నాడు ఉద్యమం.. నేడు బతుకు పోరాటం

by Shyam |   ( Updated:2020-11-01 22:40:04.0  )
నాడు ఉద్యమం.. నేడు బతుకు పోరాటం
X

దుబ్బాక, దిశ ప్రత్యేక ప్రతినిధి: “తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయనుకున్నాం. నందిని సిధారెడ్డి ఇచ్చిన పిలుపుతో ఉద్యమంలోకి దూకాం. రాష్ట్రం రానే వచ్చింది. కానీ, ఉద్యోగం రాకపాయె. గురుకుల పాఠశాలలో తాత్కాలిక టీచర్‌గా చేరినా ఆర్నెల్ల నుంచి వేతనాలే లేవు. హోటల్ పెట్టుకుని బతుకు పోరాటం చేస్తున్నా” అని ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తిని వెళ్లగక్కాడు తొగుట యువకుడు మహేశ్. ప్రభుత్వ కొలువులు వస్తాయనుకున్న వేలాది మంది యువత నిరాశా నిస్పృహల్లో ఉన్నారు. ఇప్పుడు దుబ్బాక ఎన్నికల్లో యువత ఓటు అన్ని పార్టీల గెలుపోటములకు కీలకంగా మారింది. మొత్తం 1.98 లక్షల ఓట్లలో దాదాపు 45% మేర యువతే ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఓట్లు ఏమవుతాయోనన్న ఆందోళన టీఆర్ఎస్‌ను వేధిస్తుండగా, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో తనవైపే వస్తాయని బీజేపీ భావిస్తోంది. తొగుటలో తండ్రి చేసిన అభివృద్ధితో ఇప్పుడు తనకే లాభిస్తుందని కాంగ్రెస్ అభ్యర్థి భావిస్తున్నారు. పోలింగ్ రోజున వీరు ఎటువైపు అనేది తేటతెల్లమవుతుంది.

కేవలం తొగుట మండలంలోనేకాక మిరుదొడ్డి, దుబ్బాక, దౌల్తాబాద్ లాంటి మండలాల్లో సైతం పట్టణ, గ్రామీణ యువ ఓటర్లు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ పార్టీకి వేయాలో, ఏ పార్టీకి వేయొద్దో నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. పార్టీలు పంచే నోట్లు తమ అభిప్రాయాన్ని మార్చలేవని బహిరంగంగానే చెప్తున్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వందలాది మంది యువకులు స్వయం ఉపాధి అవకాశాలను వెతుక్కున్నారు. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత ప్రభుత్వ కొలువులు ఇక రావనే నిర్ణయానికి వచ్చేశారు. ఉద్యోగంమీద నమ్మకం పెట్టుకుని ఏజ్ బార్ అయిపోతుందంటూ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు.

ఉద్యోగాలూ లేవు.. జీతాలు అసలే లేవు..

నందిని సిధారెడ్డి శిష్యుడ్ని నేను. ఆయన పిలుపుతో విద్యార్థిగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నాను. ఇదే దుబ్బాక మండలంలో రోజూ రోడ్డెక్కి నినాదాలు చేశాను. తెలంగాణ వస్తే భవిష్యత్తు ఉంటుందనుకున్నాను. కానీ, ఆరేళ్ల కళ్ల ముందు అనుభవం అది భ్రమ మాత్రమే అని రుజువు చేసింది. ఎంఏ పొలిటికల్ సైన్స్ అయిపోయిన తర్వాత బీఈడీ కూడా పూర్తయింది. ఏడాది నుంచి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో సోషల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాను. కరోనా తర్వాతి పరిస్థితుల్లో డిజిటిల్ పాఠాలనూ చెప్పాను. కానీ, ఆరు నెలలుగా జీతాలే లేవు. కడుపు నిండటం భారంగా మారింది. తల్లిదండ్రుల పొలాలు మల్లన్నసాగర్‌లో మునిగిపోయాయి. నాతోపాటు పనిచేసే శ్రీకాంత్ అనే లెక్కల టీచర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. లాభం లేదనుకుని ఇప్పుడు తొగుట మెయిన్ రోడ్డు మీద టిఫిన్ సెంటర్ పెట్టుకున్నా. ఎంఏ చదివినా ఆ చదువు నాకు బతుకునివ్వలేదు. కనీసం స్కిల్ డెవలప్‌మెంట్ లాంటివి ప్రభుత్వం కల్పించినా చాలా మంది స్వయం ఉపాధి అవకాశాలు వెతుక్కునేవారు. అది కూడా లేదు. ఆరేళ్లలో చాలా విసిగిపోయాను.

-మహేశ్, తొగుట

పొస్టు గ్రాడ్యుయేషన్ చదివి ఆటో తోలుతున్నా..

ఉద్యమాల పురిటిగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా అనేది ఇప్పుడు గుర్తుచేయాల్సిన పనే లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో నేను రంగంలోకి దూకడమే కాక నా సోపతిగాళ్లను కూడా చాలా మందిని పొగుచేసిన. తెలంగాణ వస్తే బతుకు బాగుపడ్తదనుకున్నా. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంలో బాల్క సుమన్‌తోపాటు కలిసి పనిచేసిన. రాష్ట్రం ఏర్పడిన రెండు మూడేళ్ల తర్వాత భవిష్యత్తు ఎట్లుంటదో అర్థమైంది. ఎంఏ బీఈడీ చేసిన తర్వాత కొంతకాలం కాంట్రాక్టు టీచర్‌గా పనిచేసిన. ఏడెనిమిది వేల రూపాయల కాంట్రాక్టు జీతంతో బతకడం కష్టమని తేలిపోయింది. ఆటో డ్రైవింగ్ నేర్చుకున్న. అప్పుచేసి ఆటో కొనుక్కున్న. ఇప్పుడు దుబ్బాక ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ కార్యకర్తలే నా ఆటో ఎక్కుతున్నరు. నా కాళ్ల మీద నేను బతుకుతున్న. గిరాకీ ఉన్నప్పుడు ఆటో తోల్తున్న. లేనప్పుడు టీ స్టాల్‌ పనిచేసుకుంట. ఇంత చూసినంక నా ఓటు ఎవలకో తెల్వదా?.

-ప్రసాద్

ఇంకా పని వెతుక్కుంటనే ఉన్న..

బాసరలోని ట్రిపుల్ ఐటీలో చదివాను. ఇంజినీర్‌ని అవుతా అని నా తల్లిదండ్రులు చాలా సంతోషపడ్డారు. కోర్సు అయిపోయినంక ప్రభుత్వ ఉద్యోగం రాదని అర్థమైపోయింది. డిప్లొమా చదివినవారు చేసే చిన్నా చితకా పనులు చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కాకుండా చూసుకున్నాను. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక రకమైన పని చేసుకుంటూ బతుకుతున్నాను. దుబ్బాకలో పెద్దగా పరిశ్రమలేవీ లేవు. రాజకీయంగా పెద్దగా పరిచయాలు లేవు. పైరవీలు ఉంటే ఏదో ఒకటి సంపాదించేవాడిని. కానీ, దుబ్బాకను దాటి సిద్దిపేటకు వెళ్లి అక్కడి స్థానికులను కాదని నేను సర్కారు నుంచి లబ్ధి పొందే మార్గం లేదు. చేతిలో విద్యతోని స్వంత కాళ్ల మీద నిలబడటమే ఉత్తమం అనిపించి స్థిరత్వం కోసం ప్రయత్నిస్తున్నాను.

-స్వామి, గ్రాడ్యుయేట్, తొగుట

Advertisement

Next Story