T-Congress: హామీలు సరే.. అమలు సాధ్యమా?

by Viswanth |   ( Updated:2023-07-20 00:30:27.0  )
T-Congress: హామీలు సరే.. అమలు సాధ్యమా?
X

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రైతు, యూత్, భూమి డిక్లరేషన్లను ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో మహిళా, బీసీ, మైనార్టీ, దళిత వంటి పలు డిక్లరేషన్ల విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ క్రమంలోనే సెప్టెంబర్‌లో పూర్తి స్థాయి మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని ప్రణాళిక రచిస్తోంది. అయితే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేస్తున్న హస్తం నేతలు.. అసలు వాటిని ఎలా నెరవేరుస్తారో మాత్రం చెప్పలేకపోతున్నారు. ప్రజల్లో విశ్వాసం కలిగేలా వివరించలేకపోతున్నారు. రాష్ట్ర బడ్జెట్, హామీల అమలుకు అయ్యే ఖర్చుపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీంతో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌కే సాధ్యం కాని హామీల అమలు... దానికి రెండింతలు చెబుతున్న కాంగ్రెస్‌కు ఎలా సాధ్యమవుతుందని ప్రజల్లో అనుమానం వ్యక్తమవుతున్నది.

అంకెల గారడి చేసినా...

2023-24 ఆర్థిక సంవత్సరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 2.90 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇంత భారీ స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అధికార బీఆర్ఎస్సే పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేకపోతున్నది. కేంద్రం సహకారం లేక, అప్పులపై ఆంక్షలు విధిస్తుండడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అయితే తెలంగాణ రాక ముందు సుమారు రూ. లక్ష కోట్లుగా ఉన్న బడ్జెట్ ప్రస్తుతం రూ. 2.90 లక్షల కోట్లకు చేరింది. ఈ లెక్కన వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 3.10 లక్షల కోట్ల నుంచి రూ. 3.20 లక్షల కోట్లకు చేరుకునే అవకాశమున్నది. ఈ బడ్జెట్‌తో తాము ఇస్తున్న హామీల అమలుకు ఎలా ఖర్చు చేస్తారు? అనే దానిపై ఒక ‘మాక్ బడ్జెట్’ను తయారు చేసి చూపించే సాహసం కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోతున్నదనేది ప్రజల ప్రశ్న. కీలక హామీల అమలుకు ఈ బడ్జెట్ సరిపోకపోతే ఏ పాత స్కీమ్స్‌ను రద్దు చేస్తారు? అడ్జస్ట్‌మెంట్స్ ఎలా చేస్తారు? రాబడిని ఎలా పెంచుతారు? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ జవాబు చెప్పాల్సిన అవసరమున్నది.

నిధులు ఎక్కడినుండి తెస్తారు!

మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ కోసం రూ. 16 వేల కోట్ల వరకు ఖర్చు చేసింది. 90వేల లోపు రుణాలను మాఫీ చేయడానికి 2023-24 బడ్జెట్‌లో రూ.6385 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన కాంగ్రెస్ హామీ ప్రకారం రెండు లక్షల లోపు రుణాలను మాఫీ చేయడానికి కనీసం 30 వేల కోట్లు అవసరమైతాయి. అలాగే రైతుబంధు పెట్టుబడి సాయాన్ని రూ.15వేలకు పెంచుతామనే కాంగ్రెస్ హామీకి 35 వేల కోట్లు, రైతుబీమాకు 1500 కోట్లు, ఉచిత విద్యుత్‌కు 15 వేల కోట్లు ఈ లెక్కన కేవలం రైతులకు సంబంధించే రూ. 50వేల కోట్లు అవసరమవుతాయి. 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు సైతం ఉచిత విద్యుత్‌కు 4వేల కోట్లు, ఫించన్‌ను ‘చేయూత’గా మార్చి రెండు వేలు పెంచి రూ. 4వేలు అందిస్తామంది దీనికి 24 వేల కోట్లు, నిరుద్యోగ యువతకు రూ. 4వేలు నిరుద్యోగ భృతి హామికి, అమరుల కుటుంబాలకు రూ.25 వేల గౌరవ పెన్షన్ కోసం 3 వేల కోట్లు, అలాగే దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామన్నా కాంగ్రెస్ దీనికి 18 వేల కోట్లు, అలాగే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు 3వేల కోట్లు, ఇంకా మహిళ బడ్జెట్‌లో కర్ణాటక లాగా మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ప్రకటించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అలా చేస్తే ప్రతియేటా రూ. వేల కోట్లు అవసరమవుతాయి.

అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫస్ట్ బడ్జెట్‌లోనే ఈ కొన్ని హామీలకే రూ. 1.30 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైతు రుణమాఫీని పక్కన పెట్టినా ఈ హామీల హామీలకే ప్రతియేటా రూ. లక్ష కోట్లు అవసరమవుతాయి. ఇక ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్లు, నిర్వహణ వ్యయం తర్వాత ప్రభుత్వం దగ్గర మిగిలేది తక్కువే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 5లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ప్రభుత్వానికి అప్పులు దొరకడమూ కష్టమే. ఆర్థిక పరిస్థితులు ఇలా ఉంటే.. కాంగ్రెస్ చేస్తామని చెబుతున్న యువతకు ఉచిత స్కూటీలు, రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, వివిధ సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టుల నిర్మాణం, ఇండ్ల స్థలాల పంపిణీ, ఇందిరమ్మ స్కీమ్ లాగా ఇండ్లు కట్టడానికి ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిత్యావసరాల పంపిణీ, ఇతర వాటికి ఎక్కడి నుంచి నిధులు తెస్తుందో స్పష్టం చేయాల్సిన అవసరమున్నది. భవిష్యత్తులో మరిన్ని ఉచిత హామీలు ఇచ్చే ముందు వాటిని ఎలా నెరవేరుస్తామో, నిధులు ఎక్కడి నుంచి తెస్తామో సవివరంగా చెబితే బాగుంటుందనే అభిప్రాయం ప్రజల్లో నుంచి వినిపిస్తున్నది.

మహమ్మద్ ఆరిఫ్

సీనియర్ జర్నలిస్ట్,

9618400190

Advertisement

Next Story