'గీత'ను రూపం మార్చి బోధించాలి

by Ravi |   ( Updated:2022-09-03 16:58:15.0  )
గీతను రూపం మార్చి బోధించాలి
X

గీతను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంథముగా పేర్కొన్నారు. ఇలా చాలా మంది వారివారి కోణంలో గీతను అర్థం చేసుకున్నారు. దాని నుండి ప్రేరణ పొందారు. అలాంటి భగవద్గీతను చిన్న పిల్లల పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టి బోధిస్తే వారు ఎలా అర్థం చేసుకొంటారో! దానికి బదులుగా మూల అంశాలను లేదా కొన్ని భాగాలను ఆధారం చేసుకుని నీతి కథలు లేదా చిన్న, చిన్న పద్యాలు, పాటల రూపంలో బోధిస్తే తొందరగా అర్థం చేసుకోగలరు.

భారతీయ సాహిత్యంలో వైదిక గ్రంథాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇవి ఎంతో పవిత్రమైనవిగా, అపురూపమైనవిగా, మహిమాన్వితమైనవిగా భావించబడుతున్నాయి. అలాంటి వాటిలో మొదటివి వేదాలు. వీటిని అపౌరుషేయాలు అంటారు. వీటి తర్వాత చెప్పుకోదగినవి బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. వీటి తర్వాత తప్పక అధ్యయనం చేయవలసింది భగవద్గీత అని వేదాంతులు చెబుతారు.

భగవద్గీతను సరిగా అర్థం చేసుకోవాలంటే ఆది శంకరాచార్యులు రాసిన భాష్యం తప్పక చదవాలని అద్వైతులు సూచిస్తారు. క్షత్రియుడైన అర్జునుడికి యుద్ధం చేయడం స్వధర్మమని, యుద్ధమే ధర్మాన్ని నిర్ణయిస్తుందని యుద్ధోన్ముఖుని చేసే ప్రయత్నంలో శ్రీకృష్ణుడు బోధించినదే భగవద్గీత. మహాభారతంలో భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు ఉన్న 18 అధ్యాయాలు 700 శ్లోకాలు భగవద్గీతగా ప్రసిద్ధి చెందాయి. ఇది మహాభారతంలో అంతర్భాగమైన ఒక ప్రత్యేక గ్రంథముగానే భావింపబడుతుంది. ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. అందుచేతనే దీనిని 'గీతోపనిషత్తు' అని కూడా అంటారు.

అవగాహన కల్పించగలమా?

భగవద్గీతను పాఠశాల స్థాయిలో పాఠ్యాంశంగా చేర్చాలని గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే, గీతను ఎలా బోధిస్తారనేదే? మొత్తంగానా? లేక కొన్ని అధ్యాయాలు, శ్లోకాలు మాత్రమేనా? కంఠస్థం వరకేనా లేక తాత్పర్యంతో సహా వివరిస్తారా? ఉన్నది ఉన్నట్టుగా చెబితే శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయడానికి ప్రోత్సహించారని తెలుసుకున్న విద్యార్థులు రష్యా-ఉక్రెయిన్ తరహా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు యుద్ధోత్సాహులు అవుతారేమో! గీతను జీవితానికి అన్వయించి జీవితంలో ఎదగడానికి కావలసిన మానసిక సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించడానికైతే పిల్లల సైకాలజీ స్థాయిలో భగవద్గీత శ్లోకాలు ఉన్నాయా? లేదా అని ఆలోచించాలి.

గీత ప్రధానంగా వేద, వేదాంత, యోగ విశేషాల గురించి వివరించే గ్రంథం. ఇందులో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. వీటి గురించి విద్యార్థులకు సరైన అవగాహన కల్పించగలమా? ఉదా: 'మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ' (7-7) అనే శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను తప్ప ఈ సృష్టిలో ఏ పదార్థం లేదని అంటాడు. 'సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ/ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః' (18-66) సమస్త ధర్మాలను వదిలిపెట్టి నన్నొక్కడినే శరణుపొందు. నేను నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుడిని చేస్తాను సందేహించకు' అంటాడు. ఈ రెండు శ్లోకాలలాంటివి భక్తి భావం పెరగడానికి ఉపయోగపడతాయి.

ఆ స్థాయి శిక్షణ వారికి ఉందా?

ఇప్పటి వరకు హిందూ పండుగలతోపాటు రంజాన్, క్రిస్మస్ వంటి పండుగల గురించి కూడా బోధిస్తున్నారు. గీతను పాఠ్యాంశంగా పెడితే బైబిల్, ఖురాన్, ఆదిగ్రంథ్‌ను కూడా బోధనాంశాలలో చేర్చాల్సిందే అని కొందరు వాదిస్తారు. గీతలో ఉన్న పునర్జన్మ సిద్ధాంతం, భక్తి మార్గం, ఆత్మస్వరూపం లాంటి అంశాలను పిల్లల సైకాలజీ స్థాయికి వెళ్లి బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఉందా? నిజానికి వీరు బోధించగలరా? నిజానికి భగవద్గీత శ్లోకాలను విద్యార్థులకు అర్థం చేయించలేం. అవి వారికి అర్థం కావు.

గీతలో ఇంద్రియ నిగ్రహం వరకు ఉండే శ్లోకాలు తప్ప మిగతావన్నీ ఆత్మ, పునర్జన్మ, కర్మ భావనలను గురించి ఉంటాయి. ఇవి పెద్దవారికే అర్థం కావు. ఇక చిన్న పిల్లల సంగతి ఏమిటో? వారికి ఎంతో కొంత అర్థం అయితే, వారివారి మానసిక స్థాయిలను బట్టి ఉంటుంది. అర్థం కాకపోతే వారిలో ఎన్నో నూతన సందేహాలు తలెత్తుతాయి. 'జాతస్య హి ధ్రువో మృత్యుః' (2-27) అన్న శ్లోకం తెలుసుకున్న విద్యార్థికి పిండాలు పెట్టడం వలన పితృ దేవతలు సంతోషిస్తారు అని చెప్పవలసి వస్తుంది. ఆ వయసులో వారికి ఆ విషయాలు ఎలా అర్థం అవుతాయి? కర్తవ్య నిర్వహణ తప్పక చేయాలని చెబుతూ 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన/ మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోऽస్త్వకర్మణి' (2-47). కర్మలను నిర్వర్తించడం వరకే నీకు అధికారం. కర్మఫలాలతో నీకు సంబంధం లేదు. కనుక ప్రతిఫలం ఆశించి కర్మచేయకు. అలా అని కర్మలు చేయడం మానవద్దు అంటారు.

రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది

గాంధీ, బాలగంగాధర్ తిలక్,13 వ శతాబ్దపు మహారాష్ట్ర సంస్కర్త జ్ఞానేశ్వరుడు అతనికి ముందువాడైన 'ఆచార్య' రామానుజుడు, ఇంకా పూర్వీకుడైన శంకరుడు వీరందరూ భగవద్గీత ప్రభావానికి లోనైనవారే. తిలక్‌, గాంధీ ఇద్దరూ బ్రిటిష్‌ పాలన నుండి విముక్తి కోసం పోరాడారు. కానీ, 'గీత' నుండి ఒక్కొక్కరు ఒక్కో సందేశం తీసుకున్నారు అంటారు డి.డి. కోశాంబి. అమెరికా అణు శాస్త్రవేత్త, అణుబాంబును సృష్టించిన 'మాన్ హాటన్ ప్రాజెక్ట్' నిర్దేశకుడైన రాబర్ట్ ఒపెన్హీమర్, రామకృష్ణ పరమహంస శిష్యులలో అగ్రగణ్యుడైన స్వామి వివేకానంద కూడా గీత నుంచి మార్గదర్శనం పొందారు.

'యోగులు కాదలచిన వారు గీతలోని ప్రతి అధ్యాయాన్ని వివరంగా చదవమని' స్వామి శివానంద బోధించారు. ఒక యోగి ఆత్మ కథ రచయిత అయిన పరమహంస యోగానంద, గీతను ప్రపంచములోని అత్యుత్తమ పవిత్ర గ్రంథముగా పేర్కొన్నారు. ఇలా చాలా మంది వారివారి కోణంలో గీతను అర్థం చేసుకున్నారు. దాని నుండి ప్రేరణ పొందారు. అలాంటి భగవద్గీతను చిన్న పిల్లల పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టి బోధిస్తే వారు ఎలా అర్థం చేసుకొంటారో! దానికి బదులుగా మూల అంశాలను లేదా కొన్ని భాగాలను ఆధారం చేసుకుని నీతి కథలు లేదా చిన్న, చిన్న పద్యాలు, పాటల రూపంలో బోధిస్తే తొందరగా అర్థం చేసుకోగలరు.

డా. సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

9849 ౬౧౮౧౧౬

కేఎస్‌బీ గోపీకృష్ణ శర్మ

జ్యోతిష్య పండితులు

99512 96297

Advertisement

Next Story

Most Viewed