- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 ఫ్రేమ్స్ :సినిమా మన వారసత్వ సంపద
వివరాలను రికార్డ్ చేయాలని ఆలోచించకపోవడంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. సినిమాలను ప్రాసెస్ చేసిన ల్యాబులూ పోయాయి. సినిమాల ప్రింట్లే కాదు నెగెటివ్‌లూ పోయాయి. ప్రభుత్వాల సహకారంతో ప్రత్యేక ఫిల్మ్ అర్కయివ్స్ ఏర్పాటు చేసి సినిమాల సేకరణ, పరిరక్షణ, డిజిటలైజేషన్, పునరుద్ధరణ చర్యలకు పూనుకోవాలి. తెలుగు ప్రాచీన సినిమాల పరిరక్షణ కోసం కృషి చేయాలి. కనీసం నటులు, దర్శకులు, నిర్మాతల వారసులైనా వారి తల్లిదండ్రుల సినిమాలు, సినిమాల పోస్టర్లు, పాటల పుస్తకాలు తదితరాలు సేకరించి వాటిని భద్రపరచాల్సిన అవసరం ఉంది. ప్రింట్లని డిజిటైజ్ చేసి అధ్యయనానికి అందుబాటులో ఉంచితే సమాచార కొరత తీరుతుంది. ఏడాదికోసారి ఇటలీ పునరుద్ధరించిన సినిమాలతో ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయవచ్చు.
సినిమా ఉనికిలోకి వచ్చిన అనేక దశాబ్దాల నుంచీ మనకు సినిమా అంటే మూడు గంటల కాలక్షేపం. హీరోలు, హీరోయిజం, అందాల ఆరబోతలు, పాటలు, జోకులు ఇవే ప్రధానంగా సినిమా అంశాలుగా మనం భావిస్తున్నాం. ఇటీవలికాలంలో టీవీలు, ఒటీటీలు నట్టింటిలోకి వచ్చాక సినిమా దాని సంబంధిత కార్యక్రమాలు 24 గంటలూ ప్రజలను ఎంగేజ్ చేస్తున్నాయి. నిజానికి సినిమా ఒక కళ. అందులో కథ చెబుతాం. జీవితం ఉంటుంది. పాత్రలుంటాయి. వాటి బాహ్య అంతరంగ చిత్రణ వుంటుంది. ఆయా పాత్రల నడుమ ప్రేమలు, పగలు, అనుబంధాలు ఉంటాయి. ఆ కథాకాలం నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర చిత్రించబడుతుంది. సినిమా కథా గమనంలో భాగంగా చరిత్ర, సంస్కృతి వారసత్వం ఆవిష్కరించబడుతుంది.
సినిమా ఖచ్చితంగా ఒక చారిత్రక వారసత్వ సంపద. అది మర్చిపోయి కేవలం తాత్కాలిక వినోదంగానే చూడడం అంత్యంత విషాదం. నిజానికి మానవ చరిత్రను నిక్షిప్తం చేసే క్రమంలో సినిమాను కూడా వారసత్వ సంపదగా చూడాలి. అందుకు సినిమా తొలి ఆరంభ రోజుల నుంచీ పరిరక్షించి భద్ర పరచాల్సి ఉంది. దీంతో దృశ్య మాధ్యమంలో అంటే కదిలే సజీవ రూపంలో చరిత్రను కాపాడుకున్నవాళ్లం అవుతాం. ఆనాటి ఫిల్మ్ డివిజన్ సంస్థతోపాటు వ్యక్తులుగా అనేక మంది రూపొందించిన న్యూస్ రీళ్లు, డాక్యుమెంటరీలు, తొలి నాటి గొప్ప సినిమాలు అన్నీ ఆయా కాలం నాటి చరిత్రకు సాక్ష్యాలు. పురావస్తు సంపదను ఎట్లా అయితే రాజ్యాంగ బాధ్యత అనుకుంటామో, అట్లే సినిమాను కూడా మూకీ కాలం నుంచి రక్షించి భద్రపరచాల్సి ఉంది. అయితే, ఆ దృష్టి మృగ్యం. విషాదం. పట్టింపు లేనితనం సినిమావారిలోనే కాదు, ప్రజలలోనూ, రాష్ట్ర, జాతీయ పాలకులలోనూ కూడా ఉండడం ఆమోదించాల్సిన అంశం కాదు.
సంస్థలను విలీనం చేసి
ఇటీవలే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక 'పుణే ఫిల్మ్ అర్కయివ్స్'ని 'నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్'లో కలిపేసి ఫక్తు వ్యాపార సంస్థగా మార్చివేసింది. సినిమావాళ్ల లేదా మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఆ చర్యను అమలు చేసేసింది. ఫలితంగా దాని భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయింది. నిజానికి 1964లో అప్పటి కేంద్రప్రభుత్వం పూనాలో 'నేషనల్ ఫిల్మ్ అర్కయివ్స్ ఇండియా'ను స్థాపించింది. సినిమా ప్రింట్లను సేకరించడం, భద్రపరచడం, అవసరమయిన అధ్యయనం కోసం పంపిణీ చేయడం ముఖ్య లక్ష్యాలుగా నిర్ణయించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ ఆధీనంలో ఏర్పాటయిన అర్కయివ్స్ సినిమా ప్రింట్లతో పాటు పోస్టర్లు, స్టీల్స్, స్లయిడ్స్, స్క్రిప్టులు, రికార్డులు, సినిమా పాటల పుస్తకాల సేకరణ మొదలు పెట్టింది. అర్కయివ్స్ డైరెక్టర్‌గా పి.కె. నాయర్ అద్భుతమయిన సేవలు అందించారు.
ప్రపంచస్థాయిలో సెల్యూలాయిడ్ మాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ అర్కయివ్స్‌లో 1.30 లక్షలకు పైగా ఫొటోలు, 17,000కు పైగా పోస్టర్లు, దాదాపు 12,000 పాటల బుక్‌లెట్స్, 25,000 సినిమా గ్రంథాలను సేకరించింది. 19 ఫిల్మ్ పరిరక్షక వార్డులలో 2 లక్షల ఫిల్మ్ రీళ్లు భద్రపరిచే వసతులను కలిగి వుంది. ఎన్నో అపురూప పాత సినిమా వివరాలు ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. నాయర్ పదవీ విరమణతోపాటు ప్రభుత్వ ఉదాసీనత, సంస్థల విలీనం అర్కయివ్స్ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నది. అంతకు ముందు చేపట్టిన 'నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్' కార్యక్రమంలో భాగంగా ప్రాచీన అపురూప సినిమాల సేకరణ, పరిరక్షణ, డిజిటలైజేషన్, పునరుద్దరణ చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పుణే, ముంబై, హైదరాబాద్, గువాహతీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నయి, తిరువంతపురంలో అర్కయివ్స్ సమావేశాలు ఏర్పాటు చేసి సినిమా ప్రతినిధులతో చర్చించారు. అవన్నీ అటక ఎక్కినట్టే వుంది.
ఆధారాలు మటుమాయం
అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న దేశంగా మన భారత్ నిలుస్తున్నది. 'అధిక సినిమాల్ని అధిక సంఖ్యలో చూస్తున్న'వారిగా భారతీయులకు పేరున్నది. ఆర్థికంగా చూసినా భారతీయ సినిమా రంగం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. దేశంలో నిర్మితమవుతున్న అన్ని భాషా సినిమాల గణాంకాలను చూస్తే హిందీ తర్వాత ఎక్కువ సినిమాలు నిర్మాణమవుతున్నది టాలీవుడ్‌లోనే. హిందీ, తమిళం తర్వాత అత్యధిక వసూళ్లు సాధించే సినిమాలు కూడా తెలుగువే. వ్యాపారాత్మకంగా మెరుగయిన స్థానంలో వున్న తెలుగు సినిమా రంగం చరిత్ర నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించవు. ఇన్ని దశాబ్దాలుగా నిర్మాణమయిన సినిమాల పరిరక్షణ పట్ల కూడా తెలుగు సినిమా రంగంలోని వారికి సోయి లేకపోవడం అత్యంత విషాదం.
దీంతో అనేక గొప్ప సినిమాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఎప్పటికప్పుడు సినిమాలు తీసేసి లాభనష్టాలు చూసుకొని చేతులు దులిపేసుకోవడం అలవాటయిన తెలుగు సినిమా ప్రముఖులకు తెలుగు సినిమాకు సంబంధించిన చరిత్ర పట్ల కనీస పట్టింపు లేకుండా పోయింది. దీంతో అపురూప కళాఖండాలు అందుబాటులో లేకుండాపోయాయి. ప్రభుత్వాలు కూడా అందుకు భిన్నంగా ఏమీ ప్రవర్తించడం లేదు. స్టూడియోలు, సినిమా హాళ్లు కట్టుకోవడానికి గ్రాంట్లు, అప్పులు, సబ్సిడీలు ఇస్తూ వచ్చిన ప్రభుత్వాలు అపురూప కళాఖండాల భాండాగారాలను ఏర్పాటు చేసే కనీస ప్రయత్నం చేయలేదు. దాంతో తెలుగువారి 'దృశ్య చరిత్ర' కు ఆధారాలు లేకుండా పోయాయి.
కొందరివి మాత్రమే అందుబాటులో
సినిమారంగంలోని ప్రముఖుల ఉపరితల జీవిత చరిత్రలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎం.రెడ్డి గురించో, పుల్లయ్య గురించో వెతికితే ఆన్‌లైన్‌లోగానీ, ఆఫ్‌లైన్‌లోగానీ మనకు లభించే వివరాలు అతి తక్కువ. 1930-40 ప్రాంతంలో నిర్మాణమయిన సినిమాల వివరాలు, ఫొటోలు లభించే పరిస్థితి లేదు. ఇక సినిమా ప్రింట్ల సంగతయితే ఏవో కొన్ని మినహా మిగతా వాటిగురించి ఆధారాలే కనిపించవు. ఎన్‌టీ రామారావు, నాగేశ్వరరావులాంటి వారివి కూడా సుప్రసిద్ధ సినిమా వివరాలే లభిస్తాయి తప్ప వారు నటించిన వందలాది సినిమాల వివరాలు, ఫొటోలు లభించవు. అలాంటప్పుడు హరినాథ్, కాంతారావు లాంటి కథానాయకుల సినీ వివరాలు, వారి సినిమాల ప్రింట్లు లభించే అవకాశమే లేదు. వివరాలను రికార్డ్ చేయాలని ఆలోచించకపోవడంతో అవన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
సినిమాలను ప్రాసెస్ చేసిన ల్యాబులూ పోయాయి. సినిమాల ప్రింట్లే కాదు నెగెటివ్‌లూ పోయాయి. ప్రభుత్వాల సహకారంతో ప్రత్యేక ఫిల్మ్ అర్కయివ్స్ ఏర్పాటు చేసి సినిమాల సేకరణ, పరిరక్షణ, డిజిటలైజేషన్, పునరుద్ధరణ చర్యలకు పూనుకోవాలి. తెలుగు ప్రాచీన సినిమాల పరిరక్షణ కోసం కృషి చేయాలి. కనీసం నటులు, దర్శకులు, నిర్మాతల వారసులైనా వారి తల్లిదండ్రుల సినిమాలు, సినిమాల పోస్టర్లు, పాటల పుస్తకాలు తదితరాలు సేకరించి వాటిని భద్రపరచాల్సిన అవసరం ఉంది. ప్రింట్లని డిజిటైజ్ చేసి అధ్యయనానికి అందుబాటులో ఉంచితే సమాచార కొరత తీరుతుంది. ఏడాదికోసారి ఇటలీ పునరుద్ధరించిన సినిమాలతో ఫిల్మ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేయవచ్చు.
వారాల ఆనంద్
94405 01281