కొవాగ్జిన్ సరిపోదు.. కొవిషీల్డ్ పంపండి: ఈటల

by Anukaran |
కొవాగ్జిన్ సరిపోదు.. కొవిషీల్డ్ పంపండి: ఈటల
X

దిశ, తెలంగాణ బ్యూరో : పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ తయారు చేస్తున్న ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌నే తెలంగాణ రాష్ట్రానికి పంపాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రికి రాష్ట్ర వైద్య మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. భారత్ బయోటెక్ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్’తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రైవేటుహెల్త్ కేర్ సిబ్బందికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్న స్టాక్ సరిపోదని, అదనపు డోసులను పంపాలని శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

‘కొవాగ్జిన్’ టీకాను తీసుకునేవారి నుంచి సమ్మతి పత్రాన్ని తీసుకోవాలని ఐసీఎంఆర్ నిబంధన విధించిందని, ఆ పార్మాలిటీస్‌ను అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయని, అందువల్ల ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను పంపాల్సిందిగా కేంద్ర మంత్రికి వివరించారు. వీలైనంత ఎక్కువ సంఖ్యలో ‘కొవిషీల్డ్’ స్టాకును పంపాలని, ఆ తర్వాత అవసరాన్ని బట్టి ‘కొవాగ్జిన్’ను వాడతామని స్పష్టం చేశారు. ‘కొవాగ్జిన్’పై దేశవ్యాప్తంగా అనేక రకాల విమర్శలు, సందేహాలు వస్తున్న సమయంలో తెలంగాణ వైద్య మంత్రి కూడా కేంద్ర మంత్రితో వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా పూణెలో తయారవుతున్న ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌కే మొగ్గు చూపడం గమనార్హం.

శుక్రవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, ఏ వ్యాక్సిన్ అయినా డ్రగ్ కంట్రోలర్ జనరల్ అన్ని విధాలుగా చర్చించి ఆమోదం తెలిపినందున ఏ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ అయినా ఒకటేనంటూ స్పష్టత ఇచ్చారు. ఎలాంటి సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. మరుసటి రోజునే మరో రకంగా మాట్లాడడం, కేంద్ర మంత్రికి నిర్దిష్టంగా పూణె నుంచి ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను మాత్రమే ఎక్కువ సంఖ్యలో పంపాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.

డైరెక్టర్ అలా… మంత్రి ఇలా…

‘కొవాగ్జిన్’ వ్యాక్సిన్‌పై తలెత్తుతున్న సందేహాలు, టీకా వేయించుకునేవారి నుంచి విధిగా ‘సమ్మతి పత్రం’ (కన్సెంట్ లెటర్) తీసుకోవాలన్న నిబంధన విధించడంపై ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను పాత్రికేయులు ప్రశ్నించగా, ఎలాంటి అపోహలు అవసరం లేదని, అన్నింటి శాస్త్రీయ పరిశోధనల అనంతరమే భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున పనితీరును శంకించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సైడ్ ఎఫెక్టులు, రియాక్షన్ల గురించి ఆందోళన అవసరం లేదని, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చినందునే ‘కొవాగ్జిన్’కు సమ్మతి పత్రం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణ గడ్డమీద తయారైన ఈ వ్యాక్సిన్‌ను రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ గర్వంగా భావించాలని పేర్కొన్నారు. మంత్రి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించడం విశేషం.

ఈ నెల 3వ తేదీన కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్’కు అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయగానే మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ తయారుచేస్తున్న ‘కొవాగిజిన్’కు అనుమతి రావడం ఆనందంగా ఉందని ఆ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, జాయింట్ ఎండీ సుచరితలకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ వ్యాక్సిన్ హబ్‌గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉందని, మరోసారి తన సత్తాను చాటుకుందని ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. ఇక్కడి శాస్త్రవేత్తల కృషి, పారిశ్రామికవేత్తల చొరవ అభినందనీయమన్నారు. కానీ మంత్రి ఈటల రాజేందర్ మాత్రం పూణె నుంచి ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్‌ను మరింత ఎక్కువగా పంపించాలని కోరడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed