- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శ, ఆత్మరక్షణ వ్యూహమేనా?
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్వాకాల ద్వారా సంక్రమించిన బాలారిష్టాల కాలం తీరనేలేదు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని, కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేస్తాం, ముక్కలు చేస్తామని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నేతలు బీరాలు పోతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంత ఎగేసి చెప్పినా, కేసీఆర్‌తో పాటు తన అనుయాయులు ఎన్ని రాజకీయ చతురతలు, తుంపిర్ల వాగ్దానాలను చేసినా, ఇక ప్రజలు ఇప్పట్లో నమ్మరు అనే విషయాన్ని గుర్తించి మసులుకోవాల్సిన అవసరం ఉంది.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కుట్ర చేసి కూలగొడుతుందంటూ బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అలర్ట్ చేయడమే కాకుండా భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలపై జోస్యం చెప్పారు. 2018 లో రాష్ట్ర ఎన్నికల్లో టీఆర్ఎస్ రెండోసారి 88 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా, కేసీఆర్ మిగతా పార్టీ శాసనసభ్యులను తమ పార్టీలో కలుపుకున్నారు. అలాగే అసెంబ్లీలో బయట నుంచి ఎంఐఎం పార్టీ మద్దతును కూడగట్టారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అభద్రతా భావంతో, ఆత్మరక్షణలో పడి తమ పార్టీ శాసనసభ్యులను, నాయకులను గోడ దుంకకుండా కాపాడుకునే వ్యూహంలో భాగంగా కేటీఆర్ లాంటి నాయకులు ఇలాంటి సాంత్వన హిత వచనాలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులు అడ్డగోలుగా తెలంగాణలో మిషన్ల పేరున సంపాదించిన డబ్బు మూటలతో ఏదైనా చేయొచ్చు అని ఒక శంక, ఒక అనుమానం కూడా అంతర్గతంగా రాజకీయ వర్గాలలో చర్చ కొనసాగుతుంది.
అహంకారమే దెబ్బతీసింది
ఇక్కడ ప్రస్తావించడం అసందర్భం కాదనుకుంటాను. తెలంగాణలో వెలమ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి ఒక స్పష్టమైన సరిహద్దు రేఖ ఉన్నది. గ్రామ ప్రజలందరితో కలిసి పనిచేయడంలోనే ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఒక విభజన గీత గీసినట్టు ఉంటుంది. రెడ్డి కమ్యూనిటీకి అన్ని కులాలతో కలిసి పని చేసే శ్రమ సంస్కృతి ఉంది. కానీ వెలమ సామాజిక వర్గానికి ఒక వృత్తి అంటూ లేకపోవడం అటుంచితే వీరు ఫక్తు పెత్తందారి తనంతో, ప్రజల పట్ల అహంకారంతో అనుచితంగా వ్యవహరిస్తుంటారు. ఈ రెండు వర్గాల మధ్య నున్న ఈ సామాజిక విభజనను గమనంలోకి తీసుకుంటేనే తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాలను అర్థం చేసుకోవచ్చును.
ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా పని చేస్తే అది బీఆర్ఎస్ ఉనికికే పెద్ద ముప్పు తెచ్చి పెట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా కోలుకోని విధంగా నష్టపోతుంది. బీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని గుర్తించి ప్రజా తీర్పును శిరసావహించి మసలుకుంటే మంచిది. అధికార అహంకారాన్ని సంపూర్ణంగా వదులుకొని ప్రజా సమూహాలలో నీళ్లలో చేపల్లాగా కదలాడితే తప్ప తమకు మరో మార్గం లేదనే విషయాన్ని గ్రహించాలి. ప్రజలు తమ వాగ్దానాలను, ఊకదంపుడు ఉపన్యాసాలను ఇక నమ్మరనీ, ఇకముందు నమ్మజాలరనే కఠోర వాస్తవాన్ని అంగీకరించాలి.
జనం నమ్మకనే గద్దె దింపారు
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ను, ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డిని, మిగతా నాయకులను తెలంగాణ ప్రజలు విశ్వాసంలోకి తీసుకున్నారు. కనుకనే ఈ విజయం వరించిందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుర్తుంచుకుని, ఎల్లవేళలా జాగరూకతతో ప్రజలతో వ్యవహరించాల్సిన అవసరం వారిపై మరెంతో ఉంది. ఇప్పటికే రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితి గురించిన నిజాలు ప్రజలకు తెలిసిపోయాయి. ఆర్థిక వనరుల కొరత గురించిన అవగాహన కూడా కొంతమేరకు ఏర్పడింది. అందుకే ప్రజలు దేనికి తొందర పడటం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎంత ఎగేసినా జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంతే కాక చేసిందంతా చేసి ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఈ నాయకులు చంటి గుడ్డు లాంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ప్రజలలో తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కేసీఆర్ ప్రభుత్వం, ఆయనతోపాటు అనుయాయులు ఎన్ని రాజకీయ చతురతలు పన్నినా, తుంపిర్ల వాగ్దానాలను చేసినా, ఇక ప్రజలు ఇప్పట్లో నమ్మరు అనే విషయాన్ని గుర్తించి మసులుకోవాల్సిన అవసరం ఉంది. తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరానికి దించి నిర్మించిన ప్రాజెక్ట్ పిల్లర్లు కూలిపోవడంలో జరిగిన అవినీతి వల్ల కోట్లాది రూపాయలను గోదావరిలో పారబోసినట్లయినది. ఖమ్మం సీతారామ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కేసీఆర్ చెప్పిన సుద్దులు, చేసిన పనులు కళ్ళముందే కనబడుతున్నాయి. ఇప్పుడు వాటి నుంచి ఎలా బయటపడాలి, రానున్న పార్లమెంట్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతాం పొడిచేస్తాం అంటూ, ప్రజల్లో మాకే ఇంకా ఆదరణ ఉంది అని గొప్పల గప్పాల్ కొట్టడం ఆపివేయడం ఆ పార్టీ నాయకులకే శ్రేయస్కరం.
లూటీని ఇంకా మరచిపోలేదు!
ధరణి ద్వారా భూములు తిరిగి ఏ భూస్వాముల సొంతమయ్యాయో తెలంగాణ రైతాంగం, కౌలు రైతులు గమనిస్తున్నారు. ఇక పోతే రైతుబంధు పథకం ద్వారా కోట్లాది రూపాయలను తన వర్గానికి కేసీఆర్ పలారంలా పంచి పెట్టిన విషయాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారో వాళ్లే చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లుగా ఆడిన ఆట పాడింది పాటగా సాగించిన తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమే కాకుండా నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా మిగిలిపోయింది. రైతుబంధు ద్వారా తప్పు జరిగింది అంటే సరిపోతుందా? ఉచితంగా పంచిపెట్టిన డబ్బులు తిరిగి రాష్ట్ర ఖజానాకు ఎలా రావాలి? వాళ్లే జవాబుదారీతనంతో చెప్పాలి. పంచాయతీ చెప్పు దొరా అంటే ‘బర్రె దుడ్డె' నాదే అన్నట్టు ఉండడమే తెలంగాణకు పట్టిన మరో దురదృష్టకర పాలన. తెలంగాణ ఖజానాను పాలకులు లూటీ చేసిన తీరు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల మనో పలకం నుంచి ఇప్పట్లో తుడిచి పెట్టలేరు. కరీంనగర్ సహజ వనరుల దోపిడీ ఎలా జరిగిందో ఎవరు చేశారో ఎందుకు చేశారో అందరికీ తెలిసింది. ఇక ఇప్పుడు కేసీఆర్ కరీంనగర్‌లో మకాం పెట్టినప్పటికీ పెద్దగా రాజకీయ ప్రయోజనం నెరవేరే దాఖలాలు కనుచూపు మేరలో కనబడడం లేదు. ఎందుకంటే కేసీఆర్ మాటలకు చేతలకు మధ్యనున్న దూరం ఎన్ని లక్షల కిలోమీటర్లో చైతన్యవంతమైన కరీంనగర్ ప్రజలకు ఎప్పుడో తెలిసింది.. మసి పూసి మారేడు కాయ చేసే రాజకీయాలు ఇకనైనా ఆపండి.
-జూకంటి జగన్నాథం
94410 78095