గుత్తేదారుల డబ్బుల కక్కుర్తి.. అభివృద్ధి పనుల్లో అవినీతి

by Sridhar Babu |
Development works
X

దిశ, కరీంనగర్ సిటీ: ‘‘పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎగిరెగిరి దుంకింది’’ అన్నట్లుగా మారింది నగరంలోని బల్దియా అధికారుల పనితీరు. వందల కోట్లు వెచ్చించి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నా, కనీస పర్యవేక్షణ చేయకుండా, కార్యాలయానికే పరిమితమైపోవటంతో నగరంలో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు గాలికొదిలి తాము ‘చెప్పేదే లెక్క, చేసేదే పని’ అన్నట్లుగా నడిపిస్తున్నారు. దీంతో ‘నాణ్యత నాస్తి.. అవినీతి జాస్తి’ అన్నట్లుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో గత ఆరేళ్లుగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రధానంగా రహదారులు, అంతర్గత దారులు, లైటింగ్, డబుల్ డివైడర్లు, ప్లాట్ ఫాంలు, పార్కులు, జంక్షన్ల అభివృద్ధి, మురికి కాల్వల నిర్మాణాలపై దృష్టి సారించి, పనులు కొనసాగిస్తున్నారు.

ఈ పనులు నాలుగు కాలాల పాటు నిలిచేలా చేపట్టాల్సింది పోయి, నామమాత్రంగా పూర్తి చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో నాణ్యత కొరవడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్లు కాసుల కక్కుర్తితో పనులు నాసిరకంగా చేపడుతున్నారు. నగరంలోని కోర్టు వెనుక ప్రాంతంలో నిర్మిస్తోన్న మురికి కాలువల నిర్మాణాలకు ఇసుకకు బదులు మొరం వాడుతున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు నగారాన్ని అద్దంలా తీర్చిదిద్దేందుకు మంత్రి గంగుల కృషిచేస్తుంటే, మరోవైపు కాంట్రాక్టర్లు నాణ్యత లేని పనులు చేపడుతుండటం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి పనులు ఇలాగే కొనసాగితే స్మార్ట్ సిటీ కాస్తా డర్టీ సిటీగా మారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. టవర్ సర్కిల్‌లో జరుగుతున్న నిర్మాణాల్లో కూడా ఇసుకను బదులు మొరం వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed