రాష్ట్ర ప్రభుత్వం టీచర్లపై ఇంత చిన్నచూపు చూస్తోందా?

by Ravi |   ( Updated:2022-11-03 10:59:43.0  )
రాష్ట్ర ప్రభుత్వం టీచర్లపై ఇంత చిన్నచూపు చూస్తోందా?
X

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంతో అభద్రతాభావాన్ని పెంచారు. హక్కుగా పొందాల్సిన పెన్షన్ లక్కుగా మారిపోయింది. సీపీఎస్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత ఏమాత్రం లేదు. తన డబ్బుతో పెన్షన్ కొనుక్కునే దుస్థితి దాపురించింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలు సీపీఎస్‌ను విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేస్తున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి సైతం సీపీఎస్ రద్దు చేసి, నవంబర్ ఫస్ట్ నుంచి ఓపీఎస్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు కూడా అదే బాటలో ఉంది. బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిస్తే భేషుగ్గా ఉండేది.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో లక్షా ఇరవై వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకునే నాథుడు లేక పాఠశాలల నిర్వహణ గాడి తప్పుతోంది. ఉన్న సమస్యలు చాలవన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికారులు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. రెగ్యులర్ అటెండర్లను ఇవ్వకపోగా, పారిశుధ్య పనుల కోసం నియమించిన సర్వీస్ పర్సన్స్‌ను తొలగించారు. దీంతో మెజారిటీ సర్కారు బడులలో గంట కొట్టే దిక్కులేక టీచర్‌లే గంట కొట్టాల్సిన దుస్థితి దాపురించింది. మానవ వనరుల అభివృద్ధిలో అత్యంత కీలకపాత్ర పోషించే విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ పెద్దలు పట్టనట్లు వ్యవహరించడం ఉపాధ్యాయులకే కాకుండా బుద్ధిజీవులకు సైతం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు దాటినా ఉపాధ్యాయులు, విద్యారంగంలోని మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు.

ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష చేసి దిద్దుబాటు చర్యలు తీసుకుంటే బాగుండేది. నీటిపారుదల, విద్యుత్ రంగాల కన్నా విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, ప్రభుత్వ ప్రాధాన్యాలలో విద్యారంగం లేదని యేటేటా బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులే నిరూపిస్తున్నాయి. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్లడానికి ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడిగా, విడివిడిగా అనేకసార్లు ప్రాతినిధ్యం చేసినా, ఆందోళనలు నిర్వహించినా స్పందన లేదు. సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరించాలన్న ధ్యాస కూడా ఉన్నతాధికారులలో లేకపోవడం శాపంగా మారింది. సమస్యల పరిష్కారంలో బొత్తిగా చిత్తశుద్ధి చూపని అధికారులు, ప్రభుత్వ పాఠశాలలలో విద్యాప్రమాణాలు ఎలా ఆశిస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి.

Also read: ఉద్యోగ పర్వం: ఏడేండ్లుగా ప్రమోషన్లు నిల్

ఎందుకీ దుస్థితి?

ఇరవై, ఇరవై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసినా ప్రమోషన్‌కు నోచుకోని ఉపాధ్యాయులు రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు. కొందరు ఒక్క ప్రమోషన్‌ కూడా పొందకుండానే రిటైర్ అవుతున్నారు. అపాయింటైన పోస్టులోనే రిటైరయ్యే ఉద్యోగులు ఉన్న ఏకైక డిపార్ట్‌మెంట్ పాఠశాల విద్యాశాఖ మాత్రమే. పూర్తి విద్యార్హతలు, వేలాది ఖాళీ పోస్టులు ఉండి కూడా, టీచర్లకు ప్రమోషన్లు కల్పించడం లేదు. అన్ని శాఖలలో యేటా భారీ సంఖ్యలో పదోన్నతులు కల్పిస్తున్న ప్రభుత్వం, ఉపాధ్యాయులను విస్మరించింది. తమపై ఈ చిన్నచూపు ఎందుకో అర్థం కావడంలేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. టీచర్లకు 2001 నుంచి జూనియర్ లెక్చరర్, 2005 నుంచి ఎంఈఓ, డైట్ లెక్చరర్ ప్రమోషన్స్ కల్పించలేదు. 2015 స్కూల్ అసిస్టెంట్, హైస్కూల్ హెడ్మాస్టర్ పదోన్నతులు కూడా ఇవ్వలేదు.

నాలుగున్నర సంవత్సరాలుగా బదిలీలు కూడా లేకపోవడంతో ఉపాధ్యాయులలో తీవ్ర నిరాశా, నిస్పృహలు నెలకొన్నాయి. ఏపీలో ఉపాధ్యాయులకు ప్రతి నెలా పదోన్నతులు, యేటేటా బదిలీలు చేస్తున్నప్పుడు, తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడం లేదో అర్థం కాదు. ఎస్‌ఈ‌ఆర్‌టీ ప్రొఫెసర్లు, డైట్ కళాశాలల లెక్చరర్లకు డీఈఓలుగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. మరి, ఎస్‌ఈ‌ఆర్‌టీ, డైట్ కళాశాలలు ఎలా నడవాలి? గ్రేడ్-2 జీహెచ్ఎంలను ఆరు, ఏడు మండలాలకు ఇన్‌చార్జీ ఎంఈఓలుగా నియమిస్తున్నారు. పనిభారం పెరగడంతో వీరు దేనికీ న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో, పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది.

సుమారు రెండు వేల జీహెచ్ఎం గ్రేడ్-2, సీఎం అసెంబ్లీలో ప్రకటించిన పదివేల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్‌తో ఏర్పడిన స్కూల్ అసిస్టెంట్, మొత్తం 20 వేలకు పైగా పోస్టులు పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది. ఏడున్నరేండ్లుగా ప్రమోషన్లు కల్పించలేదు. ప్రమోషన్లను అధికారులు టీచర్లకు ప్రయోజనం చేకూర్చే అంశంగా చూస్తున్నారే తప్ప, పోస్టులు భర్తీ అయితే, విద్యాబోధన మెరుగుపడుతుందన్న కోణంలో చూడడం లేదు. పోస్టులు యేండ్ల తరబడి భర్తీ చేయకపోవడంతో విద్యాప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. జిల్లాల పునర్విభజన సందర్భంగా అన్ని శాఖలకు జిల్లాస్థాయి అధికారుల పోస్టులు మంజూరు చేసిన ప్రభుత్వం, డీఈఓ, ఎంఈఓ పోస్టులను ఇప్పటికీ మంజూరు చేయలేదు.

పాఠశాలల అవసరాల కనుగుణంగా పోస్టులు మంజూరు చేసి, నియామకం కోసం టీఆర్‌టీ ప్రకటిస్తే బాగుండేది. కానీ, ఆ ఊసే లేదు. తరగతికో టీచర్ లేకపోతే విద్యాబోధన జరిగేదెలా? ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల విశ్వాసం పెరిగేదెలా? కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు బదిలీలు చేస్తామంటూ పదేపదే చెప్పడమే తప్ప, ఆచరణలో జరిగింది శూన్యం. రెగ్యులర్ టీచర్‌లతో సమానంగా వారికి వేతనాలు ఇవ్వరు. కనీసం ఆకస్మిక సెలవులు సైతం 27 ఇవ్వడం లేదు. సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయడం లేదు. మాడల్ స్కూల్ టీచర్లకు మెడికల్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యం లేదు. హెల్త్ కార్డులు లేవు. తెలంగాణ ఇంక్రిమెంట్ లేదు. టీచర్ చనిపోతే కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కూడా చేయరు. హెడ్ కింద వేతనాలు చెల్లించడం లేదు. చివరికి జీతాలు చెల్లింపు అధికారుల దయ, టీచర్ల ప్రాప్తంగా మారింది. ఏ నెలాఖరుకో చెల్లిస్తున్నారు.

Also read: ఉద్యోగ పర్వం:సెలవులకు నిబంధనలు ఇలా

బాధితుల గోడు పట్టదా!?

సంఘాలతో చర్చించకుండానే 317 జీఓ జారీ చేసి వేలాది మంది ఉపాధ్యాయుల స్థానికతను పాతరేశారు. పుట్టి, పెరిగి, చదువుకున్న జిల్లా నుండి ఇతర జిల్లాలకు నిర్బంధంగా శాశ్వత బదిలీలు చేశారు. తప్పుల తడకగా సీనియారిటీ జాబితాలు రూపొందించడమే కాకుండా, అభ్యంతరాలను సైతం పరిష్కారించకుండానే ఆగమేఘాలమీద జిల్లాలకు కేటాయించి అప్రజాస్వామికంగా వ్యవహరించారు. స్పౌజ్ కేటగిరీలో భార్యను ఒక జిల్లాకు, భర్తను మరో జిల్లాకు కేటాయించి వారి కుటుంబాలను కకావికలం చేశారు. అలొకేషన్ తర్వాత స్పౌజ్ కేటగిరి టీచర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, 13 జిల్లాలను బ్లాక్ చేసి, వారికి తీరని వ్యథను మిగిల్చింది.

ఎవరికీ చెప్పాపెట్టకుండా రివర్స్ స్పౌజ్ బదిలీలు చేయడంతో మెజారిటీ టీచర్లకు న్యాయం జరగలేదు. మెడికల్ గ్రౌండ్స్, వితంతువు కేటగిరీవారు పెట్టుకున్న అప్పీళ్లను కోర్టుకు వెళ్తే తప్ప, పట్టించుకోవడం లేదు. పరస్పర బదిలీల కోసం 21 నంబర్ జీఓ జారీ చేసినా, ఇరువురిలో ఒకరు తప్పనిసరిగా 317 జీఓ పరిధిలో బదిలీ అయి ఉండాలన్న కండిషన్ పెట్టారు. ఈ అసంబద్ధ నిబంధన కారణంగా చాల మంది ఉపాధ్యాయులు పరస్పర బదిలీ పరిధిలోకి రాకుండా పోయారు.

Also read: ఉద్యోగ పర్వం:సర్కారు బడి మారేదెలా?

పాత పెన్షన్ స్కీం కావాలె!

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంతో అభద్రతాభావాన్ని పెంచారు. హక్కుగా పొందాల్సిన పెన్షన్ లక్కుగా మారిపోయింది. సీపీఎస్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సామాజిక భద్రత ఏమాత్రం లేదు. తన డబ్బుతో పెన్షన్ కొనుక్కునే దుస్థితి దాపురించింది. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలు సీపీఎస్‌ను విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేస్తున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి సైతం సీపీఎస్ రద్దు చేసి, నవంబర్ ఫస్ట్ నుంచి ఓపీఎస్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. తమిళనాడు కూడా అదే బాటలో ఉంది.

బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన సీపీఎస్‌ను రద్దు చేసి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిస్తే భేషుగ్గా ఉండేది. 2003 డీఎస్‌సీ టీచర్‌లు పాత పెన్షన్ పథకానికి పూర్తిగా అర్హులైనప్పటికీ యేండ్లు గడుస్తున్నా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆ దిశలో చర్యలు తీసుకోకపోవడం అన్యాయం. ఈ విషయాలన్నింటిపై సీఎం సత్వరం జోక్యం చేసుకోవాలి. ఉన్నతస్థాయి సమీక్ష చేసి, యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. సంఘాలతో చర్చించి, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.


మానేటి ప్రతాపరెడ్డి

టీఆర్‌టీఎఫ్ గౌరవాధ్యక్షుడు

98484 81028

Advertisement

Next Story

Most Viewed