పెళ్లిళ్లకు రూ.10 లక్షల కోట్లా..!

by Mahesh |   ( Updated:2024-07-18 01:00:46.0  )
పెళ్లిళ్లకు రూ.10 లక్షల కోట్లా..!
X

మధ్య కాలంలో ఓ వివాహ విందులో 36 రకాల వంటకాలు వడ్డించారని గొప్పగా చెప్పుకున్నారు. ఇంత కన్నా ఘనంగా చేయాలని మరో వివాహంలో 56 రకాల వంటకాలు వడ్డించారట. ఒకరిని మించి మరొకరు వివాహ వేడుకలకు ఖర్చు చేయడం, అంగరంగ వైభవంగా విందు వినోదాలు ఏర్పాటు చేయడం మన సమాజంలో సర్వసాధారణమై పోయింది. ఎంతటి ఘనమైన వివాహమైనా, వృధా ఖర్చును లెక్కించినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేసే ముందు మన దేశంలో ఉన్న సుమారు 7.12 కోట్ల మంది కటిక నిరుపేదలు గుర్తుకు రావాలి. ఓ పక్క హంగూ ఆర్భాటాల కోసం కోట్ల రూపాయలు వృధా చేస్తుంటే మరోపక్క భారతీయ జనాభాలో సుమారు 6 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. విద్య కోసం 18 ఏళ్ళ కాలం మొత్తానికి చేసే సగటు ఖర్చులో ఒక్క వివాహం కోసం చెసే ఖర్చు రెండింతలు. వివాహం జీవితంలో గుర్తుండిపోయే అంశమే. దానిని ఎవరూ కాదనలేరు. ఇలా జీవితకాలం గుర్తుండి పోవాలంటే అనవసర ఖర్చుని కాస్త తగ్గించుకొని వివాహ సందర్భంగా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పని చేస్తే మేలు.

భారతీయ వివాహ పరిశ్రమ రూ.10 లక్షల కోట్లు కు చేరిందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం వివాహ సమయంలో చేసే ఖర్చులో ప్రపంచ దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. నిశ్చితార్థం మొదలుకొని విందు, వినోదాలు, ఆభరణాలు, దుస్తులు, అలంకరణ కోసం ఈ ఖర్చు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రపంచ ఆకలి సూచీ విషయంలో, 28.9 స్కోర్‌తో భారత్ 111వ స్థానంలో ఉందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక - 2023 చెబుతోంది. దీని ప్రకారం 20 నుంచి 34.9 పాయింట్ల మధ్య ఉన్న దేశాల్లో ఆకలి తీవ్ర స్థాయిలో ఉన్నట్లు లెక్క. ఓ పక్క హంగూ ఆర్భాటాల కోసం కోట్ల రూపాయలు వృధా చేస్తుంటే మరోపక్క భారతీయ జనాభాలో సుమారు 6 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. 6 శాతం జనాభా అంటే తక్కువ విషయం కాదు.

సాలభంజికలు సందేశం

ఈ సందర్భంగా సలీం రాసిన సాలభంజికలు అనే కథను గుర్తు చేసుకోవాలి. ఈ కథలో పేరు మోసిన వ్యాపారస్తుడి వివాహానికి ఓ బ్యాంకు అధికారికి ఆహ్వానం అందుతుంది. అదే సమయంలో అతని ఇంట్లో పనిమనిషి కుమార్తె వివాహం కూడా ఉంటుంది. ధనవంతుడి వివాహానికి వెళ్లాలంటే తాహతుకు తగ్గట్టు బహుమతి ఇవ్వాలి. అందుకే ముప్పై వేల రూపాయలు బహుమతిగా ఇవ్వాలనుకుంటాడు. ఇంటి పనిమనిషికి ఓ ఐదువందలు. లక్షల్లో ఖర్చు చేసి స్వర్గాన్ని దింపినట్టుగా ధనవంతుడి వివాహం ఉంటుంది. బహుమతి ఇద్దామని వేదిక వద్దకు వెళ్తే చాంతాడంత బారు ఉంటుంది. ఇతను ఇచ్చే ముప్పై వేల రూపాయలు సముద్రంలో నీటి బొట్టు లాంటిది. అధికారికి జ్ఞానోదయం అవుతుంది. ఇదే డబ్బు తన పనిమనిషి కుమార్తెకు ఇస్తే జీవితకాలం సంతోష పడుతుంది. ఈ ఆలోచన రావడం తో అతను వెనుతిరుగుతాడు.

40 శాతం సంపద 1 శాతం వర్గం చేతుల్లోనే..

ఈ కథలో ఓ చిన్న సందేశం కనిపిస్తుంది. డబ్బున్న వాళ్ళ దగ్గరికే డబ్బు చేరుతుంది. గమనించారా! కానీ డబ్బు చేరాల్సింది అవసరమైన వాళ్ల వద్దకు కదా. దేశంలోని 40 శాతం సంపద కేవలం ఒక శాతం వర్గం ఆధీనంలోనే ఉన్నదని ఇటీవల నివేదికలు చెబుతున్నాయి. అనవసరమైన ఖర్చు చేయడంలో ముందున్నదీ అలాంటి అపర కోటీశ్వరులే. వాళ్ళని చూసి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఆర్భాటాలకు పోతున్నారు. ఇలాంటి పోకడలతోనే సగటు వివాహం ఖర్చు రూ.12.5 లక్షలకు చేరిందని జెఫరీస్ నివేదిక చెబుతోంది. ఈ నివేదికలో మరో ఆసక్తి కరమైన విషయం ఏమంటే, విద్య కోసం 18 ఏళ్ళ కాలం మొత్తానికి చేసే సగటు ఖర్చులో ఒక్క వివాహం కోసం చేసే ఖర్చు రెండింతలు. వివాహం జీవితంలో గుర్తుండిపోయే అంశమే. దానిని ఎవరూ కాదనలేరు. ఇలా జీవితకాలం గుర్తుండి పోవాలంటే అనవసర ఖర్చుని కాస్త తగ్గించుకొని వివాహ సందర్భంగా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి పని చేస్తే మేలు.

శిఖా సునీల్ కుమార్

వినుకొండ

99081 93534

Advertisement

Next Story

Most Viewed