పాలనపై పూర్తి ఏకాగ్రత ఆవశ్యం

by Ravi |   ( Updated:2023-12-20 01:00:57.0  )
పాలనపై పూర్తి ఏకాగ్రత ఆవశ్యం
X

బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసి ఉంటే, చట్టానికి ఎవరూ అతీతులు కారు. గత విధానాలపై పారదర్శక విచారణ, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాల్సిందే. అదే సమయంలో నూతన ప్రభుత్వం పరిపాలనపై దృష్టి పెట్టి నిధుల సేకరణకు తీవ్రంగా ప్రయత్నించాలి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలానికి ప్రజలు మనసు మార్చుకొని, కాంగ్రెసుకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చిచూద్దామని ముందుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది. కనుక కృతజ్ఞతతో ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధినాయకత్వం ఉమ్మడిగా ప్రజలకు అనేక వాగ్ధానాలను చేశారు. ప్రజలు వారి మాటలను విశ్వసించారు. పట్టం కట్టిన ప్రజలకు ఇచ్చిన హామీలను కాలపరిమితి లోపే నిలబెట్టుకొనే వైపు రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టిని సారించాలి.

తప్పుంటే శిక్షించాలి..

బీఆర్ఎస్ ఆర్థిక నేరాలు, అధికార దుర్వినియోగం చేసిందని విపక్షాలు ఆరోపించాయి. నిర్దిష్ట సాక్షాధారాలు ఉంటే, వాటిలో నిజానిజాల నిగ్గును తేల్చడానికి పారదర్శక విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించాలి. సిట్టింగ్ జడ్జికి కానీ, సీబీఐకి గానీ కేసులను అప్పగించాలి. చేతికి మట్టి అంటకుండా నిష్పాక్షిక దర్యాప్తుకు ఆదేశించాలి. విచారణ కక్షసాధింపుగా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ఉండాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసి ఉంటే, చట్టానికి ఎవరూ అతీతులు కారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం పూర్తి ఏకాగ్రతను పాలనపై చూపించాలి. నిధులను సమకూర్చుకోవటంపై ఆలోచనలు చేయాలి.

కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మొదటి నుండి తెలంగాణపై చిన్నచూపు చూసింది. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వాన్ని వేధించింది. వ్యక్తిగత విభేదాలను మనసులో పెట్టుకొని తెలంగాణ ఆకాంక్షలను అనేక విషయాల్లో అణచివేసింది. తెలంగాణ ఏర్పాటు సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా, లోక్‌సభలో మొరపెట్టినా మోదీ ఏ ఒక్కదానికీ స్పందించ లేదు. పదేళ్ల పాలనలో ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం నియమాలను ఉల్లంఘించి నిధుల దుర్వినియోగం చేసి ఉంటే కారకులను తప్పక చట్టప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా శిక్షించవలసిందే.

ఐక్యతగా ఉండాలి..

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అప్పులు తేకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి, ఒప్పించి రాష్ట్రానికి రావలసిన నిధులను నేర్పుగా రాబట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను సకాలంలో నెరవేర్చేలా ప్రభుత్వాన్ని నడపగలిగితే అంతకన్నా ప్రజలకు కావాల్సింది ఏముంది.

రైతులకు, నిరుద్యోగులకు ఇతర హామీలు నెరవేర్చడం వంటి అనేక ఛాలెంజ్‌లు ప్రభుత్వం ముందు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలు అతి సమీపంగా ఉండగా... అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మాని, ముందుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చటంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించాలి.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పాలనపై పట్టు సాధించడంతో పాటు, పార్టీలో కూడా ఐక్యత సాధించాలి. కాంగ్రెస్ నాయకుల మధ్య కీచులాటలు లేకుండా, మీడియా ముందు అంతర్గత విషయాలు బయట పడకుండా చూడాలి. పార్టీలో, ప్రభుత్వంలో ఐక్యత, క్రమశిక్షణ తీసుకు రావాలి. అసమ్మతివాదులు, ఫిర్యాదు చేసేవారు పార్టీలోనైనా ఉంటారు. కాంగ్రెస్‌లో ఈ సంస్కృతి మరికొంత ఎక్కువ గనుక అలాంటి వారిని పార్టీ అధిష్టానం దూరం పెట్టాలి. అధికారం రాగానే ముఖ్య మంత్రి చుట్టూ భజనపరులు చేరటం సహజం. ఆహా, ఓహో అంటే పొంగిపోతే మొదటికే మోసం వస్తుంది. వారిని దూరం పెట్టడం ఆయనకు, పార్టీకి క్షేమం.

సంక్షేమం, అభివృద్ధిని సమతూకంలో సాధించటం నూతన ముఖ్యమంత్రికి కత్తిమీద సామే. కేంద్రం ప్రభుత్వంతో కూడా సఖ్యతగా మెదిలి నిధులు, పథకాలు యుక్తిగా రాబట్టాలి. కాంగ్రెస్ అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలనలో, పార్టీలో పూర్తి నిర్ణయ స్వేచ్ఛను ఇచ్చి ప్రోత్సహించాలి.

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Advertisement

Next Story