- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సిద్దిపేటలో.. హైడ్రామా
దిశ ప్రతినిధి, మెదక్: బీజేపీ కార్యకర్తలు, పోలీసుల ఘర్షణతో సిద్దిపేట పట్టణం సోమవారం సాయంత్రం రణరంగంగా మారింది. బీజేపీ అభ్యర్థి బంధువుల ఇండ్లలో పోలీసులు జరిపిన సోదాలు ఈ ఘర్షణకు దారితీశాయి. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా సోదాలు జరపడం చట్టవిరుద్ధమని అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపిస్తుంటే.., నిర్దిష్ట సమాచారం మేరకే ఇండ్లలో సోదాలు చేసినట్లు పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ ప్రకటించారు. సుమారు రూ. 18.67 లక్షల నగదు రఘునందన్ రావు మామ రాంగోపాల్‌రావు బంధువైన అంజన్‌రావు ఇంట్లో దొరికిందని సీపీ ప్రకటించగా, పోలీసులే ఆ ఇంట్లో పెట్టి అక్కడే దొరికినట్లుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు, అభ్యర్థి ఆరోపించారు. నాలుగైదు గంటల పాటు అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో సిద్దిపేటలో హైడ్రామా నెలకొంది..
నోట్ల కట్టల కోసం పోలీసులు చేసిన సోదాలు హైడ్రామాను తలపించాయి. స్పష్టమైన సమాచారం రావడంతోనే సోదాలు నిర్వహించామని పోలీసులు చెప్తుండగా బైట నుంచి సంచిలో తెచ్చిన డబ్బుల్ని ఇంట్లో పెట్టి దొరికినట్లుగా చూపించే కుట్రకు పాల్పడ్డారని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నోట్ల కట్టల సంచితో అంజన్ రావు ఇంటి ఆవరణలో ఒక పోలీసు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో ఆగ్రహానికి గురైన బీజేపీ కార్యకర్తలు ఆ సంచిని లాక్కుని నోట్ల కట్టలను బైటకు తీసి ప్రదర్శించారు. కొద్దిమంది గేటు దాటి, గోడ దూకి బైటకు వచ్చారు. చివరకు స్వాధీనం చేసుకున్న రూ. 18.67 లక్షల్లో రూ. 5.87 లక్షలు మాయమైనట్లు సీపీ డేవిస్ పేర్కొంటుండగా.. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో తహసీల్దార్ విజయసాగర్ మాత్రం రూ.12.80 లక్షలు మాయమైనట్టు పేర్కొన్నారు.
నోటీసు ఇవ్వకుండా ఎలా సోదా చేస్తారు..
ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఇంట్లోకి వెళ్లి సోదాలు జరపడం చట్టవిరుద్ధమని, ఏ సెక్షన్ ప్రకారం సోదాలు నిర్వహించారని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అక్కడి పోలీసులను ప్రశ్నించారు. పోలీసు కమిషనర్ మాత్రం రఘునందన్ రావు మామ రాంగోపాల్‌రావు ఇంట్లో నగదు దొరకలేదని, ఆయనకు బంధువైన అంజన్ రావు ఇంట్లో దొరికిందని, డ్రైవర్ ద్వారా ఓటర్లకు పంచడం కోసమే వీటిని పంపినట్లు స్వయంగా ఆయనే వెల్లడించారని వివరించారు. జిల్లా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో పోలీసు బృందం సోదాలు నిర్వహించి పంచనామా చేసి దొరికిన నగదుకు సంబంధించి రిపోర్టు రాసి వారిచేత సంతకం చేయించుకుని ఒక కాపీని వారికి కూడా ఇచ్చినట్లు వివరించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియోలో రికార్డు చేశామని తెలిపారు. నోట్ల కట్టలను పోలీసు చేతిలో ఉన్న సంచి లోంచి దౌర్జన్యంగా లాక్కున్న దృశ్యాలు, అందులో పాల్గొన్న వ్యక్తుల దృశ్యాలు కూడా వీడియోలో నిక్షిప్తమయ్యాయని, వాటి ఆధారంగా క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
డబ్బు దొరికి ఉంటే ఆధారాలు బయటపెట్టాలి..
సిద్దిపేటలో జరిగిన సంఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ అధికార ప్రతినిధి డీకే అరుణ, నియోజకవర్గ ఇన్‌చార్జి జితేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు వివేక్ తదితరులంతా తప్పుపట్టారు. పారదర్శకంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, అక్కడ జరిగిన వ్యవహారంపై వివరాలు తెలుసుకోడానికి కూడా ఇంటి దగ్గరకు వెళ్లడానికి అనుమతించలేదని, అక్కడి వ్యక్తులతో మాట్లాడడానికి కూడా ఫోన్‌ను అందుబాటులో ఉంచలేదని ఆరోపించారు. నిజంగా డబ్బు దొరికి ఉంటే పోలీసులు ఆధారాలను బైటపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు అంజన్ రావు ఇంటి ఆవరణలో ఒక పోలీసు నోట్ల కట్టల సంచితో అనుమానాస్పదంగా తచ్చాడాల్సిన అవసరం ఏముందని, నిజంగా స్వాధీనం చేసుకున్న డబ్బు అయితే ఆ వివరాలను బైట పెట్టొచ్చుగదా అని ప్రశ్నించారు. మరోవైపు మంత్రి హరీశ్ రావు మాత్రం బీజేపీ అభ్యర్థి ఓటమి ఖాయమని తెలిసిన తర్వాత సానుభూతి కోసం ఈ సంఘటనను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
దుబ్బాక ఎన్నికలకు ఎందుకు ముడిపెడతారు..
ఈ సంఘటన వివరాలను తెలుసుకున్న కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి సైతం హుటాహుటిన హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు బయలుదేరారు. సిద్దిపేటలో డబ్బులు దొరికితే దాన్ని దుబ్బాక ఎన్నికలకు ముడిపెట్టడం సహేతుకం కాదన్న వాదనలూ బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి.
అనేక అనుమానాలు..
దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలో బీజేపీ అభ్యర్థి బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో పోలీసులు నాఖాబంది నిర్వహించి వాహనాలను, ఇండ్లను తనిఖీ చేయడం నిబంధనలకు లోబడి ఉంటున్నా, సిద్దిపేటలోని అంజన్‌రావు, రాంగోపాలరావు ఇండ్లలో సోదాల విషయంలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా సోదాలు జరిగాయని న్యాయవాది అయిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఎలాంటి నోటీసు లేకుండా ఇండ్లలో సోదాలు నిర్వహించడంపై పోలీసులు నోరు మెదపడం లేదు. సోదాలు చేయడానికి ముందు తప్పనిసరిగా సెర్చ్ వారెంట్ ఉండాలని నిబంధన చెప్తున్నా అలాంటివేమీ లేకుండానే సిద్దిపేటలో ఇండ్లలో సోదాలు చేపట్టడం పోలీసులే చట్టాన్ని అతిక్రమించడం అవుతుందన్నది ఆయన వాదన. బీజేపీ అభ్యర్థుల బంధువుల ఇళ్లపైనే దాడులు, సోదాలు జరుగుతున్నాయన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు పోలీసులు మరో డ్రామాకు తెర లేపారని, టీఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు ఇంటిపై కూడా సోదాలు చేయడం అందులో భాగమేనని ఆరోపించారు.
బీజేపీ కార్యకర్తల ఆందోళన..
సిద్దిపేటలో పోలీసులు రఘునందన్ రావు బంధువుల ఇంట్లో డబ్బులు దొరికినట్లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అవన్నీ బూటకమే అని బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులే డబ్బులు తెచ్చి ఇక్కడ దొరికినట్లు డ్రామాలు ఆడుతున్నారంటూ హల్చల్ చేశారు. రఘునందన్ రావు బంధువుల ఇంటి దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు బ్యాగులో తెచ్చిన డబ్బులను అందినకాడికి పట్టుకువెళ్లారు. చివరకు ఆలా మాయమైన లెక్క రూ. 5.87 లక్షలుగా తేలింది.
బండి సంజయ్ అరెస్ట్.. గాయాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో బండి సంజయ్‌కు గాయాలయ్యాయి. తట్టుకోలేని ఆయన గట్టిగా కేకలు పెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలను బండి సంజయ్ ఖండించారు. దుబ్బాకలో ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో సోదాలు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. సంజయ్ తో పాటు వివేక్, రంజిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. దీంతో సిద్దిపేటలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ అరెస్ట్ లపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇది తెలంగాణ ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం దుందుడుకు చర్య అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, అరెస్ట్ చేసిన బండి సంజయ్ ను కరీంనగర్ తరలించారు.
ఏ సెక్షన్ ప్రకారం సోదాలు చేశారు : బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు
తన ఇంట్లో, తన బంధువుల ఇళ్లలో పోలీసులు సోదాలు ఎలా చేశారని రఘునందన్ రావు ప్రశ్నించారు. తన బందువుల ఇళ్లలో సోమవారం సోదాలు జరిగిన విషయం తెలసుకున్న రఘునందన్ రావు ప్రచారం మధ్యలోనే ఆపేసి వెంటనే సిద్ధిపేట చేరుకున్నారు. ఏ సెక్షన్ ప్రకారం తన ఇంట్లో సోదాలు చేశారో చెప్పాలంటూ పోలీసులతో గొడవకు దిగారు. కనీసం తన భార్యతో ఫోన్ కూడా మాట్లాడనివ్వలేదని పోలీసులను ప్రశ్నించారు. తన ఇంట్లో ఇప్పటివరకు ఏం స్వాధీనం చేసుకున్నారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనను మాత్రమే టారెట్
చేసి సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. దుబ్బాకలో ఓడిపోతామనే భయంతోనే టీఆర్‌ఎస్ పోలీసులతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. కార్యకర్తలతో కలిసి తాను ఇంటి ఎదుట బైఠాయించారు. తన ఇంట్లో కి వెళ్లేందుకు రఘునందన్ ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున్న బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
డబ్బులు పట్టుకెళ్లిన వారిని అరెస్ట్ చేస్తాం : సిద్దిపేట సీపీ
సిద్దిపేట జిల్లా కేంద్రంలో రఘునందన్ రావు బంధువు ఇంటిలో గుర్తించిన రూ.18 లక్షల 67 వేల రూపాయల నుంచి రూ. 5 లక్షల 50 వేల రూపాయలు గుర్తు తెలియని వారు దొంగిలించినట్లు సిద్ధిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా వీడియోలు రికార్డు చేసినట్టు ఆయన వెల్లడించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిని, డబ్బులు దొంగలించిన వారిని గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామని పోలీస్ కమిషనర్ తెలిపారు.
డబ్బులు పంచేప్పుడు ఎందుకు దొరకలేదు : బండి సంజయ్
దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంట్లో డబ్బులు దొరుకుతాయ్ కానీ డబ్బులు పంచేప్పుడు ఎందుకు దొరకలేదని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ లో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటకు దుబ్బాకకు సంబంధం ఏంటన్నారు. ఫాంహౌజ్ లో దాడులు చేయాలని, ప్రగతి భవన్లో కూడా పక్కా డబ్బులు ఉన్నాయని సంజయ్ ఆరోపించారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేయడంతో పాటు జిల్లాలోని అధికారులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారే డబ్బులు పెట్టి అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశారని సంజయ్ మండిపడ్డారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు..
సిద్దిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ కరీంనగర్, జగిత్యాల జిల్లాలోని పలుచోట్ల బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఆందోళనలు నిర్వహించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.