యలకు మోకాలడ్డుతూ వచ్చింది. కాబట్టి ఐక్యరాజ్యసమితి దాని భద్రత మండలిలో కీలక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో జరిగిన పలు విపత్కర పరిస్థితుల్లో భారత్ పెద్దన్నగా నిలిచి సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తూ ప్రపంచ దేశాల మన్ననలు అందుకుంటోంది. కానీ ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న సూచనలకు విలువ లేకుండా పోతోంది. ఇందులో ఉన్న P5 దేశాలు తమ స్వార్థం కోసం వారికున్న వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి.

అన్నింట్లోనూ విఫలం!

ప్రపంచ దేశాల్లో ఎక్కడ యుద్ధం జరిగిన యుద్ధ నివారణ చర్యలు ఐక్యరాజ్యసమితి తీసుకోవాలి. కానీ దాదాపు ఒకటిన్నర సంవత్సరాలకు పైగా సాగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడంలో విఫలమైంది. ఈ యుద్ధం కారణంగా ప్రపంచదేశాలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చమురు, ఆయుధాలు, ఎరువులు, వాహనాలు, పప్పుదినుసుల, వంటనూనె వాణిజ్యం దెబ్బతింది. అంతేగాక ఎందరో వైద్య విద్యార్థులు అర్ధాంతరంగా దేశాన్ని వదిలి రావాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్న ఐక్యరాజ్యసమితి కేవలం నామమాత్రపు చర్యలతో సరిపెట్టింది. ఈ యుద్ధమే కాకుండా అఫ్ఘనిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, సూడాన్ అంతర్యుద్ధం, సిరియా అంతర్యుద్ధం, భారత్ సరిహద్దుపై చైనా దురాక్రమణ, కాశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదుల దాడులు, ఇజ్రాయిల్ లెబనాన్ సరిహద్దుల్లో హత్యలు వంటి ఎన్నో ఉగ్రవాద సమస్యల్ని పరిష్కరించలేకపోతోంది. కనీసం ఇప్పటికైనా ఐక్యరాజ్యసమితి ఈ విషయాన్ని గమనించి చర్యలు చేపట్టాలి. లేకపోతే ప్రపంచ శాంతి కోసం ఏర్పరచిన సంస్థను వివిధ దేశాలు నమ్మే పరిస్థితులు ఉండవు.

నేరడిగొండ సచిన్

జర్నలిజం విద్యార్థి

87907 47628

Advertisement

Next Story