- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పటికీ దళిత నాయకుడేనా..?
దేశంలో 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ స్రవంతికి దూరంగానే ఉన్నారు. అయినప్పటికీ అగ్రకుల పార్టీలు వారి జనాభాకు మించి 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించుకొన్నాయి. మరి వీరు రాజకీయాల్లో 10 శాతానికే పరిమితం కాక, 90శాతం వుండడమేంటని మేధావుల ప్రశ్న. మరోవైపు ప్రైవేటీకరణతో పేదల రిజర్వేషన్స్‌కు గండి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మెజార్టీ జనాభా గల బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేయాల్సింది అంబేద్కర్ ఆనాడే ప్రబోధించిన రాజ్యాధికార యుద్ధం తప్ప, మరోటి కాదు.
అంటరానిదిగా పేరుపడ్డ మహర్ కులంలో పుట్టిన బిఆర్ అంబేద్కర్ బాల్యంలో అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు. బరోడా మహారాజు ఆర్థిక సహాయంతో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాడు. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి ఆయన ఆస్థానంలోనే ఉద్యోగంలో చేరినా నౌకర్లు అస్పృశ్యుడుగా చూడడం పెద్ద అవమానంగా భావించాడు. దీంతో సామాజిక వివక్షతపై అలుపెరగని పోరాటం చేశాడు. దళితల మంచినీటి కోసం మహారాష్ట్రలోని నాసిక్ లో చేసిన మహాద్ చెరువు పోరాటం అందరి దృష్టిని ఆకర్షించించింది. ఇది భారతదేశంలోనే మొదటి మానవ హక్కుల ఉద్యమం. ఆలయాల ప్రవేశాలు, పాఠశాలలో చదువు, తాగునీరు బడుగు, బలహీన వర్గాలకు అందాలని పట్టుపట్టాడు. 1927లో సైమన్ కమిషన్ ముందు దళిత జాతి సమస్యలను మొట్టమొదటిసారిగా నివేదించాడు. అంతేకాకుండా అంబేడ్కర్ అఖిల భారత దిగువ కులాల సమైక్యను స్థాపించి వారి ఉన్నతికై పోరాటం చేశాడు. ఇంగ్లాండులో మూడో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని దళితుల సమస్యలను బ్రిటిష్ వారి దృష్టికి తీసుకెళ్లాడు.
బోధించు, సమీకరించు, పోరాడు
అంబేద్కర్ బహిష్కృత భారతీ అనే పత్రికలో తిలక్ అంటరానివాడిగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అనే వాడు కాదు, అస్పృశ్యతా నివారణ నా జన్మ హక్కు అని నినాదించేవాడని రాశాడు. ఇది ఆనాడు భారతీయ సమాజంలో కులతత్వ వాదులచే అంబేద్కర్ అనుభవించిన బాధను తెలుపుతుంది. 1924 లో సమానత్వ సాధనకై సమతా సైనిక్ దళ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. యువతలో వ్యక్తిగత క్రమశిక్షణ నేర్పిస్తూ, అగ్రకుల దాడులను ఎదుర్కొనే విధంగా తయారు చేశాడు. “మూక్ నాయక్” అనే పత్రికను నడిపి దేశ మూల వాసుల చరిత్రను వెలికి తీశాడు. అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదాలతో అందరిని సంఘటితం చేశాయి. అస్పృశ్యత, అంటరానితనం వంటి సమస్యల పరిష్కారంలో గాంధీతో అంబేద్కర్ విభేదించారు. భారత రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షత వహించి, అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను అందులో చేర్చి “భారత రాజ్యాంగ పిత” గా వెలుగొందాడు. పీడనకు గురైన వర్గాలకు రిజర్వేషన్స్ కల్పించాడు. అగ్రకులాల కుట్రలు ఛేదించి అందరికీ ఓటు హక్కును కల్పించాడు. జీవిత చరమాంకంలో అంబేడ్కర్ 'నా పుట్టుక నా చేతిలో లేదు కానీ, నా చావు నా చేతిలో ఉంద'ని ప్రకటించి హిందూ మతాన్ని వీడి మానవీయ విలువలతో కూడిన బౌద్ధాన్ని స్వీకరించాడు. 1956 డిసెంబర్ 6న తుది శ్వాస విడిచాడు.
ఓటుతో యుద్ధం చేయాలి
ఆయన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంతరాలపై లక్ష పేజీల సాహిత్యాన్ని మనకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. సామాజిక ఆసమానతలపై అలుపెరగకుండా పోరాడిన గొప్ప నాయకుడు. అందుకే ఐక్యరాజ్యసమితి అంబేద్కర్ జయంతిని “ప్రపంచ విజ్ఞాన దినోత్సవం”గా ప్రకటించింది. కానీ, ఇప్పటికి ఆయనను దళిత నాయకుడుగా సమాజం కీర్తించడం బాధాకరం. అన్ని వర్గాలకు హక్కులు కల్పించిన విశ్వమానవుడు అంబేద్కర్. నేడు మనమంతా రాజ్యాంగం కల్పించిన హక్కులతో కాస్త సుఖ జీవితాలు అనుభవిస్తున్నాము తప్ప, ఆయన ఉద్యమ రథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విపలమవుతున్నాము. దీంతో అన్ని రంగాలలో ఇంకా అగ్రకుల ఆధిపత్యమే కొనసాగుతుంది. మరోవైపు ప్రైవేటీకరణతో పేదల రిజర్వేషన్స్‌కు గండి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మెజార్టీ జనాభా గల బీసీ, ఎస్సీ, ఎస్టీలు చేయాల్సింది రాజ్యాధికార యుద్ధం తప్ప, మరోటి కాదు. అగ్రకుల పార్టిలిచ్చే పదవులు, సంక్షేమ పథకాలు కాదు. ప్రస్తుతం అన్నివర్గాల ఆత్మఘోషను వినిపించే భారత రాజ్యాంగ ఉనికికే ప్రమాదం పొంచి ఉంది. రాజ్యాంగ రక్షకులు ఒకవైపు...రాజ్యాంగాన్ని మార్చే శక్తులు మరొకవైపుగా దేశ రాజకీయ యుద్ధం జరుగుతుంది. కావున ఎన్నికల్లో అగ్రకుల ఆధిపత్య పార్టీలకు వ్యతిరేకంగా ఓటనే గండ్రగొడ్డలతో బడుగు, బలహీన వర్గాలు యుద్ధం చేయాలి. అప్పుడే దేశ సంపద ప్రజాస్వామ్యికీకరించబడుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావం అనే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగుతుంది. అంబేద్కర్ కోరుకున్నది కూడా అదే.
సంపతి రమేష్ మహారాజ్,
79895 79428