వెండి తెరపై బొగ్గు జీవితాలు!

by Ravi |   ( Updated:2023-09-22 23:45:47.0  )
వెండి తెరపై బొగ్గు జీవితాలు!
X

భూమిలో లభించే విలువైన ఖనిజం బొగ్గు. ఇంధన ఉత్పత్తిలో ఇది ప్రముఖ భూమిక పోషిస్తుంది. భారతదేశంలో దామోదర నది ఒడ్డున పశ్చిమ బెంగాల్‌లో రాణి గంజ్ గని ద్వారా 1774 నుంచి మెస్సర్స్ సమ్మర్ హిట్లీ ఆఫ్ ఇండియా కంపెనీచే బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. తదనంతరం ప్రస్తుతం కోల్ ఇండియా అనుబంధ సంస్థల ఆధీనంలో, దక్షిణ భారతదేశంలో సింగరేణి కాలరీస్ కంపెనీ ద్వారా 1889 నుంచి బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. అయితే బొగ్గు గని కార్మికులు అనుభవిస్తున్న కష్టాలు, వారు ఎదుర్కొనే ప్రమాదాలు, అధికారులచే శ్రమ దోపిడీ‌ని తెరకెక్కించడం బాలీవుడ్‌లో 1980 దశకంలో ప్రముఖ హిందీ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన ‘కాలా పత్తార్’ సినిమాతో మొదలైంది. 1979 లో ఝార్ఖండ్‌లోని చసనాలా బొగ్గు గనిలో జరిగిన నీటి ప్రమాదంలో దాదాపు 300 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై ఈ సినిమా తీశారు. అప్పటివరకు బాలీవుడ్ కేవలం ప్రేమ, ముంబై మాఫియా, ఇండో-పాక్, ఇండో-చైనా యుద్దాలపై చిత్రాలు వచ్చాయి తప్ప బొగ్గు గనుల కార్మికుల గురించి ఏ చిత్రమూ రాలేదు.

ఝార్ఖండ్‌లోని ధన్ బాద్‌లో మాఫియా ముఠాల వైరంపై 2014లో మనోజ్ బాజ్‌పేయి, నవాజ్ ఉద్దీన్ సిధ్దికి నటించిన ‘గ్యాంగ్ ఆఫ్ వాస్నేపూర్’ వినోద్ ఖన్నా, సునిల్ శెట్టి నటించిన ‘కోయాలంచల్చిత్రం’ సినిమాలలో కథ శక్తి వంతమైన బొగ్గు మాఫియా చుట్టూ తిరుగుతుంది. ధన్ బాద్‌లో అక్రమ బొగ్గు త్రవ్వకాలు, అక్రమ రవాణాపై చిత్రీకరించారు. రణవీర్ సింగ్, అర్జున్ కపూర్ నటించిన ‘గుండే’ చిత్రంలో నడుస్తున్న రైళ్లలో బొగ్గు దొంగతనం చేసి మాఫియా డాన్‌గా మారిన ఇద్దరు మిత్రుల కథగా విడుదలై హిట్ అయ్యింది.

తెలుగు సినిమాలో బొగ్గు జీవితాలు

తెలుగు చలన చిత్ర రంగంలో సైతం బొగ్గు జీవితాలపై సినిమాలు వచ్చాయి. మొట్టమొదటి సారిగా కృష్ణంరాజు నటించిన ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ కొత్తగూడెం ప్రాంతంలో చిత్రీకరించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ, విజయశాంతి నటించిన చిత్రం ‘నిప్పు రవ్వ’ కూడా బొగ్గు గని ప్రమాదం, దళారీల శ్రమ దోపిడీ గురించి తీసిందే. సింగరేణి బొగ్గు గని కార్మికుల నిజ జీవితాలను వెండి తెరపై 'చీకటి సూర్యులు'గా చూపించిన ఘనత విప్లవ నటుడు ఆర్. నారాయణ మూర్తికే దక్కుతుంది. ఈ సంవత్సరం నాని నటించిన ‘దసరా’ చిత్రం కూడా బొగ్గు గని ప్రాంతాల్లో ఉన్న కార్మికుల కథే. ఇందులో పూర్తిగా సింగరేణి కార్మికుల యాసతో కూడిన భాష హైలెట్. యువ హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ చిత్రంలో బొగ్గు గని యూనియన్ లీడర్‌గా నటించారు. అప్పుడప్పుడు కొన్ని సన్నివేశాల్లో బొగ్గు గనిని చూపించినప్పటికీ బొగ్గు గనుల్లో జీవితం ఆధారంగా చిత్రాలు తక్కువగా వచ్చాయి. ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంలో కూడా గోదావరి ఖని ఓపెన్ కాస్ట్ దృశ్యాలు చిత్రీకరించారు.

షూటింగ్ స్పాట్‌గా బొగ్గు ప్రాంతాలు

ప్రస్తుతం దేశం యావత్తు అక్టోబర్ 6న విడుదల కాబడుతున్న అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘మిషన్ రాణి గంజ్’ చిత్రం కోసం ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో 1989 నవంబర్ 13న పశ్చిమ బెంగాల్ రాణి గంజ్ గని నీటి ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను ఒక క్యాప్స్యూల్ ద్వారా బయటకు తీసుకొని రక్షించడం ఇందులోని కథ. ఈ చిత్రం రిటైర్డ్ ఇంజినీర్, ఐఎస్ఎం విద్యార్థి జస్వంత్ సింగ్ గిల్ జీవితం ఆధారంగా నిర్మించారు. జస్వంత్ సింగ్ గిల్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించారు. వెండి తెరపై కాకుండా ప్రముఖ వెబ్ సిరీస్ నిర్మాత ఏక్తా కపూర్ ధన్‌బాద్ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఒకప్పుడు బొగ్గు ప్రాంతం అంటే చిన్న చూపు చూసిన వారు బొగ్గు ప్రాంతాలను ఇప్పుడు షూటింగ్ స్పాట్‌గా గుర్తించడం గొప్ప పరిణామం.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Advertisement

Next Story

Most Viewed