డబుల్ బెడ్ రూంలు పేదల ఆత్మగౌరవ ప్రతీక: హరీశ్ రావు

by Shyam |
డబుల్ బెడ్ రూంలు పేదల ఆత్మగౌరవ ప్రతీక: హరీశ్ రావు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో గూడు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించే అదృష్టం కలగడం తన పూర్వ జన్మ సుకృతం అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. తనకు ఇప్పటికీ స్వంతంగా ఇల్లు నిర్మించే అవకాశం రాలేదని… రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో నర్సాపూర్‌లో 2460 డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించే అవకాశం దక్కిందని మంత్రి తెలిపారు. సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో నర్సా పూర్ డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై 144 మంది డబుల్ బెడ్ రూం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల స్వంతింటి కల నిజం కాబోతున్నందుకు తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో… నర్సాపూర్‌లో 2460 రెండు పడక గదుల ఇల్లు నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఈ ఇండ్లు నిర్మించేందుకు తమకు నాలుగేండ్ల సమయం పట్టిందని తెలిపారు.

ఈ నాలుగేండ్లలో నాలుగు వందల సార్లు నిర్మాణ స్థలాన్ని సందర్శించి అనేక చిక్కులను నేర్పుగా విప్పుకుంటూ ఇళ్ల నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామన్నారు. మొదటి దశలో 1341 మంది లబ్ధిదారులను గుర్తించామని చెప్పారు. నిజమైన పేదలకు ఇల్లు దక్కాలని ఆరు నెలలు కష్టపడి ఎలాంటి ఆరోపణలకూ తావులేకుండా అర్హులను మాత్రమే ఎంపిక చేశామన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు పేదల ఇళ్లు మాత్రమే కావని పేద ప్రజల ఆత్మ గౌరవ ప్రతీకలని పేర్కొన్నారు. ఈ నెల 10 న ముఖ్యమంత్రి సమక్షంలో 144 మంది లబ్ధిదారుల గృహ ప్రవేశం చేసేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed