కామన్ మ్యాన్ డైరీ: కార్పొరేట్ కు బలైన 'పూరీ' గుడిసె హోటల్ కథ

by Ravi |   ( Updated:2022-09-03 13:35:01.0  )
కామన్ మ్యాన్ డైరీ: కార్పొరేట్ కు బలైన పూరీ గుడిసె హోటల్ కథ
X

జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామమది. గ్రామ శివారులోనే ఓ పూరి గుడెసె హోటల్. జనంతో కిక్కిరిసింది. కిష్టయ్య పూరీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. కొడుకు సతీశ్​అందరికీ సర్వీస్ చేస్తున్నాడు. కిష్టయ్య హోటల్ ఆ ఊరితోపాటు చుట్టుపక్కల పది గ్రామాలలోనూ ఫేమస్. అక్కడ పూరీ తినేందుకు ఆయా గ్రామాల నుంచి జనం వస్తుంటారు. ఉదయం ఐదు గంటలకు మొదలైన గిరాకీ మధ్యాహ్నం పన్నెండు 12 వరకు సాగుతుంది. కిష్టయ్యకు కూర్చునేందుకు కూడా రికామ్ ఉండదు. భార్య లక్ష్మి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ చాయ్ తయారీ, కౌంటర్ చూసుకుంటుంది. కిష్టయ్య స్థానికంగా పండిన గోధుమలనే కొని పిండి పట్టిస్తాడు. బేసిన్ శాకంగా ఇస్తాడు. కిష్టయ్య పూరీ రుచిగా ఉంటుందనేది స్థానికుల మాట.

జాతీయ రహదారి పక్కనే ఉండటంతో వచ్చిపోయే లారీలవాళ్లు కూడా అక్కడే టిఫిన్ చేసేవారు. సాయంత్రం మిరపకాయ బజ్జీల కోసం పెద్ద క్యూ ఉండేది. కిష్టయ్య హోటల్‌కు మరో ప్రత్యేక ఉన్నది. కట్ మిర్చి చేయడంలో ఆయన దిట్ట. అక్కడికి వచ్చేవారు కట్ మిర్చి కోసం గంటల తరబడి వేచి ఉంటారు. 66 ఏళ్ల వయస్సున్న కిష్టయ్య కూతురు లత పెండ్లి చేశాడు. ఊళ్లోనే ఓ ఇల్లు కట్టుకున్నాడు. కొడుకు సతీశ్ పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నాడు. ఓ రోజు రాత్రి కిష్టయ్యకు నిద్రలోంచి మెలకువచ్చింది. కాలు కదలడం లేదు. చేయీ ఆడటం లేదు. భార్య లక్ష్మిని పిలుద్దామంటే నోటి మాట రావడం లేదు. కుడి కాలు పనిచేస్తున్నది. భార్యను తన్నాడు. ఆమె నిద్ర లేచింది. 'ఏమైందయ్యా' అంటూ ఏడుపు అందుకున్నది. కిష్టయ్య మూతి వంకరపోయింది. పక్క రూంలో పడుకున్న సతీశ్‌ను నిద్ర లేపింది. అతడు వెంటనే ఆర్ఎంపీ కృష్ణకు ఫోన్ చేశాడు. ఆయన వచ్చి చూసి పక్షవాతమని తేల్చాడు. అర్జంటుగా పెద్దాస్పత్రికి తీసుకుపోవాలని చెప్పాడు. ఇంటి పక్కనే ఉన్న చంద్రం ఆటో మాట్లాడుకొని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

*

వైద్యం తరువాత కాలూ, చేయి కొంత పని చేసినా కిష్టయ్య కోలుకోలేదు. నెల రోజులు దవాఖానాలోనే ఉన్నారు. బిల్లు రూ. రెండు లక్షలు అయ్యింది. కూతురు పెండ్లికి, ఇంటికి అప్పటికే డబ్బులన్నీ అయిపోయాయి. ఓ మోతుబరి దగ్గర రూ. రెండు లక్షల అప్పు తెచ్చి బిల్లు కట్టాడు సతీశ్. సొంతూరికి వచ్చేశారు. కిష్టయ్యకు మాట మాత్రమే వస్తున్నది. కాలూ, చేయి పని చేయడం లేదు. లక్ష్మి ఇంటి వద్దనే ఉంటూ భర్తకు సపర్యలు చేస్తున్నది. సతీశ్​దాదాపు నెలన్నర తర్వాత హోటల్ తీశాడు. ఎదురుగా మరో టిఫిన్ సెంటర్ కనిపించింది. మరి కాసేపటికి 'దేశీ చాయ్' అనే మరో కార్పొరేట్ టీస్టాల్ ఓపెన్ అయ్యింది. ఇంతకు ముందు హోటల్‌లో తల్లి, తండ్రి, తాను పని చేసేవారు. ఇప్పుడు తానొక్కడే. పూరీ, చాయ్, సప్లయ్ అన్ని ఆయనే చేయాలి. కొత్తతరం పిల్లలు చాలా మంది 'దేశీచాయ్‌'కి అలవాటు పడ్డారు. సతీశ్ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చి 'నాన్నకు ఎలా ఉంది?' అని అడుగుతున్నారే కానీ, చాయ్ మాత్రం 'దేశీచాయ్'లోనే తాగుతున్నారు. పూరీ తయారు చేయడం మొదలెట్టాడు సతీశ్. మధ్యాహ్నం వరకు పది ప్లేట్లు మాత్రమే అమ్మాడు. ఓ పది మంది చాయ్ తాగారు.

*

సతీశ్‌లో టెన్షన్ పెరుగుతోంది. గిరాకీ కావాలంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు. సాయంత్రం మిర్చీ తయారు చేయలేదు. ఫ్రెండ్స్‌ను పిలిచాడు. 'ఏం చేద్దాం, గిరాకీ పడిపోయింది. ఇప్పుడెలా?' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 'గుడిసె మనకు మైనస్. పక్కన ఉన్న టిఫిన్ సెంటర్‌లో పూరీతోపాటు ఇడ్లి, వడ, దోశ, పెసరట్టు, బోండాం అన్నీ దొరుకుతున్నాయి. నీ దగ్గర పూరీ మాత్రమే. అదీ శాకంతోనే ఇస్తావ్. నా మాట విని బ్యాంకు లోన్ తీసుకొని దీనిని మాడిఫై చేయి' అని సలహా ఇచ్చాడో మిత్రడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు వద్దని వారించారు. 'నడిచిన కాడికి నడవనీ. మనం ఇప్పటికే రూ. రెండు లక్షల అప్పులలో ఉన్నం. కొత్తగా అప్పు వద్దు' అన్నారు. కానీ, సతీశ్ వినలేదు. బ్యాంకులో రూ. రెండు లక్షల అప్పుతీసుకొని హోటల్‌ను మోడీఫై చేసేశాడు. పట్నం నుంచి నెలకు 20 వేల జీతంతో మాస్టర్‌ను తీసుకొచ్చాడు. ఆధునాతన వసతులతో హోటల్ ఓపెన్ అయ్యింది. గతంలో ప్లేటు పూరీ రూ. 20 ఉండగా దానిని రూ. 30కి పెంచాడు. మిగతా టిఫిన్లకు ధర నిర్ణయించాడు. ఇది చూసిన పక్క టిఫిన్ సెంటర్ యజమాని 'ఏ టిఫిన్ అయినా రూ. 20 కే' అంటూ బోర్డు ఏర్పాటు చేశాడు. మరో మారు దెబ్బతిన్నాడు సతీశ్. గిరాకీ అంతా పక్క హోటల్‌కే వెళ్తున్నది. నెల గడిచిపోయింది. బ్యాంకు వాయిదా కట్టేందుకు కూడా డబ్బులు మిగల్లేదు. మిత్రుడి దగ్గర అప్పు చేసి వాయిదా కట్టాడు.

*

కిష్టయ్య ఓ రాత్రి పూట నిద్రలోనే కన్నుమూశాడు. తండ్రి అనారోగ్యం కోసం చేసిన అప్పులు, హోటల్ రెనోవేషన్ కోసం చేసిన బాకీలు పెరిగిపోయాయి. తీర్చే మార్గం కనిపించలేదు. ఇల్లు అమ్మేసి అప్పులు కట్టేశాడు. హోటల్ నడవడం లేదు. మాస్టర్‌ను తీసేశాడు. వారం రోజులు బంద్ పెట్టాడు. తల్లిని చెల్లె దగ్గరకు పంపించాడు. హైదరాబాద్​ బస్సెక్కాడు. ఉపాధి వేటలో పడ్డాడు.. చిన్ననాటి మిత్రుడు రమేశ్‌ను కలిశాడు. విషయమంతా చెప్పాడు. ఇద్దరూ కలిసి ఉద్యోగ వేటలో పడ్డారు. సతీశ్‌కు ఓ హోటల్‌లో సర్వర్‌గా కొలువు దొరికింది. నెలకు రూ.15 వేలిస్తామన్నారు. సరేనంటూ జాయిన్ అయ్యాడు. మూడు రోజులు గడిచాక ఇంటికి వచ్చాడు. ఆమెకు సరిపడా సామగ్రి తెచ్చి ఇచ్చాడు. 'పట్నంలో పెద్ద కొలువు చేస్తున్నా, నెలకు రూ.40 వేల జీతం' అంటూ అబద్ధం ఆడాడు.

*

నెల రోజుల తర్వాత లక్ష్మి బిడ్డను తీసుకొని హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు వచ్చింది. డాక్టర్ అపాయింట్‌మెంట్ సాయంత్రం ఉండటంతో భోజనం చేసేందుకు పక్కనే ఉన్న ఓ హోటల్‌కు వెళ్లారు తల్లీబిడ్డలు. సతీశ్​ వీళ్లను గమనించలేదు. ఠక్కున వీళ్లు కూర్చున్న టేబుల్ వద్దకే వచ్చి 'ఆర్డర్ ప్లీజ్' అంటూ మెనూ కార్డు అందించాడు. యూనిఫామ్‌లో అన్నను చూసి లత షాక్‌కు గురైంది. లక్ష్మికి నోట మాట రాలేదు. 'నువ్వు పెద్ద కొలువు చేస్తున్నావంటివి కదరా?' అంటూ భోరుమన్నది లక్ష్మి. 'నా బంగారం ఇస్తా. ఏదైనా దందా చేసుకో బిడ్డా' అంటూ బతిమాలింది. ఇంటికి రమ్మంటూ ప్రాధేయపడింది. హోటల్ ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ముగ్గురు కలిసి ఊరెళ్లిపోయారు. లక్ష్మి తన వద్ద ఉన్న పది తులాల బంగారం ఇచ్చింది. అమ్మితే రూ. ఐదు లక్షలు వచ్చాయి. సిటీ శివారులో 'దేశీచాయ్' ఓపెన్ చేశాడు. తల్లిని తీసుకొని వచ్చి అక్కడే మకాం పెట్టాడు. వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోతున్నది. ఓ వెలుగు వెలిగిన కిష్టయ్య కుటుంబం అనేక మలుపులు తిరిగింది. చివరకు తప్పని పరిస్థితిలో మార్పును స్వీకరించింది.

ఎంఎస్‌ఎన్ చారి

79950 47580

Advertisement

Next Story