- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడుస్తున్న చరిత్ర:నేతలూ.. మీ నోళ్లకు మొక్కాలే!
ముందు ముందు రాజకీయ చర్చ కన్నా తిట్టుకు బదులు తిట్టే సమాధానంగా సమావేశాలు, బహిరంగ సభలు జరగవచ్చు. అయితే, ఈ నాయకమన్యుల దుర్భాష కౌశలాన్ని భరించే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. రాజకీయంలో ఆరితేరాలంటే తిట్లు రావడమే తొలి అభ్యాసమని పిల్లలు భ్రమపడి ప్రమాదం కూడా ఉంది. పెద్ద నాయకుల నుంచి చిన్ననాయకులకు, వారి నుంచి కార్యకర్తలకు, ఆ తరవాత ఇంటింటికి ఈ 'సంస్కృతి' పాకే అవకాశముంది. కాబట్టి 'ఈ రాజ్యాన్ని ఎవరైనా ఏలుకోండి! కానీ మా మంచి, మర్యాదలను మంటగలుపకండి' అని ప్రతి తెలంగాణ బిడ్డ మనసు ఘోషిస్తోంది.
ఈ మధ్య పేపర్లు, టీవీ చానళ్లను చూస్తుంటే తెలంగాణలో రాజకీయ పార్టీల పెద్దలకు తిట్ల పురాణంలో పోటీ నిర్వహిస్తున్నట్లుంది. 'వెధవాయను నేను అంటే, నీ కన్నా పెద్ద వెధవాయను నేను' అనే రీతిలో తమ పరుష పదజాల పాండిత్యాన్ని అగ్రనాయకులు పోటాపోటీగా ప్రదర్శిస్తున్నారు. చివరకు అది 'వీళ్లా! మా నాయకులు' అని సభ్య సమాజం తలవంచుకొని స్థాయికి చేరింది. నిజానికి తెలంగాణ జనం మట్టి మనుషులే అయినా సంస్కారవంతులు. కులమతాలకు అతీతంగా మామా, కాకా, ఆయీ, అక్కా అని ప్రేమానురాగాలతో కష్టసుఖాలలో భాగస్వామ్యం అయ్యే శ్రమజీవులు. తెలంగాణ సాధన కోసం ఆవేశంగా పిడికిలెత్తి, నిస్పృహకు లోనై ఆత్మత్యాగానికి సిద్ధపడ్డ నిష్కల్మషులు. చేతికొచ్చిన పంటను చెడి అమ్ముకున్నట్లు తెలంగాణను మళ్లీ ఆధిపత్య కులాలకు అప్పగించి చెమట కష్టం మీద బతుకుతూ సర్దుకుపోతున్న అసామాన్యులు.
ఇప్పుడు గొడవంతా పాలించే తహతహల మనుషుల మధ్యనే ఉంది. జై తెలంగాణ అన్నవారు, అననివారు అందరు గుమిగూడి 'ఏనాటికైనా మీకు మేమే దిక్కు' అన్నట్లు పాత కూటమి సభ్యులే కండువాలు మార్చి కుర్చీలెక్కినారు. కొత్తవారి కన్నా పాత ఎమ్మెల్యేలే పార్టీలు మార్చి పదవులు దక్కించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకుల దయాదాక్షిణ్యాలపై బతికినోళ్లు, కలిసి బతికిన రోజుల్లో 'మా ప్రాంతాన్ని ఎందుకు పట్టించుకోరు!' అని నిలదీసే దమ్ము లేనోళ్ళు ఇప్పుడు తెలంగాణను ఉద్ధరిస్తామని ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. రాష్ట్రం కోసం కొట్లాడినోళ్లు వెనుకకు పోయిండ్రు. కుటిల రాజనీతిజ్ఞులు ముందుకచ్చిండ్రు. ఇప్పుడున్న మాటల యుద్దమంతా వీరి మధ్యనే. ప్రస్తుత పాలకుల తప్పిదాలను, మాటతప్పినతనాన్ని ఆసరా చేసుకొని నోటికచ్చిన మాటలు ప్రయోగిస్తున్నారు. ప్రజలకు మాత్రం 'పెంక మీంచి పొయ్యిల పడుతున్నామా, పొయ్యిల నుంచి పెంక మీద పడుతున్నామా?' ఏదీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ లీడర్ల మాటలు విన్నా 'నీళ్లు లేని బాయిల తూట్లు పడ్డ బొక్కేనేసి, బిందెలు తెచ్చుకోండ్రి నింపుతా!' అన్నట్లుంది.
స్థాయిని మించి విమర్శలు
రాజకీయ పార్టీల మధ్య స్పర్థలుండడం సహజమే. పాలక పక్షాన్ని ఎండగట్టి ఓటర్లను తమను నమ్మేలా తిప్పుకోవడం వృత్తి ధర్మమే. ప్రజలు 'ఔను కదా!' అనుకునేలా వాదోపవాదాలు, తర్కవితర్కాలు ఆహ్వానయోగ్యమే. కానీ, ఇప్పుడు వ్యవహారం విమర్శ స్థాయి నుంచి 'చెప్పులు, కుక్కలు' దాకా వెళ్లింది. ఉద్యమకాలంలో ఆంధ్రపాలకులను, నేతలను కేసీఆర్ తనదైన శైలిలో ఎద్దేవా చేసినా చప్పట్లు కొట్టిండ్రు కానీ, ఇదో ట్రెండ్ అయి చిక్కులు తెస్తదని అనుకోలేదు. అంతకు ముందు ఒకరినొకరు అంశాలవారీగా విమర్శించుకున్నారు, ఇలా తిట్టుకోలేదు. ఈ మధ్య తెలంగాణాలో సాగుతున్న పాదయాత్రలు, బహిరంగ సభలు ఈ తిట్లదండకానికి మరింత పటిమను పెంచాయి. మాటలు జారడంలో వైసీపీ టీపీ అధినేత్రి షర్మిల మిగితా నోళ్లను అధిగమించారనవచ్చు. ఇటీవలే 60 రోజులు పూర్తయిన ఆమె పాదయాత్రలో ఆద్యంతం కేసీఆర్, ఆయన కుటుంబం లక్ష్యంగా తీవ్రపదజాల విమర్శలే ఉన్నాయి.
ముఖ్యమంత్రిని 'దొరా!' అని సంబోధించడం సర్వసాధారణం. నాలుగు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉప్పుసాక గ్రామంలోని నిర్వహించిన రైతు దీక్షలో ఆమె వాడిన పదజాలం చాల హేయమైనదనవచ్చు. 'కేసీఆర్! మిమ్మల్ని రాళ్లతో కొట్టాలా! చీపురుతో కొట్టాలా! ప్రజలను పట్టించుకోని మీ మీద ఏ చెప్పు వేయాలి?' అన్నట్లు పత్రికలలో వచ్చింది. ప్రభుత్వ పాలనను, అందులోని అభ్యంతరాలను, ఒకరికి తప్పనిపించిన దానిని తప్పకుండా నిలదీయవచ్చు. కానీ, రాళ్లూ, చీపురు, చెప్పు అనే పదాలను వాడడం ఎవరూ హర్షించని విషయం. తెలంగాణ కోసం ఎలాంటి శ్రమ పడని షర్మిల ఇలా ఏకపక్షంగా మాటలు విసరడం ఇక్కడి సామాన్యజనానికి కూడా రుచించక పోవచ్చు. కష్టాలలో ఉన్న కుటుంబాలను తాను కలిసినపుడు కేవలం మాటల ఓదార్పు కాకుండా వారి ఆర్థిక ఇబ్బందులను కూడా పట్టించుకుంటే ఆమె మాటలపై కొంత నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది. షర్మిల తీవ్ర వ్యక్తిగత విమర్శను టీఆర్‌ఎస్ నేతలు ఎవరు సీరియస్‌గా తీసుకోవడం లేనట్లుంది. ఆమె మాటలను దీటుగా ఖండిస్తున్న దాఖలాలు కనబడతలేవు.
హద్దులు దాటిన మాటలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇద్దరు మాటల తూటాల క్షిపణులే. వీరి కన్నా ముందు ఆ బాధ్యతలు నిర్వహించినవారు ఎంత సీనియర్లయినా, అనుభవజ్ఞులైనా వారివి ఇంత పెద్ద నోళ్లు కావు. శాంతియుతంగా, బాధ్యతాయుతంగా సాగే మాటలు ఇప్పుడు అటు పత్రికలకు, టీవీ తెరలకు, ఇటు ప్రజలకు కిక్కు ఇవ్వడం లేదు. కరీంనగర్ ఎంపీ అయిన సంజయ్ బీజేపీ రాష్ట్ర పీఠంపై కాలు పెడుతూనే కేసీఆర్, కేటీఆర్‌పై దురుసు మాటల పర్వం అందుకున్నారు. కేంద్రంలో బీజేపీ ఉన్నదన్న ధీమాతో ఒక్కోసారి ఆయన మాటలకు హద్దు, అర్థం ఉండని సందర్భాలున్నాయి. కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం అని పదే పదే అనడం వ్యక్తిగౌరవ హననానికి సంకేతం.
నేరం చేసినవాళ్లను శిక్షించేందుకు దేశంలో వ్యవస్థలున్నాయి. వాటిని బూచిగా చూపే మాటలనే అధికారం ఎవరికీ లేదు. సంజయ్ వేలెత్తి చూపుతూ ఆవేశంగా గొంతెత్తి మాట్లాడడం కూడా కొంత బెదిరింపు ధోరణిలో ఉంటుంది. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాటలలో బరితెగింపు ఎక్కువ. రెచ్చగొట్టే విధానం ఎక్కువే. ఆయన మాటలు వినగానే టీఆర్‌ఎస్ నేతల సత్వర స్పందనకు సిద్దమవుతుంటారు. సంజయ్ మాటలలో కొంతమేరకు రాజకీయ అంశాలున్నా రేవంత్ మాటల దాడి చాలావరకు కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా సాగుతుంది. 'సన్నాసోల్లు, దరిద్రులు, సిగ్గు శరం లేనోళ్లు, చెప్పుతో కొట్టాలి, ముఖం మీద ఉమ్మెయ్యాలి' అనేకాకుండా 'బూట్లు నాకడం, చంకలు నాకడం'లాంటి చులకన మాటలను ఆయన నోట వస్తుంటాయి. వీరంతా ఎంత నీచంగా మాట్లాడితే అంత పెద్ద నాయకుడిగా ఎదిగినట్లు తమకు తామే అనుకుంటున్నట్లున్నారు. కానీ, వారు తెలంగాణ సంస్కృతిని పాతాళానికి తీసుకెళుతున్న విషయం గ్రహించే స్థితిలో లేరు.
వారూ వీరనే తేడాయే లేదు
టీఆర్‌ఎస్‌లో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తిట్లశూరులే. వారు చాలదన్నట్లు అదే రీతిలో జవాబు చెప్పకుంటే ప్రజలలో చిన్నతనంగా ఉంటుందనేమో అనుకొని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా దురుసు వాగ్బాణాలతో రంగంలోకి దిగారు. ఈ మధ్య ఆయన 'వాడు, వీడు, పొట్టోడు, పొడువోడు, తంబాకు తినేటోడు, చేతగాని దద్దమ్మలు, బేకర్ సన్నాసులు' అని రెండు ప్రతిపక్షాల నేతలను ఎదుర్కొంటున్నారు. 'తిట్లు మొదలుపెడితే మీకన్నా ఎక్కువే తిట్టచ్చు, కానీ, మా నాయకుడు నేర్పిన సంస్కారం అడ్డమస్తుంది' అని అంటున్నారు.
అయితే, ఈ హద్దుకూడా దాటే రోజులు రావచ్చేమో. ముందు ముందు రాజకీయ చర్చ కన్నా తిట్టుకు బదులు తిట్టే సమాధానంగా సమావేశాలు, బహిరంగ సభలు జరగవచ్చు. అయితే, ఈ నాయకమన్యుల దుర్భాష కౌశలాన్ని భరించే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. రాజకీయంలో ఆరితేరాలంటే తిట్లు రావడమే తొలి అభ్యాసమని పిల్లలు భ్రమపడి ప్రమాదం కూడా ఉంది. పెద్ద నాయకుల నుంచి చిన్ననాయకులకు, వారి నుంచి కార్యకర్తలకు, ఆ తరవాత ఇంటింటికి ఈ 'సంస్కృతి' పాకే అవకాశముంది. కాబట్టి 'ఈ రాజ్యాన్ని ఎవరైనా ఏలుకోండి! కానీ మా మంచి, మర్యాదలను మంటగలుపకండి' అని ప్రతి తెలంగాణ బిడ్డ మనసు ఘోషిస్తోంది.
బి. నర్సన్
94401 28169