ద్వేషాన్ని ప్రేమతో గెలవాలి

by Ravi |   ( Updated:2022-11-03 18:30:42.0  )
ద్వేషాన్ని ప్రేమతో గెలవాలి
X

భారత స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ చేపట్టిన దండియాత్ర కీలక పాత్ర పోషించింది. 1930లో జరిగిన దండి మార్చ్ యావత్ దేశాన్ని ఏకీకృతం చేసి తెల్లదొరలతో పోరాటానికి దారులు వేసింది. అదే స్ఫూర్తితో, అదే నిబద్ధతతో ఈ సెప్టెంబర్ ఏడున రాహుల్‌గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' కొనసాగుతోంది. దేశంలో 3,570 కిలోమీటర్ల దూరం వరకు రాహుల్ నడువనున్నారు. దేశంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది.

పెద్ద నోట్ల రద్దుతో, జీఎస్‌టీతో సామాన్యులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చర్యలు దేశ ఆర్థిక స్థితిని తిరోగమనంలో తీసుకువెళ్లాయి. ఆర్థిక అసమానతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆకలి సూచిలో దేశం 107 స్థానంలో ఉంటే, ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో అంబానీ, అదానీ లాంటి వారు నాలుగవ స్థానంలో ఉండడం అసమానతలకు అద్దం పడుతోంది. 2014 తరువాత అదానీ ఆస్తులు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. సామాన్యుడి ఆర్థిక జీవన విధానం మాత్రం రోజురోజుకూ దిగజారిపోతోంది.

ఆర్థిక అసమానలతో పాటు సామాజిక అసమానతలు కూడా పెరిగాయి. సామాజిక మాధ్యమాలలో అసహనం, విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో దేశాన్ని మలినం చేస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు విరుగుడుగా వచ్చిందే 'భారత్ జోడో యాత్ర' త్యాగాల పునాదుల నుంచి వచ్చిన రాహుల్ నాయకత్వంలో మొదలైన ఈ యాత్ర భారతవనిని ఒకే తాటిపై తీసుకు రావడంతో కీలక పాత్ర పోషించవచ్చని ఇప్పటికే దేశవ్యాప్త చర్చ సాగుతోంది. ప్రజల భావోద్వేగాలతో ఆడుకొని అధికారం వచ్చిన తరువాత, దేశ ఆర్థిక వనరులను బడా వ్యాపారులకు అప్పగించి ప్రజలను అంధకారంలో నెట్టేసిన బీజేపీ పతనానికి ఈ యాత్ర ఒక సోపానం వంటిది.

దేశంలో జరుగుతున్న అప్రజాస్వామిక పరిస్థితుల గురించి రాహుల్ మాట్లాడుతుంటే, మతోన్మాద శక్తులు మాత్రం రాహుల్ వేసుకున్న టీ షర్ట్‌పై, ఆయన పెంచుకున్న గడ్డంపై మాట్లాడుతున్నాయి. ఇలాంటి వారికి ప్రజా సమస్యల మీద గానీ, రాజ్యాంగ విలువల మీద గానీ, దేశ ఐక్యత మీద గానీ గౌరవం ఉంటుందని అనుకోగలమా? 'ప్రేమను ప్రేమతోనే గెలవాలి, ద్వేషాన్ని కూడా ప్రేమతోనే గెలవాలి' అనే లక్ష్యంతో సాగుతున్న భారత్ జోడో యాత్ర దేశానికి ఒక దిశా నిర్దేశం చేయగలదని ఆశిద్దాం.

వెంకట్ నాయక్ తేజావత్

ఓయూ, హైదరాబాద్

90140 12381

Advertisement

Next Story

Most Viewed