బడి పిల్లలు భద్రమేనా..?

by Ravi |   ( Updated:2024-06-12 00:46:00.0  )
బడి పిల్లలు భద్రమేనా..?
X

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు కట్టించుకునే యాజమాన్యాలు విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాలపై ఎంత మాత్రం దృష్టి సాధించలేకపోతున్నారు. సగానికి పైగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో కనీస వసతులు లేవు, ఫైర్ సేఫ్టీ లేదు, విద్యార్థుల ఆట స్థలాలు లేవు, స్కూల్ బస్సులకు నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు.

బడి ప్రారంభమైన నేపథ్యంలో..

ఎన్నో ఏళ్ల తరబడి స్కూల్ బస్సులు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నప్పటికీ, రవాణా శాఖ బస్సులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేట్ పాఠశాలలు ఫీజుల మీద శ్రద్ధతో బడి పిల్లల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే విద్య, రవాణా శాఖ అధికారులు మామూళ్లతో సర్దుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో బడి పిల్లల భవిష్యత్తు ప్రమాదకరంగా మారింది.

స్కూల్ బస్సు ఫీజు కోసం ఒక్కో విద్యార్థి నుంచి 12 వేల నుంచి 17 వేల రూపాయలు వసూలు చేస్తున్న పాఠశాలలు ఆదాయాన్ని పెంచుకుంటున్నప్పటికీ, నిబంధనలు పాటించడం లేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో, ఈసారైనా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌ని అధికారులు ఎంత మాత్రం తనిఖీ చేశారన్న ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొని ఉంది. పది బస్సులు ఉన్న స్కూల్ మేనేజ్మెంట్‌, ఐదింటికి ఫిట్‌నెస్ టెస్టు చేసి ఐదింటిని గాలికి వదిలేసి విద్యార్థులతో చెలగాటమాడుతున్నారు. ఇంకా కొన్ని యాజమాన్యాలైతే రవాణా శాఖవైపే వెళ్లడం లేదు.

ఇవీ నిబంధనలు

నిబంధనల ప్రకారం, విద్యార్థులను సురక్షితంగా స్కూల్‌కి తీసుకువచ్చి తిరిగి ఇండ్లకు చేర్చేలా పాఠశాలల విధి విధానాలు ఉన్నాయి. ప్రైవేటు ఆటోలు, టాక్సీలు వాడరాదు. స్కూల్ బస్సుల విషయానికి వస్తే ప్రతి ఏడాది తప్పనిసరిగా ఫిట్‌నెస్ చేయించాలి. 15 సంవత్సరాలు దాటిన బస్సును పిల్లల కోసం అసలు ఉపయోగించకూడదు. 60 సంవత్సరాలు దాటిన డ్రైవర్‌ని నియమించుకోకూడదు. బస్సులో క్లీనర్ అటెండర్ తప్పకుండా ఉండాలి. డ్రైవర్ కంటిచూపు, గుండె జబ్బు, షుగర్ లెవెల్, రెగ్యులర్‌గా స్కూల్ మేనేజ్‌మెంట్‌లు తనిఖీ చేసి రిపోర్టు దగ్గర పెట్టుకోవాలి. స్కూల్ బస్సుకు పసుపు పెయింట్ వేయించి ముందు భాగంలో, తెలుపు వెనుక భాగంలో రెడ్ రేడియం స్టిక్కర్లు వేయించాలి. స్కూల్ పేరు, ఫోన్ నెంబర్లు సూచించేలా బొమ్మలు అతికించాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ యాక్సిడెంట్ నివారించే ఎగ్జాస్టర్‌ను తప్పక బస్సులో పెట్టాలి. విద్యార్థులంతా డ్రైవర్‌కు కనిపించేలా ప్రత్యేక విజన్ మిర్రర్ ఏర్పాటు చేయాలి. కిటికీల నుంచి తల బయటకు రాకుండా రాడ్లు బిగించాలి. వాహనం టైర్లు నాణ్యతను రెగ్యులర్‌గా గమనించాలి. గంటకు 40 కిలోమీటర్ల స్పీడ్‌తో మాత్రమే బండి నడపాలి. సీట్ల సంఖ్యకు సమానంగా మాత్రమే స్టూడెంట్స్‌ను అనుమతించాలి. ఇన్ని రూల్స్ ఉన్నా మేనేజ్‌మెంట్లు అడ్డదారులు వెతుక్కుంటూ ఆర్టీవో, విద్యాశాఖ అధికారులను బురిడీ కొట్టిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్టు వదిలివేస్తూ, ఏదైనా జరగరాని ఘటన జరిగితే తప్ప స్పందించడం లేదు.

(నేడు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం)

పసుల మహేష్,

NYK, జిల్లా అడ్వయిజరీ

81064 15716

Advertisement

Next Story

Most Viewed