పురస్కారం సరే.. పెన్షన్ ఏది?

by Ravi |   ( Updated:2024-02-02 00:30:22.0  )
పురస్కారం సరే.. పెన్షన్ ఏది?
X

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బుర్ర వీణ కళాకారుడు హోలీయ దాసరి నారాకొండకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అంతరించిపోతున్న జానపద కళారూపాలను కాపాడుతున్న మారుమూల పల్లెల్లోని నిరుపేద కళాకారులకు దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పురస్కారం దక్కడం సంతోషించదగ్గ విషయమే.

తెలంగాణ ప్రాంతంలో మిగిలి ఉన్న ఏకైక బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప మాత్రమే. అత్యంత పేదరికం అనుభవించిన కొండప్ప తన వారసత్వంగా కుల పరంగా వచ్చిన కళను ఆసరా చేసుకుని సంచార కళాకారుడిగా బతికీడుస్తున్నారు. చిన్న ఇంట్లో ఉంటూ ప్రభుత్వం ఇస్తున్న సాధారణ పెన్షన్ మాత్రమే పొందుతున్న దాసరి కొండప్పకు భార్య చనిపోగా కొడుకు వద్ద సొంత గ్రామమైన దామరగిద్దలో ఉంటున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఆయనను కళాకారుడిగా గుర్తించలేదు. కళాకారులకు ఇచ్చే పెన్షన్ కూడా పొందడం లేదు. కొండప్ప కళను గుర్తించిన ఓ వ్యక్తి మాత్రం ప్రతినెల నాలుగు వేల రూపాయలను ఆయనకు అందిస్తున్నారు. ఎవరో ఒకరు కళను గుర్తించి పిలిస్తే వెళ్లి ప్రదర్శనలు ఇస్తున్నారు. వారిచ్చే తృణమే ఫణమో తీసుకుని బతుకుబండిని లాగుతున్నారు.

సంసారం ఎట్లా గడవాలే!

కళని నమ్ముకున్న కొండప్ప లాంటి నిరుపేద కళాకారులకు అవార్డులతో కడుపు నిండదు. శాలువాలతో సన్మానం చేసినంత మాత్రాన సంసారం గడవదు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పటికీ ఆర్థికంగా ఏ మాత్రం ఉపయోగపడదు. కళకు గుర్తింపు మాత్రం లభిస్తుంది. అందుకే పద్మశ్రీ లాంటి పురస్కారాన్ని అందుకున్న కళాకారులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌ను మంజూరు చేసి ఆర్థిక భరోసాను ఇవ్వాలి. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలి. తన అరుదైన కళారూపంతో తెలంగాణకు గుర్తింపు తెచ్చిన దాసరి కొండప్పను రాష్ట్ర ప్రభుత్వం కూడా సముచిత రీతిగా గౌరవించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

-గుముడాల చక్రవర్తి గౌడ్

అధ్యక్షుడు, పాలమూరు కళావేదిక

94410 59424

Advertisement

Next Story

Most Viewed