- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లైంగిక దాడులను ఆపలేమా!?
భారత రాజ్యాంగం అధికరణ 14 ప్రకారం చట్టం ముందూ అందరూ సమానం. ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, లింగ వివక్షతకు తావులేదు. అలాగే ఆర్టికల్ 21 ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కు కలిగి ఉందని చెబుతుంది. స్త్రీలను కన్నార్పకుండా చూడడం, సైగలు చేయడం వంటి అనుచితమైన ప్రవర్తనను లైంగిక వేధింపులు అని వ్యవహరించవచ్చు. ఇటువంటి చర్యకు సహకరించే వ్యక్తులు శిక్షార్హులు.
డిసెంబర్ 11వ తేదీన కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో వంతమూరి గ్రామానికి చెందిన ఒక మహిళపై కొంతమంది దాడి చేసి నగ్నంగా ఊరేగించి ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టి వేసిన సంఘటనను గౌరవ కర్ణాటక హైకోర్టు తీవ్రంగా తప్పుపడుతూ సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మహిళ మాన రక్షణకు చుట్టూ ఉన్న వారెవరు మానవత్వంతో స్పందించకుండా ముందుకు రాని పరిస్థితి దయనీయం. చట్టం పట్ల నిందితులకు భయం లేదని ఈ సంఘటన బట్టి తెలుస్తుంది. ఇలాంటి సమాజంలో బ్రతకడం కంటే చావడం మేలు అనే స్థితి రాకుండా చూసుకోవాలి అని ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ చేపట్టిన దర్యాప్తు వివరాలతో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇటువంటి సంఘటనలు వింటే మనం ఆధునిక సమాజంలో జీవిస్తున్నామా? ఇంకా ఆటవిక సమాజంలో ఉన్నామా? అనే సందేహం కలుగకమానదు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న పరిస్థితులలో మహిళలపై హింసకు పాల్పడటం మానవ జాతికే కళంకం. మహిళల హక్కులను దెబ్బతీసే ఇటువంటి ఘటనలు సమాజానికి హానికరం.
మన దేశంలోనే కాదు..
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వార్షిక నివేదిక 2022 ప్రకారం, 2022 సం.లో భారతదేశంలో మహిళలపై నేరాలు 4% పెరిగాయి. ఇందులో భర్తలు లేదా బంధువుల క్రూరత్వం, అపహరణలు, దాడులు అత్యాచారాలు సైతం ఉన్నాయి. ఈ నివేదిక మహిళలపై నమోదైన నేరాలలో గణనీయమైన పెరుగుదలను వివరించింది. 2020లో 3,71,503 కేసుల నుండి 2022లో 4,45,256 కేసులు పెరిగాయి. ప్రతి లక్షమంది మహిళలపై నేరాల రేటు 2021లో 64.5 నుండి 2022లో 66.4కి పెరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (యన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) ఐదవ రౌండ్ ప్రకారం, భారత ప్రజానీకంలో ఒక ప్రముఖ భాగం భర్తను సమర్థిస్తుంది. సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లడం, అత్తమామలను అగౌరవపరచడం, భర్త విధేయతను అనుమానించడం వంటి కారణాలతో భార్యను కొడుతున్నారు. ఇవి కూడా చట్టరీత్యా నేరం. యూఎన్ ఉమెన్ నివేదిక ప్రకారం 2022లో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 48,800 మంది మహిళలు, లేదా బాలికలు వారి సన్నిహిత భాగస్వాములు లేదా ఇతర కుటుంబ సభ్యులచే చంపబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 6 శాతం మంది మహిళలు తమ భర్త లేదా భాగస్వామి కాకుండా వేరొకరి నుండి లైంగిక హింసకు గురయ్యారని నివేదించారు. ప్రపంచవ్యాప్తంగా 15-19 సంవత్సరాల వయస్సు గల పదిహేను మిలియన్ల కౌమార బాలికలు బలవంతపు సెక్స్ బారిన పడ్డారు.
పరిష్కారాలు
లైంగిక వేధింపులు జరుగుతున్నప్పుడు కొంతమంది మహిళలు మౌనంగా భరిస్తున్నారు. లోలోపల వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బయటకు చెబితే లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడుతున్నారు. మహిళలు భయం వదలి ఫిర్యాదు చేసే స్థాయికి రావాలి. మహిళల పట్ల గౌరవం కలిగి ఉండాలని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. అశ్లీల చలన చిత్రాలు, ఇంటర్నెట్ సైట్‌లను నిషేధించాలి. చట్టపరమైన శిక్షల గురించి అవగాహన కలిగించాలి. అత్యాచారాలు చేసినవారికి వేగంగా శిక్ష పడాలి. సామాజిక మార్పు రానంత వరకు ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. అందరం మంచి సమాజం నిర్మించడంలో భాగస్వాములం కావాలి.
జనక మోహన రావు దుంగ
82470 45230