- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్ పల్లెను కళ్లకు కట్టినట్టు..
తెలుగు సినిమాలంటే పెద్ద స్టార్లు, భారీ సెట్టింగ్ లు, కోట్ల బడ్జెట్, సీనియర్ నిర్మాతలు..అంతే కదా! మరి తెలంగాణ సినిమా అంటే మాత్రం లోకల్ టాలెంట్స్, ఊర్లలో షూటింగ్, తక్కువ బడ్జెట్, స్థానిక ఔత్సాహిక నిర్మాతల ఎంట్రీ, అంతా ధూమ్ ధాం తమాషా! మన సినిమాలు మనగ్గావాలె అన్నట్లు ఇక్కడి సినీజనం పక్కా తెలంగాణ యాక్టర్లతో, లొకేషన్లతో వెండితెరపై ఈ మట్టి మనుషుల నవ్వులు, కన్నీళ్లు పండిస్తున్నారు. ఇలా ఒక్కో అడుగేసుకుంటా తెలంగాణ సినిమా పిల్ల బాటను వేసుకుంటోంది. మినిమమ్ గ్యారెంటీతో తయారవుతున్న ఈ సినిమాల్లో పల్లె జీవితాలపై వస్తున్నవి మంచి ఆదరణ, విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.
పట్టణ జీవితాల కన్నా గ్రామీణ జీవితాల్లో ప్యూర్ లోకల్ టచ్ ఉంటుంది కాబట్టి ఆ పంచరంగుల ప్రకృతితో తెర మురిసిపోతోంది. ఎన్నడూ లేనిది ఇప్పుడు సినిమాల్లో తమని చూసుకోవడంతో తెలంగాణ యావత్తు ఓ గమ్మత్తులో తేలిపోతోంది. దానికి రుజువుగా నిలిచే లోకల్ సినిమాల్లో భీమదేవరపల్లి బ్రాంచి ఒకటి. బ్రాంచి అనగానే అందరికీ బ్యాంక్ గుర్తుకొస్తుంది. అందుకే బ్యాంక్ పేరు చెప్పకుండానే సినిమాకు ఈ పేరు పెట్టారు. పాత కరీంనగర్, వరంగల్ జిల్లాల జనాలకు తెలిసిన ఊరు అది. పేరు వింటేనే మా సినిమా అనే భావన కలుగుతుంది. టైటిలే ప్లస్ పాయింట్‌గా ఉన్న భీమదేవరపల్లి బ్రాంచి సినిమా జూన్ 23న థియేటర్లలో విడుదలై పక్కా తెలంగాణ బొమ్మ అనే ముద్రను సాధించింది.ప్రేక్షకాదరణ, మీడియా మెప్పును సంపాయించింది. ఆగస్టు 8 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.
మన పక్కపోంట్ల ఉన్నట్టే..
భిన్నమైన కథాంశంతో ఈ చిత్రంలో పల్లె జనం బతుకుని ఉన్నదున్నట్లు తెరమీదికి తెచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమాకున్న బలమే అది. కథ కన్నా సహజత్వానికి ప్రేక్షకులు ముగ్దులవుతారు. తెలంగాణ టాలెంట్స్ సత్తాకు బలమైన సాక్ష్యంగా ఈ చిత్రం నిలబడుతుంది. కేవలం వ్యాపారం కోసం కాకుండా తమ ప్రాంతాన్ని, అక్కడి మనుషుల బతుకుల్ని, పట్టింపులను, నమ్మకాలను, మంచితనాన్ని, బోల్తాపడే అమాయకత్వాన్ని అన్నింటిని తెరపైకి స్వచ్ఛంగా తేవాలనే సంకల్పం ఇందులో కనబడుతుంది. పల్లె అంటే పంటలు, పాశురాలే కాకుండా అక్కడి బతుకుల్లో భాగమైన మట్టి ఇండ్లు, వాకిండ్లు, సాయిమాన్లో కట్టెల పొయ్యిలు, బట్టల దండేలు, రాళ్ల ప్రహరీ గోడలు తెర నిండా దర్శనమిస్తాయి. జనం రంగు రూపు, తినే తిండి, కూచునే తీరు, కట్టే చీరలు, తొడిగే బట్టలు, నోటికొచ్చిన మాటలు అన్నీ పక్కపొంట ఉన్నట్లే అనిపిస్తుంది. నాల్రోజులు సొంత పల్లెకు లేదా ఊర్లె సుట్టాలింటికి పోయినట్లుంటది. కల్తీలేని నటన, చిత్రీకరణల వల్లనే ఇది సాధ్యపడింది. ఈ క్రెడిట్ అంతా ముందుగా చిత్ర దర్శకుడు రమేష్‌దేనని చెప్పాలి. ఆ తర్వాత ఆయన సాంకేతిక, నట బృందానికి చెందుతుంది.
సన్నివేశాల సహజ చిత్రీకరణ..
విదేశీ బ్యాంకులో భారతీయులు అక్రమంగా దాచిన సొమ్మును తెప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ఈ సినిమాకు మూలాధారం. జనధన్ ఖాతాలో పడిన పైసలు సర్కారు వేసిందని సంబరంతో తీసుకున్నాక, ఆ ఇంటి ముగ్గురు మనుషులు ఎదుర్కొన్న తీపి, చేదు సంఘటనలే ఈ సినిమాను నడిపిస్తాయి. ముగ్గురంటే తల్లి, కొడుకు, కోడలు. కొడుకు జంపన్న చావుకు డప్పు కొట్టే కూలి. అత్తాకోడళ్లు వ్యవసాయ కూలీలే. ఖాతాలో పడిన డబ్బులు చేతికి రాగానే జంపన్న చేసే హంగామా సినిమాకు ప్రధాన ఆకర్షణ. కొత్త మోటారు సైకిలుపై రంగురంగుల బట్టలతో ఎవ్వరిని లెక్క జేయనట్లు తిరుగుతూ, ఎదురైనోళ్లకు అయిదు వందల నోట్లు పంచుతూ ఊరుకే విచిత్రంగా మారుతాడు. తమక్కూడా అట్లా పైసలొస్తే కష్టాలు తీరుతాయని ఊర్లె అందరూ ఆశపడుతూ ఎదురుచూస్తుంటారు. అట్లా కొన్ని గ్రామీణ కుటుంబాలు కథ చుట్టూ తిరుగుతాయి. వీరిలో ఒక యువ ప్రేమ జంట కూడా ఉంది. సినిమాకు రొమాంటిక్ టచ్ ఈయడానికి, డ్యూయెట్ల కోసం ఈ జంట తోడ్పడింది.
తెర ముందు తారాగణంలో జంపన్నగా అంజిబాబు నటన ప్రేక్షకులను అలరిస్తుంది. ఎంతో వినోదాన్ని పంచిన అంజి బాబు అదే లెవల్లో విషాదాన్ని కూడా పండించాడు. ఆయన భార్యగా నటించిన సాయి ప్రసన్న పూర్తిగా పల్లెపడుచుగా మారిపోయింది. గ్రామీణ యువతిగా ఆమె బాడీ లాంగ్వేజ్ బాగా కుదిరింది. జంపన్న తల్లి రాజవ్వ స్థానిక సాధారణ మహిళ అయినా సరిగ్గా సరిపోయింది. నోటి నిండా అమాయకపు యాసతో ఆమె ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులుగా ముగ్గురి మధ్య సన్నివేశాల సహజ చిత్రీకరణ దర్శకుడి ప్రతిభకు పట్టం కడతాయి.
కథ దేశమంతటికి చెందింది..
పల్లె ప్రకృతి అందాలను కెమెరా చక్కగా పట్టుకుంది. పాటల్లో 'అన్యాయమై పాయె ఊరు అజ్ఞానమై పాయె' సినిమాకే హైలైట్. సినిమా సారాన్ని ఒక్క పాటలో కుదించినట్లు సుద్దాల అశోక్ తేజ ఈ గీతాన్ని రాశారు. సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా రీరికార్డింగ్ ఉంది. ప్రత్యేకంగా సినిమా ముగింపులో జీవితాల్లో వచ్చిన మార్పును ఎత్తి చూపేలా నేపథ్య సంగీతం హుషారునిస్తుంది. బ్యాంకు ముందు ధర్నా సీనులో పౌరహక్కుల సంఘం నేత కనిపిస్తాడు. ఆయన కాషాయ జుబ్బా, మణికట్టుకు కాషాయ దారాల్ని కట్టుకొని ఉంటాడు. 'ఇలాంటి వాళ్లు ఆందోళన జరిగే చోటికి వస్తుంటారు, పోతుంటారు కానీ ఏమి చేయరు' అనే రీతిలో మాటలున్నాయి. కావాలని వారిని విమర్శించినట్లుగా ఆ సన్నివేశం కనబడుతుంది. కష్టకాలంలో వెంటున్న ఊరిజనం చివర్లో 'మీ బతుకులు పాడుగాను, చావుండ్రి' అని తిట్టడం కుదిరినట్లుగా లేదు.
విలేఖరికి పది వేలిచ్చి ముందస్తు ఎన్నికల వార్త పత్రికలో వేయించానని అన్నా అది సాధ్యపడే పని కాదు. పైగా ఆ మాట ఒక వర్గాన్ని కించపరచినట్లవుతది. మోసం చేసిన మనిషిపై చట్టపరంగా శిక్ష లేకుండా, మరోసారి ప్రజలు మోసపోడానికి సిద్దపడ్డట్లు ఉండే ముగింపు వాస్తవానికి దగ్గరగా ఉన్నా సందేశాత్మకంగా లేదు. ఆర్గానిక్ మూవీ అని ప్రచారం చేసుకున్న ఈ సినిమాను కొందరు హిందీ సినిమా 'పీప్లి లైవ్'తో పోల్చారు. సినిమా టీజర్లో 'ఖాతాలో పైసలు పడ్డాయా!' అని ఒకరినొకరు అడగడం రాజకీయ వ్యంగ్య విమర్శగా ఆసక్తిని రేపింది. రచయిత, దర్శకుడు రమేష్ చెప్పాలకు మంచి విజయాన్ని, గుర్తింపును అందించిన ఈ సినిమా తెలంగాణకే కాదు భారతీయ పల్లె జీవితాలకూ అద్దం పడుతుంది. మూల కథ దేశానికంతా చెందినది కాబట్టి అన్నీ భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీడియాలోనే కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో కూడా మంచి రేటింగ్ సాధిస్తోంది.
బి.నర్సన్
94401 28169