- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కులగణన.. ఇప్పుడిదే పార్టీల నినాదం!
సామాజిక వర్గాల పక్కా జనగణన(లెక్కలు) ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చ అయ్యింది! ఆ లెక్క తెలితే అందరికీ న్యాయం జరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రచారంలో పెట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇది ఇప్పుడు ప్రధాన ప్రచార అస్త్రం అయ్యింది. భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్ గాంధీలో వచ్చిన మార్పు కేంద్రంలో, అధికారంలో ఉన్న బీజేపీకి మింగుడు పడడం లేదు. అత్యంత సామాన్యుడిలా ఆయన రైతులు, రైల్వే కూలీలు, మజ్దూర్లు, కార్మికులు, మహిళలు, యువకులు, విద్యార్థులతో కలిసి బస్సులో, రైలులో ప్రయాణిస్తూ, వారితో, వారి జీవితాలు, కష్టాల మీద చర్చించడం, తెలుసుకోవడం, ఎలాంటి, హంగులు లేకుండా సామాన్యుడిలా రావడంతో జనం రాహుల్‌ను ఎంతో ఎత్తుకు తీసుకుని వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. చాలా సాదా, సీదా ఆమ్ ఆద్మీ అయిపోయారు రాహుల్!
ఉక్కిరి బిక్కిరిగా బీజేపీ..
రాహుల్‌ను ఈ విధంగా చూసిన జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీఎం నరేంద్ర మోడీ ఎన్నడూ కూడా ఇలాంటి సామాన్యుని రూపంలో గత పది ఏండ్లలో ఒక్కసారి కూడా కనిపించలేదు. ఆయన హంగు, ఆర్భాటం తెలియంది కాదు! అందుకే ఇప్పుడు జనం రాహుల్, మోడీల వ్యవహార శైలిని బేరీజు వేస్తున్నారు. జాతీయ ఛానల్స్‌లో సైతం దీనిపై స్టోరీలు వస్తున్నాయి. ఇది రాజకీయమా? లేక నిజంగా రాహుల్ నేల మీదికి దిగి దేశాన్ని పరిశీలిస్తున్నాడా? అనేది అంతు చిక్కక బీజేపీ శ్రేణులు ఆగం అయిపోతున్నారు. మహిళా బిల్లులో ఓబీసీల రిజర్వేషన్ మీద చర్చను రాహులే లేవదీశారు. మణిపూర్ హింస మీద ముందు అక్కడికి వెళ్లి ఇరువర్గాల వారిని పరామర్శించింది కూడా రాహుల్ గాంధీ కావడం, అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయంగా పేర్కొనక తప్పదు! తాజాగా జాతీయ జనగణన విషయం లేవదీశారు. ఆయన జాతీయ జనగణన దేశానికి ఎక్స్‌రే లాంటిదని కితాబిచ్చాడు. దీనివల్ల ఆర్థిక, సామాజిక సమస్య తీరుతుంది. కుల ఆధారిత సర్వేని ప్రస్తుతం బీహార్ రాష్ట్రం పూర్తి చేసింది. కాస్ట్ బేస్డ్ సర్వే ద్వారా ఎవరి సామాజికవర్గం ఎంత ఉంటుందో, అదే స్థాయిలో అంత రాజకీయ భాగస్వామ్యం ఉంటుంది అంటున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ! ఓబీసీ, దళిత, ఆదివాసీల, మైనారిటీల ఇతర వర్గాల సంఖ్య లెక్కలు తేలుతాయి! ఇప్పుడు ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ జనం ముందు పెడుతున్నారు. భారత్ జోడో యాత్రలోనూ ఇదే విషయం చెప్పారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 50 శాతం కమిషన్ ఆరోపణలను కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ కూడా చేశారు. ఈ విమర్శలపై ప్రియాంకా మీద 40కి పైగా పోలీస్ స్టేషన్స్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. మొత్తానికి ఇప్పుడు బీజేపీ కొంత పరేషాన్లో ఉంది. పలువురు ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు బీజేపీ పంపింది. తెలంగాణ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొన్న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోను రాహుల్ ఇదే జనగణన విషయాన్ని, అవినీతి, కమీషన్‌ల విషయాన్ని ఫోకస్ చేసారు. కర్ణాటకను కాంగ్రెస్ గెలుచుకున్నది. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్‌లలోనూ వివిధ సర్వేలలో కాంగ్రెస్‌కే మొగ్గు కనిపిస్తుంది.
పీఎం వచ్చినా.. నో మైలేజ్!
తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ కనిపిస్తున్నది. కాంగ్రెస్ తప్పులు చేయకుండా మరో మూడు నెలలు ఇప్పటి లాగే ఉంటే కాంగ్రెస్‌కు పై మూడు హిందీ రాష్ట్రాల్లో గెలుపు అతి సులువుగా ఉండబోతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇది అంత సులువు కాదు! కానీ సీట్లు గతం కన్నా ఎక్కువే వస్తాయని వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సీట్లు యాభై చేరువలో ఉండొచ్చు అంటున్నారు. బీఆర్ఎస్ స్వల్ప మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చనే పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలకు కొంత సమయం దొరికితే లాభం కాంగ్రెస్‌కే ఉండే పరిస్థితి ఉంది. అని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి రాష్ట్రంలో ప్రధాని పర్యటించినప్పటికీ మైలేజీ పెరగలేదు. పెరిగే పరిస్థితులు కూడా లేవు! మరో వైపు వామపక్షపార్టీలు స్వంతంగా పోటీ చేస్తాయా! లేక కాంగ్రెస్ తో పొత్తు చేసుకుంటాయా? అనేది తేలాల్సి ఉంది. బీఎస్పి, టీజేఎస్ తదితర పార్టీల పరిస్థితి కూడా ఇంకా గందరగోళం గానే ఉంది. ఇండియా కూటమితో బీఎస్పీ కలిసే పరిస్థితి లేదు. ఆ పార్టీ 2024 లో ఒంటరి పోటీ అని పార్టీ చీఫ్ మాయావతి ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో బీఎస్పీ రోల్ తెలంగాణాలో ఏమిటి? అనేది తేలాలి! మొత్తానికి తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రచారానికి సమయం ఇచ్చే దానిని బట్టి కాంగ్రెస్ భవిష్యత్ ఉంటుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఇప్పుడు ఓవర్ ఆల్‌గా తెలంగాణలో ఎన్నికల మీద, కాంగ్రెస్ గెలుపు వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ జనగణన, 'ఎంత సామాజిక వర్గానికి అంత భాగస్వామ్యం' స్లోగన్‌ను ఇస్తున్నది. ఆ స్లోగన్ తెలంగాణలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే!
అయితే మరోవైపు ఎంత జనాభా ఉంటే అంత హక్కు అనే కాంగ్రెస్ నినాదం దక్షిణ భారతావనికి అన్యాయం చేసే నినాదం అని పీఎం నరేంద్ర మోడీ అంటున్నారు. దేశంలో పేదరికంను దూరం చేయడమే ప్రధాన లక్ష్యం అని, అన్నింటికన్నా పెద్ద జాతి పేదరికం అంటున్నారు. విపక్షాలు అన్నీ ఈ విషయంలో కలిసి రావాలని ప్రధాని పేర్కొనడం విశేషం! మొత్తానికి జనగణన ప్రకారం హక్కు అనే కాంగ్రెస్ నేత లేవనెత్తిన నినాదం ఇప్పుడు దేశంలో ఒక చర్చనీయాంశం అయిపోయింది!
-ఎండి.మునీర్
సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు,
99518 65223