కవిత్వంతో ఎనలేని బంధం..

by Ravi |   ( Updated:2024-12-24 00:31:15.0  )
కవిత్వంతో ఎనలేని బంధం..
X

ప్రధాన స్రవంతిలో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడిలో గొప్ప కవి హృదయాన్ని ఊహించడం కష్టమే. కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గొప్ప రాజకీయ నాయకులు గొప్ప కవులుగా రచయితలుగా నిలబడ్డ వారున్నారు. వారి వారి తాత్వికతని దృక్పథాన్ని తమ రచనల్లో ఆవిష్క రించి సాహిత్య ప్రపంచంలో నిలదొక్కున్నవారున్నారు. మన దేశంలో అలా కవితా హృదయమున్న రాజకీయ నాయకుల్లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రముఖుడు.

అటల్ బిహారీ వాజ్ పేయీ అనగానే గొప్ప వక్తగా, దేశ ప్రధానిగా మనకు కనిపిస్తాడు. ఆయన సృజనాత్మక జీవితంలో కవిత్వం వుంది. సంగీతం వుంది. అంతేకాదు తాను నమ్మిన సిద్ధాంతాలకు ఆ జన్మాంతం కట్టుబడి ఉన్న రాజకీయ నాయకుడిగా చివరంటా నిలబడ్డ ఆయన కవిత్వంతో సహా గజల్స్‌ని కూడా అమితంగా ఇష్టపడ్డాడు. జగ్జీత్ సింగ్ అన్నా అయన గజల్స్ అన్నా అమితంగా ఇష్టపడ్డ వాజపేయీ జగ్జిత్‌తో కలిసి నయీ దిశా సంవేదనా లాంటి ఆల్బమ్స్ వెలువరించారు. మొదట జర్నలిజంతో తన జీవితాన్ని ఆరంభించిన ఆయన ‘రాష్ట్రీయ ధర్మ’ పత్రికకు సంపాదకుడిగా పని చేశారు. ఆ పత్రిక పని వత్తిడిలో కవిత్వం రాయడం కొనసాగించలేక విస్తృతంగా రాయలేకపోయానని ఆయనే ఒకచోట రాసుకున్నాడు.

సాహిత్య వారసత్వం

నిజానికి గొప్ప భావుకుడయిన ఆయనకి కవిత్వం ఒక రకంగా ఇంట్లో వారసత్వంగా సంక్రమించిందని చెప్పుకోవచ్చు. ఆయన నాన్నగారు పండిట్ కిషన్ బిహారీ వాజ్ పాయీ గ్వాలియర్ సంస్థానంలో ప్రముఖ కవి. ఆయన ప్రాంతీయ భాషలోనూ బ్రిజ్ భాషలోనూ కవిత్వం రాశారు. వాజ్ పేయి తాత శ్యాం లాల్ వాజ్ పేయి, అన్న అవధ బిహారీ వాజ్‌పేయిలు కూడా సాహిత్యంతో సంబంధం వున్న వారే. అటల్ బిహారీ వాజ్‌పేయీ తన విద్యార్థి దశ నుండే కవిత్వం రాయడం మొదలు పెట్టాడు. స్కూల్ మ్యాగజైన్లలో ఆయన కవితలు అచ్చవుతూ ఉండేవి. అటల్ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి రాజకీయ కార్యదర్శిగా తన రాజకీయ జీవితం ఆరంభించారు. ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళాక ప్రసంగాల పైననే ప్రధానంగా దృష్టి సారించి గొప్ప వక్తగా నిలిచాడు. ఆ క్రమంలో కవిత్వం వెనక బట్టింది. రాజకీయాల్లో ఉంటూ కవిత్వం గురించి ఆలోచించే సమయంగానీ వాతావరణం గానీ తనకు కరువయ్యాయని అటల్ బిహారీ వాజ్ పేయీ ఒక చోట రాసుకున్నారు.

నిర్బంధంలో కవిత్వం

అయితే ఎమర్జెన్సీ కాలంలో జైల్లో ఉన్నప్పుడు, జనతా పార్టీ విచ్చిన్నమయినప్పుడూ, ఇంకా అలాంటి తనకు బాధాకరమూ, విపత్కరమూ అయిన సందర్భాల్లో వాజ్‌పేయి కవిత్వం రాసి తన వేదనను ప్రజలతో పంచుకున్నారు. అట్లా రాసిన కవితల్లోంచి ఎంపిక చేసిన ఈ కవితల్లో భారతీయత, మాతృభూమి పైన మమకారం, ఆయన శాంతి కాముకత్వం, స్పష్టంగా కనిపిస్తాయి.

“మేము యుద్ధాన్ని కోరుకోము / విశ్వ శాంతిని కాంక్షిస్తాము / మరణాలని దిగుబడిగా పొందేందుకు పొలాల్లో రక్తాల్నిపారనీయం ..’ అంటారు వాజ్ పాయి.

మరో కవితలో...

‘నేను అంత త్వరగా ఓటమిని అంగీకరించను/ యుద్ధాన్ని సరికొత్తగా ఆరంభిస్తాను/ గెలుపు చట్రంలో ఓ కొత్త గీతాన్ని / మళ్ళీ మళ్ళీ రాస్తాను...పడతాను...’ అని అంటారు. ఇక తన తాత్విక భావాలతో కూడా అటల్ బిహారీ వాజ్ పేయీ మంచి కవిత్వం రాసారు..

‘రోజు తర్వాత రోజు ఇవ్వాళ కూడ /కాలం గడిచిపోతుంది / గత భవిష్యత్ ఉద్వేగాలతో వర్తమానం కోల్పోతాం...’ న దైన్యం న పలాయనం ఇట్లా అటల్ బిహారీ వాజ్ పేయీ కవిత్వం నిండా తన ఆలోచనలు అనుభూతులు ఆవిష్కృతమవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన కవిత్వాన్నే తన కార్యస్థలంగా ఎంచుకుని వుంటే విశ్వవ్యాప్త కవిగా పేరుగడించి సాహితీ ప్రస్తానం కొనసాగించేవారు. తన అనుభవాలని, నమ్మిన విశ్వాసాలనీ కవిత్వీకరించిన అటల్ బిహారీ వాజ్‌పేయి కవితలలో ‘మేరీ ఎక్యావన్ కవితాయే(MY 51 POEMS), ‘న దైన్యం న పలాయనం’ (NEITHER COWARD NOR AN ESCAPIST ) సంకలనాల్లోంచి ప్రఖ్యాతి గాంచిన 22 కవితల్ని ఎంపిక చేసి అరవింద్ షా ఇంగ్లీష్ లోకి అనువదించారు. వాటితో పాటు అటల్ బిహారీ వాజ్ పేయీ జీవితం, వ్యక్తిత్వాలపైన అరవింద్ షా రాసిన బయో గ్రాఫికల్ కవితలతో కూడిన సంకలనమిది.

(నేడు అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల ప్రారంభం)

- వారాల ఆనంద్

94405 01281

Advertisement

Next Story

Most Viewed