బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌వి మేనిఫెస్టోలు కాదు.. మనీ ఫెస్టులు!

by Ravi |   ( Updated:2023-10-25 02:31:24.0  )
బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌వి మేనిఫెస్టోలు కాదు.. మనీ ఫెస్టులు!
X

గతంలో ఎన్నికల ముందు పార్టీలు ప్రకటించే మ్యానిఫెస్టో తక్షణ, దీర్ఘకాలిక, సంక్షేమ, అభివృద్ధి, సామాజిక మార్పునకు నాంది పలికే విధంగా ఉండేది. మేనిఫెస్టో తయారు చేయడానికి అనేక మంది నిపుణులు, రాజకీయ తత్వవేత్తలు, ప్రజలు, వివిధ సంఘాల సూచనలు వడపోసి రాష్ట్ర - దేశ భవిష్యత్తుకు పునాది వేసే విధంగా మేనిఫెస్టో తయారు చేసి, అదే ఒక భగవద్గీత లాగా ప్రచారం చేసి ప్రజల నమ్మకం కల్గించి గెలిచేవారు. కానీ తెలంగాణాలో కాంగ్రెస్, కేసీఆర్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో కేవలం దసరా - దీపావళి పండుగ సందర్భంలో పోటీ పడి వివిధ కంపెనీలు ప్రకటించే 20%, 50%, 70% రాయితీలు, తగ్గింపు రేట్లు లాగా, ఎన్నికల లేదా ఒక పండగ బంపర్ సేల్స్ లాగా ఉన్నది. నిజంగా చెప్పాలంటే ఈ మేనిఫెస్టో లేదా సేల్స్ ప్రకటించటానికి ఒక గంట సమయం చాలు. కాంగ్రెస్ 500 అంటే , కేసీఆర్ పార్టీ 600, ఒకళ్ళు 4000 ఆసరా అంటే ఇంకొకళ్ళు 6000 నెలకు, ఇలా ఒక వేలంపాట లాగానే ఉంది.

ఎన్నికల ముందే పేదలు..

అన్నపూర్ణ పథకం కింద ప్రస్తుతం తెలంగాణాలో 90 లక్షల కుటుంబాలకు, 2.83 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తామని చెబుతున్నారు. ఒక్కరికి 6 కేజీల చొప్పున నెలకు 16.98 కోట్ల (17 కోట్ల) కిలోల సన్నబియ్యం అవసరమవుతుంది. అంటే ఒక సంవత్సరానికి 204 కోట్ల కేజీల (3.5 కోట్ల క్వింటాళ్ల బియ్యం) బియ్యం అవసరం. అంటే ఏడాదికి 3.15 కోట్ల క్వింటాళ్ల ధాన్యం పండించాలి. ఇది ఏడాదికి తెలంగాణ ప్రాంతంలో పండే వరిపంటతో సమానం. అంటే తెలంగాణలోని ప్రతి ఎకరంలో సన్న బియ్యం పండించాలి, మిల్లింగ్ చేయాలి. కానీ కేసీఆర్ మదిలో ఉన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఫ్రీ రేషన్ బియ్యం మాత్రమే. ‘రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులలో పాలిష్ చేసి, దొడ్డు తగ్గించి రీ సైకిల్ చేసి సన్నబియ్యం ఇస్తాను అన్నాను కానీ, పొలాల్లో పండిన సన్న బియ్యాన్ని ఇస్తా అని చెప్పలేదుగా' అని చెప్పి కేసీఆర్ తప్పించుకుంటారు. ఇది ఏదో సినిమాలో బాబూమోహన్ నేను కొండను మోస్తాను అని చెప్పి, ఊరోళ్ళు అందరూ వచ్చిన తర్వాత ఆ కొండను తెచ్చి నేతి మీద పెట్టమని అడిగినట్టు ఉంటది. మార్కెట్లో సన్నబియ్యం కిలో రూ.50 చొప్పున అనుకుంటే, ఏడాదికి సన్న బియ్యాన్ని మార్కెట్లో కొంటే రూ. 12,240 కోట్లు అవుతుంది.

ఆసరా పెన్షన్స్ కింద ప్రసుతం ఒక్కొక్కరికి రూ.2,016ల చొప్పున 42 లక్షల మందికి పింఛన్లు ఇస్తేనే ఏడాదికి రూ. 10,160 కోట్లు ఖర్చు అవుతుంది. అదే నెలకు రూ.5,016లు ఇస్తే సంవత్సరానికి రూ.25,280 కోట్లు అవుతుంది. అలాగే రైతు బంధు ప్రస్తుతం ఎకరాకు సంవత్సరానికి రూ.10,000 ఇస్తేనే ఏడాదికి రూ.15,000 కోట్లు అవుతుంది, నిజంగా కేసీఆర్ ఎకరాకు రూ.16,000లు ఇస్తే అది సంవత్సరానికి 24,000 కోట్లు అవుతుంది. లేదా రుణ మాఫీ లాగా అలా సాగుతూనే ఉంటది. పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ అనే మాట చెబితేనే ప్రజలు తన్నే పరిస్థితి వస్తుందని, బోర్డు తిప్పి కొత్త పేరు పెట్టారు. కాళోజీ చెప్పినట్లు “అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు, ఏ పాటి వాడని చూడు, ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు, ఇప్పటి దాకా ఏమి చేసాడని చూడు, పెట్టుకునే టోపీ కాదు, పెట్టిన టోపీ చూడు” ఇది అక్షరాలా కేసీఆర్ వ్యవహార శైలికి సరిపోతుంది. పేదల అసైన్డ్ భూములు నిర్దాక్షిణ్యంగా లాక్కున్న కేసీఆర్‌కి ఎన్నికల ముందే పేదలు గుర్తొస్తారు

ఇవన్నీ ఎన్నికల కళలే!

ఎన్నికలప్పుడు పదే పదే కెసిఆర్ చెప్పే సామెత ‘కన్న తల్లికి మెతుకు పెట్టనోడు, పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తాను’ అన్నట్లు ఉంది. 5 లక్షల లోన్లు 10 లక్షలు చేస్తానని హామీ ఇచ్చి, ఎప్పుడూ ఇచ్చే వడ్డీ సబ్సిడీ ఎగ్గొట్టిన బాపతు కేసీఆర్ పార్టీది. సొంత భవనాలు పేరు చెప్పి డబుల్ బెడ్ రూమ్ మోసం చేయాలనే కుట్రలో భాగమే కేసీఆర్ బీమా. అసలు కేసీఆర్ బీమా అనే పేరులోనే లోపం ఉంది. కేసీఆర్ ఏమైనా సొంత పైసలతో చేస్తుండా అది కేవలం ఎన్నికల స్టంట్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అసంఘటిత కార్మికుల, ట్రాన్స్‌పోర్ట్ వాహన దారుల 5 లక్షల బీమాను కేసీఆర్ అమలు చేయడం లేదు కదా! భవన నిర్మాణ కార్మికుల పేరు మీద వివిధ నిర్మాణ యజమానుల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్న రుసుము కేసీఆర్ గల్లా పెట్టెలో జమైపోతుంది. అగ్రవర్ణాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతారట. ఇప్పటికే ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్‌కు బిల్డింగులు లేవు, చదువుకునే పిల్లలను వర్గాల పేరుమీద విభజించిన ఘనత కెసిఆర్‌ది. ఇప్పుడు శిధిల బిల్డింగులలో ఉన్న బీసీ రెసిడెంటిల్ స్కూల్స్ లలో ఎలాగూ 25% అగ్రకుల పేదలకు ఉంది, వాటికీ బడ్జెట్ ఇస్తే సరిపోతుంది. అందుకొరకు ఇవన్నీ ఎన్నికల కళలు తప్ప, నిబద్ధత లేదు.

వంట గ్యాస్ సబ్సిడీ 400 సిలిండర్. ఇది ఎట్లా ఉంది అంటే కురుక్షేత్ర యుద్ధంలో ధర్మరాజు ”అబద్దాన్ని నిజంగా చెప్పటానికి వాడిన అబద్ద కళ” లాంటిది. అదే “అశ్వద్ధామ హతః, అని గట్టిగా ద్రోణాచార్యకు వినపడేటట్లు అరచి, కుంజరహా (ఏనుగు) అని నోట్లో అంటాడు. పాపం ద్రోణాచార్యుడు తన కొడుకు (అశ్వత్థామ) చనిపోయాడు అని భావించి కుప్ప కూలిపోతాడు. అట్లనే కేసీఆర్ మాటతీరుంది. కాంగ్రెస్ ₹ 500 అంటే, వీరు ₹400 అంటున్నారు. ఎవరికి ఎంత మందికి ఇస్తారు అనేది స్పష్టత లేదు. తెలంగాణ రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే దాదాపు 95 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. అందులో పీఎం ఉజ్వల యోజన కింద పేదలకు 11 లక్షల కనెక్షన్స్ ఉన్నవి. సాధారణంగా ఈ కుటుంబాలకు సంవత్సరానికి 4 సిలిండర్లు వాడుతారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం సాధారణ సిలిండర్‌కు ₹1100 ఉంటె, 500 సబ్సిడీ ఇచ్చి ₹600కి ఇస్తున్నది. ఇక వీరు ఇచ్చేది కేవలం 11 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్, అది కూడా సంవత్సరానికి 4 అంటే ఒక కుటుంబానికి కేవలం ₹800 మాత్రమే. ఇప్పటికే మోడీజీ ఈ కుటుంబాలకు ₹2000 సబ్సిడీ ఇస్తున్నారు. కేసీఆర్ ప్రతిపాదన చేసిన సబ్సిడీ ఏడాదికి కేవలం 88 కోట్లు మాత్రమే, కానీ మోడీ ఇప్పటికే 220 కోట్ల సబ్సిడీ ఇస్తున్నారు.

ఇదే తెలంగాణ బెస్ట్ పాలసీ!

ఇక సౌభాగ్య లక్ష్మి అంతా ఒక నాటకం. ఎన్నికల తర్వాత ఆసరా, రైతుబంధు, ఒంటరి మహిళా పెన్షన్ తీసుకునే వాళ్ళు అర్హులు కారు అంటారు. అప్పుడు అసలు ఆ సౌభాగ్య లక్ష్మిలు కనపడరు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య శ్రీ కింద 2 లక్షల బకాయలు తీర్చడానికి 4 -5 ఏండ్లు పడుతుంది, 15 లక్షల ఆరోగ్య శ్రీ అనే హామీ కేవలం కాంగ్రెస్ వాళ్ళు 10 లక్షలు అన్నారు కాబట్టి మాత్రమే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 5 లక్షల ఆయుష్మాన్ భారత్, తెలంగాణాలో అమలు చేయకుండా తెలంగాణ పేద రోగుల ఉసురు పోసుకున్నాడు కేసీఆర్. మైనారిటీలకు మరింత సంక్షేమ పాపం మైనారిటీలు ఏక్ దిన్ బిర్యానీ, పూరా సాల్ పరిషని, తప్ప కేసీఆర్ వారిని ఉద్ధరించింది ఏమి లేదు . కేంద్ర పథకాలు అమలు చేయక వారికీ డోకా చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం.

అసైన్డ్ భూములకు ఆంక్షలు ఎత్తివేసి యాజమాన్య హక్కులు కల్పించడానికి కృషి చేస్తామని చెప్పడంలోనే నిబద్ధత లేదు. ప్రభుత్వం వస్తే చేస్తాము అని చెప్పాలి కానీ కృషి ఏమిటి అదే జిఓ 111 ఒక్క నిర్ణయంతో రద్దు చేయలేదా? ఇది కేవలం మభ్య పెట్టడం మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో 23 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి ఉంది, తలచుకుంటే కేవలం ఒక జిఓతో యాజమాన్య హక్కు కల్పించవచ్చు. అనాధలు అయినా పిల్లల కోసం ప్రత్యేక పాలసీలు బెల్ట్ షాపుల పుణ్యమాని ప్రతి ఊర్లో అనేక మంది చిన్న వయసులోనే విధవలు అవుతున్నారు. తాగి తాగి చచ్చి ఆనాధలు అవుతున్నారు. రైతుల ఆత్మహత్యలతో పిల్లలు ఆనాధలు అవుతున్నారు. గంజాయి, డ్రగ్స్ పుణ్యమాని అనాధలు అవుతున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు, పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోవడం వలన అనాధలు అవుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులు అనాధలు అయ్యారు, కుల వృత్తిదారులు అనాధలు అవుతున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు అనాధలు అయ్యారు. తెలంగాణ ప్రజలు ఎదురు చూసే బెస్ట్ పాలసీ ఏమిటి అంటే, ఎవరిని లోపలి రాకుండా ఏడూ గేట్లు ఏసుకున్న ప్రగతి భవన్ నుండి కేసీఆర్‌ని వెకేట్ చేపించడమే బెస్ట్ తెలంగాణ పాలసీ.

ఇక తెలంగాణ ప్రజలు అలోచించి నిర్ణయం తీసుకోవాలి. కేవలం ప్రజలను ప్రలోభ పెట్టె కేసీఆర్ వేలంపాట అయిన మనీ- ఫెస్టో నమ్మి మోసపోతారా? ఎన్నికల వరకే వారంటీ ఉండే కాంగ్రెస్ గ్యారెంటీ మని-ఫెస్టో కావాలా? లేక ఒక నిబద్దతతో తాత్కాలిక, శాశ్వత సంక్షేమ, అభివృద్ధికి బాటలు వేసే బీజేపీ డబల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలా అనేది మీరే నిర్ణయించుకోవాలి. యథా ఓటర్ - తథా ప్రభుత్వ = తస్మాత్ జాగ్రత్త

డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

మాజీ ఎంపీ

బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్

Advertisement

Next Story