- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితాలను చేదెక్కిస్తున్న మధుమేహం
నేడు ఆధునిక జీవన శైలికి అలవాటుపడిన మనిషి, అనేక మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో.. శారీరక శ్రమకు దూరమవుతూ అదుపు తప్పిన ఆహార నియమాలతో శరీరాన్ని రోగాల కార్ఖానాగా తయారుచేస్తున్నాడు. దాంతో అధిక రక్తపోటు, మధుమేహంతో గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధుల బారినపడి విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు. ప్రస్తుతం చాలామందిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికీ సోకుతోంది. ప్రస్తుతం చాపకింద నీరులా ప్రపంచ మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ మధుమేహం అభం శుభం తెలియని వారిని సైతం వెంటాడుతోంది. ఇది ఒక అంతర్జాతీయ సమస్యగా పరిణమించి, వైద్య రంగానికే కొత్త సవాల్‌గా మారింది. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య కోట్లకు కోట్లు చేరుతోంది. ఇది ఎయిడ్స్ కంటే వేగంగా వ్యాపిస్తోంది. ఒకప్పుడు మలేరియా, కలరా, ఆటలమ్మ వ్యాధుల్లా మారిన మధుమేహాన్ని నిర్మూలించడం వైద్య రంగానికే ఓ సవాలుగా మారింది.
ఇవే వ్యాధి సంకేతాలు..
డయాబెటిస్ అంటు రోగం కాకపోయినా, వంశంలో ఒక వ్యక్తికి ఉన్నట్లయితే కొన్ని తరాల పాటు ఈ వ్యాధి వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కుటుంబంలోని అందరికీ సోకే ప్రమాదం ఉంది. ఈ రుగ్మత వల్ల దేశాలు, ప్రపంచం యావత్ అతలాకుతలమైపోవడం ఖాయమని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. ఈ మధుమేహం వ్యాధి రెండు రకాలుగా ఉంటుందని వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో ఈ వ్యాధిని డయాబెటీస్ మిల్లిటీస్‌గా పిలుస్తారు అందులో ఒకటి టైప్-1, రెండోది టైప్-2గానూ పేర్కొన్నారు. మానవ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చే మధుమేహాన్ని టైప్-1 కింద పరిగణిస్తారు. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తుంది. ఇక టైప్ -2 ఇది ఇన్సులిన్ పూర్తిస్థాయిలో ఉత్పత్తి అవుతూ పూర్తిగా వినియోగం కాకపోతే టైప్-2గా పరిగణించారు. ఇది ఎక్కువగా పెద్దలకు వస్తుంది. ఇటీవల కాలంలో చిన్న పిల్లలకు రెండు రకాల మధుమేహాలు వస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఇందులో ఆసియా దేశాలే అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.
1991 నుంచి వ్యాధి తీవ్రతను గుర్తించిన అంతర్జాతీయ డయాబెటిక్ ఫెడరేషన్, శరీరంలోని ఇన్సులిన్‌ను కనుగొన్న బాంటింగ్ పుట్టిన రోజునే వరల్డ్ డయాబెటిక్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సర థీమ్ ‘డయాబెటిస్ కేర్ యాక్సెస్’! సకాలంలో చికిత్స, నిర్వహణను నిర్ధారించడానికి సరైన సమాచారం, అవసరమైన సంరక్షణకు సమాన ప్రాప్యతను కలిగి ఉండటం ఈ సంవత్సరం థీమ్! అలసట, విపరీతమైన దాహం వేయడం, ఆకలి ఎక్కువ అవ్వడం, ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం, ఎక్కువగా నీళ్లు తాగాల్సి రావడం, దెబ్బ తగిలితే త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు మధుమేహ వ్యాధికి సంకేతాలుగా పరిగణించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
2030 నాటికి రెండింతలు..
ప్రపంచవ్యాప్తంగా 2014లో 42 కోట్లమంది ప్రజలు మధుమేహంతో జీవిస్తున్నారని అంచనా. 1980 నుండి దీని ప్రాబల్యం దాదాపు రెండింతలు పెరిగింది. వయోజన జనాభాలో ఇది 4.7% నుండి 8.5%కి పెరిగింది. ప్రస్తుతం ప్రతి పదిమందిలో ఒకరు డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రస్తుతం సుమారు 55 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధి బారిన పడినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధిగ్రస్తులు అధికంగా గల దేశాలలో చైనా మొదటి స్థానంలో నిలవగా భారతదేశం రెండవ స్థానంలో ఉన్నది. భారతదేశ జనాభాలో 11.4% అనగా 10.13 కోట్ల జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లు, ఈ సంఖ్య 2030 నాటికి రెండింతలు అవుతుందని సర్వేలు చెబుతున్నాయి.
ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహనను పెంచడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చొరవ చూపాలి. గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి తగు పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలి. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులకు ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలి. ప్రముఖ వైద్యులచే సెమినార్లు ఏర్పాటు చేయాలి. ఆహార నియమాలను పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా ఉంటూ ఆహారంలో తగినంత ఆకుకూరలు, పీచు పదార్థాలు, కోడిగుడ్డు తదితర పదార్థాలు చేర్చడం వల్ల మధుమేహాన్ని నివారించవచ్చునని డాక్టర్లు సూచిస్తున్నారు.
(నేడు అంతర్జాతీయ మధుమేహ నిర్మూలన దినోత్సవం)
- ఏ.వి.సుధాకర్
స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్
90006 74747