- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అ.. ఆ లు’ రాని స్థితి నుంచి..
ఆయన అలుపెరుగని సినీ ‘బాటసారి’ ‘అ.. ఆ లు’ రాని విజ్ఞాన ఖని, దార్శనికుడు, దాత, భక్తి మాటెరుగని ‘భక్తుడు’. విభిన్నతను వ్యక్తిత్వ సూత్రంగా మలుచుకున్న ‘మహాకవి’. స్టూడియో వ్యవస్థాపకుడు. ఆయనే మహానటుడు.. అక్కినేని నాగేశ్వరరావు. 1924 సెప్టెంబర్ 24న గుడివాడ దగ్గర రామాపురంలో జన్మించిన ఆయనది వ్యవసాయక కుటుంబం. ఆయన చదువురానివానిగా కెరీర్‌ను ప్రారంభించి, ఎన్నెన్నో ఆటుపోట్లను తట్టుకొని, కేవలం ‘ప్రతిభ’ ఆధారంగా ఎదిగి చరిత్రే తన వెంట నడిచేదిగా, తానే ఓ చరిత్రగా నిలిచిన శక పురుషుడాయన. ఇది ఆయన శత సంవత్సరం.
నాస్తికుడైనా.. భక్తి చిత్రాల్లో..
మనిషి ఎంత కాలం జీవిస్తాడో అనేది ప్రశ్న కాదు.. ఎంతమంది హృదయాలలో ‘అమరజీవి’ కాగలడు అనేది అతని మానవత్వ మనుగడపై ఆధారపడి ఉంటుంది. అక్కినేని అటువంటి ‘అమరత్వం’ కలిగి అద్భుత వ్యక్తి. ‘స్వీయలోపంబు లెరుగుట పెద్ద విద్య’ అనేది ఆయన పఠనీయ సూక్తి. ఆచరణీయ వ్యక్తి ‘ధర్మపత్ని’(1940) నుంచి ‘సీతారామ జననం’(1944) మీదుగా అతని నటనా ప్రస్థానం ‘మనం’ తో ముగిసింది. చివరి శ్వాస వరకు నటనే జీవితంగా తనను తాను తీర్చిదిద్దుకున్న ‘మహామనిషి’ నాగేశ్వరరావు. దైవమంటే నమ్మకం లేని నటుడు భక్తుల పాత్రలు పోషించి ‘జీవం’ నింపారు. భక్తతుకారం, చక్రధారి, బుద్ధిమంతుడు, విప్రనారాయణ, మహాకవి కాళిదాసు వంటివి ఆయనకు ‘కళాప్రపూర్ణ’ ‘పద్మభూషణ్'లు వరించేటట్టు చేశాయి. ‘ఆహార్యం’ ‘అంతర్యాల’తో అందరినీ ఆకట్టుకున్నారాయన. ఎన్టీఆర్‌తో తనకు గల పోటీని ఎంతో హుందాగా అంగీకరించి తనకంటూ ఓ స్టైల్ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి 14 సినిమాలు చేశారు. నిర్మాతగా చక్కని అభివృద్ధి గల చిత్రాలు నిర్మించారు. ‘ప్రేమాభిషేకం’ ఓ చరిత్ర. ‘ఆయన భక్తుడి పాత్రల్లోనా’ అని అవహేళన చేసిన వారికి తన నటనతో నిరూపించిన అక్కినేని చిత్రం ‘విప్రనారాయణ’ (1954) ఈ చిత్రం గురించి నాలుగు మాటలు చెప్పుకోవాలి. ‘భరణి’ స్టూడియోస్ రామకృష్ణ, భానుమతి నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు. 17 పాటలున్న చిత్రం. ఘంటసాల గొంతును కాకుండా ఏ. ఎమ్. రాజాతో పాటలు పాడించాడు దర్శకుడు, నిర్మాత రామకృష్ణ. ఈ ప్రయోగంతో విజయం సాధించారు. ఈ చిత్రానికి ముందు 1937లో కస్తూరి నరసింహారావు, కాంచనమాల, టంగుటూరి సూర్యకుమారిలు నటించిన చిత్రం 1938లో కొత్త మంగళం చీను, టీ.వీ. రాజసుందరిలు నటించిన చిత్రాలు వచ్చాయి. ఇవి తమిళంలో కూడా నిర్మించారు.
పాత్రలో పరకాయ ప్రవేశం చేసి..
1954 వ భరణి వారు తీసిన నాగేశ్వరరావు నటించిన ‘విప్రనారాయణ’ 1955లో తమిళంలో కూడా విడుదల చేశారు. (ఎస్. డి. సుందరం తమిళ వెర్షన్ కు సంభాషణ రచయిత) తెలుగులో కథ, మాటలు సముద్రాల సీనియర్ రాశారు. రేలంగి, సంధ్య, ఋష్యీంద్ర మణి, అల్లు రామలింగయ్య, వి. శివరాం తదితరులు నటించారు. ‘దేవదాసు’లో క్లైమాక్స్ దృశ్యాలలో అక్కినేని ఎంతగా ప్రాణం పోశారో, భక్తుడైన ‘విప్రనారాయణు’డిగా అంతకుమించి ఆయన కష్టపడ్డారు. దేవదేవిగా భానుమతి ముందు అక్కినేని నటన ఎంతో ఉన్నతంగా ఉంటుంది. దర్శకుడు రామకృష్ణ నాగేశ్వరరావును భక్తుడిగా ఎంపిక చేసుకొని తప్పు చేశారని విమర్శించిన వారే.. చిత్ర విజయాన్ని, అక్కినేని శిఖరాగ్రస్థాయి నటనను చూసి ముగ్ధులైపోయారు. 1954లో రెండవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో ‘విప్రనారాయణ’ ఉత్తమ చలనచిత్రంగా అవార్డును గెలుచుకుంది. తన జీవితం భగవంతునికే అంకితం అనుకొని పూలదండలు నేసే బ్రాహ్మణుడి పాత్రలో నాగేశ్వరరావు నటన చిరస్మరణీయం.
పౌరాణిక, జానపద చిత్రాలలో ఎన్టీఆర్‌ది తిరుగులేని స్థానం. ఆ సమయంలో అక్కినేని తనను తానే గుర్తించుకొని, తీర్చిదిద్దుకొని ‘నవరాత్రి’ సినిమాలో తొమ్మిది రకాల వివిధ పాత్రలను అద్భుతంగా పోషించి మెప్పించారు. ‘విప్రనారాయణ’తో మొదలైన ఆయన భక్తుడి పాత్రలు భక్తతుకారం, క్షేత్రయ్య, చక్రధారి వంటి చిత్రాలలో కొనసాగాయి. అర్జునుడు, అభిమన్యుడు, కృష్ణుడు (విష్ణువు) వంటి పౌరాణిక పాత్రలను సహితం మెప్పించారు. నటుడిగా అన్ని రకాల పాత్రలను వాటి ‘ఆత్మ’ను తెలుసుకొని పరకాయ ప్రవేశం చేయటం ఆయన నైజం. ‘మహాకవి కాళిదాసు’, ‘జయభేరి’, ‘ తెనాలి రామకృష్ణ’ వంటివి ఆయన నటనా వైదుష్యానికి మచ్చుతునకలు. నవలా నాయకుడిగా, ట్రాజెడీ కింగ్‌గా ఆయనదో ప్రత్యేకమైన నటనా శైలి. ‘ప్రేమనగర్’ ఓ కలికితురాయి. ‘దసరా బుల్లోడు’ ఆయనను ‘డాన్స్’ ఐకాన్‌గా మార్చింది. ‘ఇద్దరు మిత్రులు’ ‘గోవుల గోపన్న’, ‘ధర్మదాత’ వంటి చిత్రాల్లో ‘ద్విపాత్రాభినయం’ చేసి ఆ టైపు చిత్రాలకు ఆద్యుడిగా నిలిచారు. ‘కళ్యాణి’ వంటి చిత్రాలు నిర్మించి తన కళాభిరుచిని చాటుకున్నారు.
పరిశ్రమ ఇక్కడికి రావడంలో కృషి..
‘దేవదాసు’ ఆయనను చిరకాలం అభిమానుల గుండెల్లో ‘చిరంజీవి’ని చేసింది. ‘దేవదాసు’గా అక్కినేనా...డి.ఎల్. కు మతి పోయిందని విమర్శించిన వారికి దర్శకుడు వేదాంతం.. నాగేశ్వరరావు తన నటనా విశ్వరూపంతో ఇచ్చిన దృశ్య కావ్యం ‘దేవదాసు’. ‘తాను ఎటువంటి పాత్రలకు సరిపోతారో అటువంటి పాత్రలకే అక్కినేని పరిమితమయ్యారు’ అంటారు ఎన్టీఆర్. అక్కినేని ఎదుటివారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం కూడా తెలుసు. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్, ఆదుర్తి దగ్గర పనిచేస్తున్న సమయంలో అతనిలోని దర్శకత్వ ప్రతిభను గుర్తించి ‘ఆత్మగౌరవం’ చిత్రానికి దర్శకునిగా ఎంపిక చేశారు. చిత్ర పరిశ్రమ కోసం ఆయన ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ‘సుడిగుండాలు’ ‘మరో ప్రపంచం’ వంటి చిత్రాలతో తనలోని ‘నటుడి’కున్న భిన్న రూపాలను, వైవిధ్యాన్ని ప్రదర్శించారు. సమాజం పట్ల తన బాధ్యతను తెలియజేశారు. కొండలు, గుట్టలుగా ఉన్న ప్రాంతంలో అందమైన అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి చిత్రపరిశ్రమ హైదరాబాద్ తరలిరావడానికి తన వంతు కృషిని ప్రథమంగా ఆయనే చేశారు. తర్వాతది అందరికీ తెలిసిన చిత్ర చరిత్ర. ఆయన వారసులు ‘నట వారసత్వాన్ని’ అందిపుచ్చుకున్నారు. గుడివాడలో కళాశాల నిర్మించి తనలోని విద్యావేత్తకు ఓ చిరస్మరణీయ రూపం ఇచ్చారు. వేలాదిమందికి గొప్ప దానాలు చేశారు. ఆయనలోని నిక్కచ్చితనం అనేది తన జీవితం, కష్టాలు, అనుభవాల నుంచి వచ్చిన జాగ్రత్తలో భాగమేనన్నది అక్కినేనిని దగ్గరగా గమనించిన వారి అభిప్రాయం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన మరిచిపోలేని జ్ఞాపకం. చలనచిత్ర చరిత్రలో అక్కినేని వారిది చెదరని, చెరిగిపోలేని సంతకం.
(అక్కినేని శతజయంతి సందర్భంగా)
-భమిడి పాటి గౌరీశంకర్
94928 58395