కోటిన్నర రూపాయల ఛార్జీలు మాఫీ చేసిన దుబాయ్ ఆసుపత్రి

by Anukaran |   ( Updated:2020-07-15 11:32:16.0  )
కోటిన్నర రూపాయల ఛార్జీలు మాఫీ చేసిన దుబాయ్ ఆసుపత్రి
X

దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ కరోనా పేషెంట్లను నరకయాతనకు గురిచేస్తూ ఉంటే దుబాయ్‌లోని ఆసుపత్రి మాత్రం ఏకంగా కోటిన్నర రూపాయల ఛార్జీలను పూర్తిగా మాఫీ చేసింది. ఆ దేశంలోని భారత్ కాన్సుల్ జనరల్ కార్యాలయం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. పేదరికంలో ఉన్న ఆ పేషెంట్‌ను సొంతూరికి పంపేందుకు విమాన టికెట్‌కు సైతం డబ్బులు లేకపోవడంతో దాన్ని కూడా సర్దుబాటు చేసి ప్రయాణ ఖర్చుల నిమిత్తం చేతిలో పది వేల రూపాయలను కూడా చొరవ తీసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన ఒద్నాల రాజేశ్ పొట్ట కూటి కోసం దుబాయ్‌లో పనిచేయడానికి వెళ్ళాడు. స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో ఏప్రిల్ 23న ఆసుపత్రిలో చేరాడు. చివరకు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. సుమారు 80 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసే సమయంలో 7.62 లక్షల ధీరమ్‌ల బిల్లు వేసింది ఆసుపత్రి యాజమాన్యం. కానీ ఏ మాత్రం డబ్బు కట్టుకోలేని పేదవాడినంటూ అక్కడి భారత కాన్సుల్ జనరల్ కార్యాలయానికి గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ తరపున మొరపెట్టుకున్నాడు. సొసైటీ తరఫున గుండెల్లి నరసింహ ఆసుపత్రిలో చేర్చింది మొదలు బిల్లును మాఫీ చేసేంత వరకు రాజేశ్‌కు బాసటగా నిలిచాడు. చివరకు కాన్సుల్ జనరల్ కార్యాలయంలోని సుమంత్ రెడ్డి అనే వాలంటీర్ ద్వారా జరిగిన ప్రయత్నం సఫలమై మొత్తం బిల్లును ఆసుపత్రి మాఫీ చేసింది.

Advertisement

Next Story