బ్యాంకు లాకర్లు, కమామిషు..

by Ravi |   ( Updated:2024-08-06 00:15:42.0  )
బ్యాంకు లాకర్లు, కమామిషు..
X

నేను ఒక బహుళజాతి సంస్థలో, పర్యవేక్షక అధికారిగా ప్రవేశించినప్పుడు జీతభత్యాల జమ కొరకు ఒక బ్యాంకులో ఖాతా తెరవమని చెప్పారు. అది ప్రసిద్ధి చెందిన బ్యాంక్. బహుళజాతి సంస్థ కావడం ఒక కారణం కావచ్చు, ఆ ఖాతా ఒక ప్రత్యేక తరగతికి చెందినది. ఆ ఖాతాకి ప్రత్యేక సదుపాయాలు ఉండేవి. ఉదాహరణకి డిమాండ్ డ్రా ఫ్టుకి చార్జీలు ఉండవు. ఉచితం. అలాగే మరికొన్ని చార్జీలు వర్తించవు. ఉదాహరణకి లాకర్ తీసుకున్నా చార్జీలు ఉండవు. ఖాతా తెరిచినప్పుడు ఒక సంచిలో పెట్టి ఇలాంటి వివరాలున్న కాగితాలు ఇస్తారు. అవన్నీ ఎవరు శ్రద్ధగా చదువుతారు బ్యాంకు వ్యవహారాలన్నీ సజావుగా జరిగిపోతుండేవి. వ్యక్తిగత సంబంధ అధికారి ఉండేవా రు. అప్పుడప్పుడు వారే దూరవాణి చేసి, ఏమయినా అవసరాలు, పరిష్కరించవలసిన సమస్యలు ఉన్నాయా? అని అడుగుతుండేవారు. బ్రాంచి ఉన్నతాధికారి కూడా కలుస్తుండేవారు, ఏమైనా అవసరాలు (రుణాలు, బీమా పథకాల సలహాలు, పెట్టుబడి పథకాలు మార్గదర్శనం) ఉన్నాయా? అని అడుగుతుండేవారు. మొత్తంగా వారు స్నేహపూర్వకంగా ఉండేవారు. ఏమైనా సందేహాలుంటే నివృత్తి బహు చక్కగా చేసేవారు. వారితో మంచి సంబంధాలు ఉండేవి.

కాలచక్రం గిర్రున తిరిగింది. నాకు కొన్నాళ్ల తరువాత ఒక లాకర్ ఆ బ్యాంకులో తీసుకోవాలని కోరిక కలిగింది. బ్రాంచి ఉన్నతాధికారితో మాట్లాడుతూ, ఈ విషయం చెప్పాను. అతను దానిదేం ఉంది, తీసుకోండి! నేను చార్జీలు ఎలా ఉంటాయని అడిగితే అతను లాకరు కొలతలు బట్టి ఉంటాయి. వాటి వివరాలు మా మనిషి వచ్చి వివరిస్తాడు చూడండి ఏమైనా తీసుకోగలరేమో! ఛార్జీలు కొన్ని నా అధికార పరిధిలో, నా విచక్షణలో ఉంటాయి. చార్జీలు లేకుండా చేయగలను.. అన్నాడు సంతోషం అనిపించింది. మరుసటి రోజు ఓ మనిషి భీమా పథకాల వివరాలు పంపించా డు. నాకు ఏది కూడా నా అవసరాలకు సరిపోయినట్టు అనిపించలేదు. బ్రాంచి ఉన్నతాధికారి తరువాత చరవాణి చేసి అడిగితే అదే విషయం చెప్పాను. లాకరు గురించి నేను అడిగితే, ఒకసారి పరిస్థితి చూసి చెప్తానని అన్నారు. సరే నేను ఊరుకున్నాను. తరువాత ఒకరోజు ఆ బ్యాంకు నుంచి నా వ్యక్తిగత బ్యాంకు అధికారి కాల్ చేశారు. ఎప్పటి లాగానే నాకు ఎలా సహాయపడగలనని అడిగారు. నేను లాకర్ గురించి ఎదురు చూస్తున్నానని చెప్పాను. జరిగిందంతా చెప్పాను. ఆశ్చర్యపోవడం అతని వంతు అయ్యింది. మీకు లాకర్ చార్జీలు ఉండవు. మీ ఖాతా ప్రత్యేక తరగతికి చెందినది. మీకు ఎలాంటి ఛార్జీలు ఉండవు అని బ్రాంచి ఉన్నతాధికారితో మాట్లాడి మీకు లాకర్ దొరికేటట్టు చూస్తాను, అని భరోసా ఇచ్చారు.

కానీ పని జరగలేదు. నా వ్యక్తిగత బ్యాంకు అధికారులు మారుతున్నారు. కాలం గడిచి పోతుంది. పాత వారుపోతున్నారు. కొత్త వారు వస్తున్నారు. వచ్చిన వెంటనే నాకు దూరవాణి చేస్తున్నారు. వాళ్లు అదే అడుగుతున్నారు, నేను అదే చెబుతున్నాను. నాకు సహనం చచ్చిపోయింది. నేను పై వాళ్లకు ఫిర్యాదు చేస్తానని చెప్పి, వారి సంప్రదింపు వివరాలు అడిగాను. సహాయ కేంద్రానికి ఎలక్ట్రానిక్ మెయిల్ చేశాను. మళ్లీ వీళ్ల దగ్గరకే వస్తుంది, విషయం పురోగతి ఉండదు.

ఈ మధ్యలో ఇంకొక బ్రాంచి ఉన్నతాధికారి నాకు పరిచయమయ్యారు. అతను నాకు నిర్ణీత గడువు జమారాశులు అభ్యర్ధించారు. సరే, నేను ఇస్తానని చెప్పాను. పనిలో పనిగా లాకర్ అవసరం గురించి చెప్పాను. ఉన్నా యి, ఇస్తాను, అని చెప్పి ఇచ్చా రు. నా హక్కుగా నాకు రావలసిన లాకర్ కోసం బ్రాంచి ఉన్నతాధికారి ప్రవర్తన వలన ఇన్ని పాట్లు పడవలసి వచ్చింది. ఇంత చిన్న విషయానికే అబద్ధాలాడే బ్యాంకు అధికారులకు మనల్ని విమర్శించే హక్కు, యోగ్యత ఉంటుందా?

సీతారామరాజు సనపల,

రక్షణ శాఖ పూర్వ శాస్త్రజ్ఞులు.

72595 20872

Advertisement

Next Story

Most Viewed