చిత్రగుప్తుని సీసీ కెమెరాలు

by Ravi |   ( Updated:2022-09-03 18:25:23.0  )

అదే భూమి అదే నేల

అదే ఆదిత్యుడు అదే చంద్రుడు

అదే ఆకాశం అవే నక్షత్రాలు

అవే ప్రాణులు అవే మానులు

అదే గాలి అదే నీరు

అల్లంత దూరాన ఆ నింగి

ఈ నేలపై వంగినది ఎందుకో!

వంగిన నింగి అందదు ఎందుకో!

వెలుగు పొద్దుల కిరణాలు వంగు

సూర్య-చంద్రులు మునిగి తేల

తాత ముత్తాతలు

కాలానికి వేలాడక కాలం చేసిరి!

కాల చక్ర భ్రమణంలో

తెలియకనే అవని జీవులు అన్నీ

లయమై పోవడం ఎందుకో

అవస్థల దశలు గడుపుట ఎందుకో!

ఈ సూర్య-చంద్రులెందుకో

ఎటులకో వెళ్లి వస్తుంటారెందుకో

అలసిన దేహాలు కునుకు తీయడానికో

ఆదమరచిన ప్రాణుల నిద్రలేపడానికో

వంతులవారీగా

ఈ శివరాత్రి జాగరణలెందుకో!

పగలు ఒకరు రాత్రి ఒకరు

చీకట్లను తరిమే జ్ఞానజ్యోతులు

చిత్రగుప్తుడు వ్రాసే

జీవుల జాతక చిట్టా పద్దులకు

సీసీ కెమెరాలు!

మనిషిలోని మనసుకు కనిపించే

మనిషి రివైండ్ దృశ్యాలు!

పి.బక్కారెడ్డి

97053 15250

Advertisement

Next Story

Most Viewed