ఉచిత విద్యుత్‌కు ఉరివేసే కుట్ర!

by Ravi |   ( Updated:2023-07-16 00:30:53.0  )
ఉచిత విద్యుత్‌కు ఉరివేసే కుట్ర!
X

దాదాపు 60 ఏండ్ల పాటు రైతుల ఆత్మహత్యలకు కారణమై, వాళ్ల ఉసురు పోసుకున్న కాంగ్రెస్​ఇప్పుడు మరోసారి రైతాంగంపై దాని వైఖరిని బయటపెట్టింది. రైతులకు ఉచిత కరెంట్​ఎందుకు? మూడు గంటలు కరెంట్ ​చాలని స్వయంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడే ఘంటాపథంగా చెబుతున్నారు. రేవంత్ ​వ్యాఖ్యలపై తెలంగాణ రైతాంగం భగ్గుమంటున్నది. ‘పంటలు పండవు మీకు నీళ్లెందుకు’ అని అనాడు చంద్రబాబు తెలంగాణ రైతులను, నాయకులను అవమానించేలా మాట్లాడితే, నేడు ఉచిత కరెంట్​ఎందుకు? మూడు గంటల కరెంట్​ చాలదా? అని ఆయన శిష్యుడు రేవంత్​ తానా సభలో తందానా అన్నాడు. రైతులు సహా సొంత పార్టీ నేతల నుంచే చురకలు అంటడంతో నాలుక కరుచుకున్న సదరు నేత.. తన మాటలను ఎడిట్​ చేశారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అయితే, అడ్డంగా దొరకడం.. అడ్డదిడ్డంగా మాట్లాడటం ఆయనకు కొత్తేమీ కాదు.. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలియనిది కాదు. ఒక దిగజారుడు మాట మరుగున పడాలంటే.. మరో పెద్ద అబద్ధం ప్రచారం చేయడం ఆయనకు తెలిసిన కుటిల విద్య.

ఆ కష్టాలు రైతులు మర్చిపోరు!

ప్రస్తుతం రేవంత్ మూడు గంటల కరెంట్​వ్యాఖ్యలు మూలకుపోయి.. మరో కొత్త అంశం తెరమీదకు తేవాలనుకున్న రేవంత్.. ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్​ గురించి అవాకులు చవాకులు పేలాడు. ‘తెలుగుదేశం హయంలో జరిగిన బషీర్‌ బాగ్‌ కాల్పుల ఘటన సమయంలో అప్పటి ప్రభుత్వంలో కేసీఆర్‌ కీలకంగా ఉన్నారని, ఉచిత కరెంట్‌ ఇవ్వడం కుదరదని తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి కేసీఆరేనని, ఆనాడు విద్యుత్తు ఉద్యమంలో రైతులను చంపిన పాపం ముమ్మాటికీ ఆయనదేన’ని రేవంత్​ ఆరోపిస్తున్నారు.

అయితే ఆయనకు తెలియని విషయం ఏంటంటే,ఉచిత విద్యుత్ వద్దన్న వాళ్లకు, పార్టీలకు తెలంగాణ ప్రజలు రాజకీయ సమాధి కట్టారు. కరెంట్‌ సమస్య గురించి ఇప్పుడు ఇంత యాగి చేస్తున్న కాంగ్రెస్​ నాయకులు అసెంబ్లీలో ఒక్కసారైనా ఎందుకు ప్రస్తావించలేదు? తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేండ్ల కాంగ్రెస్‌ పాలనలో అసెంబ్లీలో మొదటి వాయిదా తీర్మానమే కరెంట్‌ కోతలు.. ఎండిపోతున్న పంటలు కాదా? ఒకప్పుడు కరెంట్‌ అతిపెద్ద సమస్యగా ఉండే, ఆ సమస్యను సమూలంగా పరిష్కరించిన నేత కేసీఆర్‌. కాంగ్రెస్​ పాలనలో కర్షకులు పడిన కష్టాలు..ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు ముందు రోజే క్యూలైన్లలో చెప్పులు పెట్టడం అక్కడే పడుకోని పోలీసుల లాఠీ దెబ్బలు తిని పోలీసు బందోబస్తు మధ్య రైతుకు రెండు చొప్పున యూరియా బస్తాలు తీసుకున్న ఘటనలను సైతం మరిచిపోలేదు. స్వరాష్ట్ర పాలనలో రైతులు కొద్దోగొప్పో వృద్ధిలోకి వస్తున్నారని అనుకునేలోపే మళ్లీ కుట్రలు మొదలయ్యాయి.

ఆరు నెలల్లో.. కరెంట్ కష్టాలు తీర్చి

అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్​ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నది. పొలాలకు కరెంట్‌ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతులు రాత్రివేళలో ఇచ్చే కరెంట్‌ కోసం పొలాల్లోకి వెళ్లి పాముకాటు, కరెంట్‌ తీగలకు బలయ్యేవారు. అప్రకటిత విద్యుత్‌ కోతలు, వేళాపాలా లేని సరఫరా తీరుతో రైతులు విసుగెత్తిపోయేవారు. భూగర్భ జలం పుష్కలంగా ఉన్నా కరెంట్‌ లేక రెండో మడికి నీరు అందని రోజులవి. కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, ఆర్థిక భారంగా మరమ్మతు చర్యలతో మోటర్ల వద్దనే అన్నదాతలు రోజుల తరబడి నిరీక్షణ లాంటి ఘటనలు అనేకం చూశాం. కరెంట్​సరిగా ఉండకపోవడం, పంటపెట్టుబడికి పైసా సాయం చేయకపోవడం, ఎరువులు, విత్తనాల కోసం ఎండలో క్యూలైన్లు కట్టడం లాంటి ఘటనలకు నాటి కాంగ్రెస్​ప్రభుత్వం కారణమైతే.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా కేసీఆర్​సర్కారు సాగుకు సకల సౌలత్‌లు కల్పిస్తున్నది.

స్వయంగా కేసీఆర్ ఒక రైతు బిడ్డ కావడం, ఉద్యమ సమయంలో లక్షలాది మంది రైతుల కష్టాలను కండ్లారా చూడటం వల్ల.. ఉద్యమ నాయకుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిష్కరించిన సమస్య విద్యుత్ ​కోతలు. పరిపాలన మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే కరెంట్‌ ఇక్కట్లు పోగొట్టారు. 2018 జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పింది. ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా పంట సీజన్‌కు ముందే రైతులకు అందుబాటులో ఉంచుతున్న సీఎం కేసీఆర్​.. ప్రపంచమే అబ్బురపడేలా భారీ లిఫ్ట్​ఇరిగేషన్​కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. రైతుల సాగునీరు కష్టాలు తీర్చారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో సాగు విప్లవం కనిపిస్తున్నది. కాళేశ్వరం జలాల రాకతో పంటల సాగుపై రైతుకు ధైర్యం దొరకడంతో పాటు భూగర్భ జలమట్టం పెరుగుతున్నది.

రైతు సంతోషిస్తే... కండ్ల మంట

సీఎం కేసీఆర్ ​దార్శనికతలో పురుడుపోసుకున్న ‘రైతుబంధు’ పథకం దేశంలోనే ఒక విప్లవాత్మక స్కీంగా మారింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సహా.. చాలా రాష్ట్రాలు రైతుబంధును కాపీ కొట్టి వేరే పేర్లతో అమలు చేసుకుంటున్నారు. రైతుబంధు పథకం కింద రైతుకు ఎకరాకు ఏడాదికి రూ.10 వేల చొప్పున పంటపెట్టుబడి సాయం అందిస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు పది విడతల్లో 70 లక్షల మంది రైతులకు రూ.65 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్​ సర్కారు. రుణ మాఫీ చేయడంతో పాటు ఇంత పెద్ద మొత్తంలో పంట పెట్టుబడి రైతులకు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే లేదు. ఏటా దాదాపు రూ.14 వేల కోట్ల సబ్సిడీ భరిస్తూ.. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ​ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా ఇదే. కాళేశ్వరం.. మిషన్ కాకతీయ.. ఇతర ప్రాజెక్టుల వల్ల భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగి 27 లక్షల బోరుబావుల కింద అన్నదాతలు రెండు పంటలు పండించుకొని సంతోషంగా ఉంటే.. కాంగ్రెస్​ నాయకుల కండ్లు మండుతున్నయా?

తెలంగాణను.. చీకట్లో నెట్టేందుకే!

లక్షలాది మంది రైతుల భూ సమస్యలకు చెక్​పెట్టిన, అవతవకలకు, అవినీతికి అడ్డుకట్ట వేసిన, పైసా ఖర్చు లేకుండా క్షణాల్లో భూ రిజిస్ట్రేషన్, ఫౌతి మార్పులకు జీవం పోసిన ‘ధరణి’ పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేయాలని మొన్నటిదాకా పిచ్చికూతలు కూసిన కాంగ్రెస్​నాయకులు.. ఇప్పుడు ఉచిత విద్యుత్‌పై కక్షగట్టారు. వరంగల్​రైతు డిక్లరేషన్​పెట్టిన కాంగ్రెస్​పార్టీ రైతులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని హామీ ఇస్తే, రాష్ట్ర నాయకుడు మూడు గంటల కరెంట్​ పాట పాడుతూ రైతులను మళ్లీ కష్టాల్లోకి నెట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నాడు. రేవంత్‌ వెనుక సీమాంధ్రకు చెందిన నాయకుల ప్రోద్బలం ఉండొచ్చు. అందుకే తెలంగాణను చీకట్లలోకి నెట్టేందుకు అలాంటి మాటలు బయటకొచ్చాయి. ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అన్నట్టుగా ఉంది కాంగ్రెస్‌ పరిస్థితి. ఉచిత కరెంట్‌ వద్దని నిస్సిగ్గు ప్రకటన చేసిన కాంగ్రెస్‌. ఇప్పటికే ఉనికి కోసం పాకులాడుతున్న కాంగ్రెస్​ పార్టీని ఇక తెలంగాణ రైతాంగం త్వరలో బొంద పెట్టుడు ఖాయం. రేవంత్​ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. 2023 ముగింపులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాన ఎజెండాగా 24గంటల కరెంట్‌ ఉండబోదన్న వాస్తవం స్పష్టమవుతున్నది. ఉచిత విద్యుత్‌కు ఉరి వేసేందుకు గాంధీ భవన్ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ రైతాంగం, పౌరసమాజం, మేధావులపై ఉన్నది.

బచ్చు శ్రీనివాస్,

సౌత్ ఇండియా వైశ్య యూత్ పరిషత్,

బీఆర్ఎస్ నాయకులు

93483 11117

Advertisement

Next Story