బీజేపీ.. సోషల్ ఇంజనీరింగ్ ఫలించేనా?

by Ravi |   ( Updated:2023-11-02 00:15:07.0  )
బీజేపీ.. సోషల్ ఇంజనీరింగ్ ఫలించేనా?
X

తెలంగాణ రాజకీయంలో పడి లేచే కెరటంలా సాగుతున్న బీజేపీకి కొత్త ఆయుధం దొరికింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ పెద్దలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పరిస్థితి ఫీనిక్స్ పక్షిలా మారింది. ఆకాశాన్ని అందుకోవడానికి తన శక్తినంతా ధారపోసి ఎగిరే ప్రయత్నం చేసే ఫీనిక్స్ పక్షి నేల రాలి బూడిద అవుతుంది. మళ్ళీ బుడుద నుండి ఉద్బవించి మళ్ళీ, మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. ఇది సాహిత్యంలో కాల్పనిక విషయమే అయినా, ఇది తెలంగాణ బీజేపీకి ప్రస్తుతం అచ్చంగా సరిపోతుంది.

హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల విజయంతో మంచి ఊపుమీదున్న బీజేపీకి మునుగోడు ఎన్నికలతో గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. బీజేపీకి మంచి ఊపు ఉన్న సమయంలో అనేక మంది నేతలు వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి వలస వచ్చారు. అంతే వేగంగా బీజేపీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది అన్న పరిస్థితుల్లో బీజేపీ తన అమ్ముల పొదిలో ఈ సామాజిక న్యాయం అస్త్రాన్ని వదిలింది. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించి ఉత్తరాదిలో బీజేపీ జండాను రెపరెపలాడించిన వ్యూహాన్నే తెలంగాణ అనుసరించనుంది. తాజాగా బీసీలకు అత్యధిక స్థానాలు కేటాయించడం ఇటీవల సూర్యాపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించి తెలంగాణ రాజకీయాలలో గేమ్ ఛేంజర్‌గా నిలిచారు.

బీజేపీ పక్కకి బీసీలు..

గత కొన్ని దశాబ్దాలుగా బీసీ వర్గాల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం బలంగా ఉండటం బీజేపీకి రాజకీయంగా కలిసివచ్చే అంశం. తెలంగాణలో బలమైన సామాజిక వర్గాలైన ముదిరాజు, మున్నూరు కాపు, పద్మశాలి, గౌడ, యాదవతో పాటు కుమ్మరి, రజక, గంగపుత్ర, మంగలి లాంటి కులాల్లో కూడా బీజేపీకి ఇప్పటికే బలమైన నాయకత్వం ఉంది. తెలంగాణ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గమైన మున్నూరు కాపులు మొదటి నుండి బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉంటున్నారు. డా. లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, యెండల లక్ష్మీ నారాయణ లాంటి నేతలు ఉన్నారు. సీనియర్ నేత లక్ష్మణ్ అఖిల భారత స్థాయిలో రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్ బోర్డ్ మెంబర్, ఎన్నికల కమిటీ సభ్యునిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. ముదిరాజు సామాజిక వర్గం నుండి ఈటల రాజేందర్ లాంటి నేత తెలంగాణ ఎన్నికల కమిటీ ఇంచార్జ్ బాధ్యతలో ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మున్నూరు కాపు, ముదిరాజు సామాజిక వర్గాల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఒక అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. బీసీ ముఖ్యమంత్రి నినాదం ద్వారా తెలంగాణలో అధికారం చెప్పట్టాలన్న బీజేపీ పెద్దల వ్యూహం ఫలిస్తుందా అన్నది వేచిచూడాలి. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వైపు రెడ్డి సామాజిక వర్గం మారడం, బీసీలు బీజేపీకి దగ్గర అవడం కీలక పరిణామం. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా దేశంలో బీజేపీ మంచి ఫలితాలు సాధించడంతో తన విజయ ఫార్ములాను తెలంగాణలో గూడ ఆచరణలో పెడుతున్నారు.

హిందుత్వ కాదు..

దక్షిణాన హిందుత్వ సిద్ధాంతం కన్నా సోషల్ ఇంజనీరింగ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్లాలని చూస్తున్నట్టు వారి వ్యూహాలు అర్థం అవుతున్నాయి. బీజేపీకి మాతృక ఐన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో గూడా బీసీల నాయకత్వం బలంగా ఉంది. బీజేపీ బీసీ నినాదం వెనుక వ్యూహం కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలదే అయ్యి ఉంటుంది. బీజేపీ మూల సిద్ధాంతం ఐన అంత్యోదయా సూత్రంలో అట్టడుగు వర్గాల సాధికారత భాగం కావడంతో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో ఉన్నారు. బీసీ వాదం అంటే ఒక నినాదం కాకుండా ఒక విధానంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 27 మంది బీసీలకు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మంత్రులుగా అవకాశం ఇచ్చిన ఘనత కూడా బీజేపీదే. ఒకనాడు కేవలం బనియా, బ్రాహ్మణ పార్టీగా ఉన్న బీజేపీని పూర్తిస్థాయి బడుగు బలహీనవర్గాల పార్టీగా తీర్చిదిద్దిన ఘనత కూడా బీజేపీదే. కానీ నరేంద్ర మోడీ కేంద్ర రాజకీయల్లోకి వచ్చిన నాటి నుండి సామాజిక న్యాయం ఒక నినాదంగా కాకుండా ఆచరణలో ఒక విధానంగా కొనసాగిస్తున్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ వారి సాధికారతకు పెద్ద పీట వేస్తున్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇవ్వడం వారి ఆర్థిక అభివృద్ధికి అనేక పథకాలు రూపకల్పన చేయడం సాగిస్తున్నారు. సాంస్కృతిక రంగంలో పద్మశ్రీ అవార్డులు గతంలో పైరవీలు చేసుకున్న వారికి మాత్రమే వచ్చేవి. కానీ మోడీ జమానాలో మాత్రం మట్టిలో మాణిక్యాలను ఏరి కోరి అనేక మంది కళాకారులకు ముఖ్యంగా దక్షిణాది నుండి కోయ, గోండు, దళిత, బీసీ వర్గాల కళాకారులకు అవకాశాలు వచ్చాయి. కోటి మొక్కలు నాటిన రామయ్యకు, ఏడు మెట్ల కిన్నెరతో సామాన్య జీవితం గడుపుతున్న మొగిలయ్యకు పద్మశ్రీలు వరించడం అద్భుతమైన విషయమే.

ఇప్పుడు బీజేపీ దృష్టి అంతా దక్షిణాది రాష్ట్రాలపైనే ఉంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తరువాత, తెలంగాణా తర్వాత తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో అధికారం కోసం ఉత్తరాది నమూనాను దక్షిణాదిలో ఆచరణలో పెడుతున్నారు. తాజాగా తెలంగాణ బీసీ సీఎంను ప్రకటించి అన్నీ పార్టీల కంటే ఆకర్షణీయమైన రాజకీయ నినాదాన్ని తెలంగాణ సమాజం ముందు పెట్టారు. బీసీ సీఎం నినాదం, బీజేపీ అధికారాన్ని కట్టబెడుతుందా అసలుకే ఎసరు తెస్తుందా అన్నది డిసెంబర్ 3న తేలనుంది.

దొమ్మాట వెంకటేష్

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

98480 57274

Advertisement

Next Story

Most Viewed