తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టండి : కలెక్టర్ శశాంక

by Sridhar Babu |
తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టండి : కలెక్టర్ శశాంక
X

దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కరోనా సన్నద్ధత కిట్లపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని , లేనియెడల వారిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శశాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కరోనా వైరస్ నివారణకు అహర్నిషలు శ్రమిస్తున్నా, కొందరు వ్యక్తులు పనిగట్టుకుని సోషల్ మీడియా, పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్లు, నర్సుల మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇకపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కరోనా పేషెంట్లకు పూర్తి స్థాయి చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అన్ని రకాల సౌకర్యాలతో 200 పడకల ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామన్నారు. అందులో అన్ని రకాల పరికరాలతో పాటు పర్యవేక్షణ కోసం వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అన్ని కేటగిరీలకు సంబంధించిన వైద్య సిబ్బందికి కరోనా నివారణకు ఉపయోగించే పీపీఈ(పర్సనల్ ప్రొటక్షన్ ఎక్విప్ మెంట్) కిట్లు-210, ఎన్-95 మాస్కులు 185, సర్జికల్ గ్లౌజులు 4500, 200 శానిటైజర్స్ , 7900 వైద్య పరీక్షల సమయంలో వినియోగించే గ్లౌజులు, శానిటేషన్ , సెక్యూరిటీ సిబ్బందికి అవసరమైన 50 బాడీసూట్స్, శాంపిల్స్ సేకరించే 22 విటీయంలు అందుబాటులో ఉంచామన్నారు.అంతే కాకుండా జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో పీపీఈలు 200, ఎన్-95 మాస్కులు 230, సర్జికల్ గ్లౌజులు-1000, 4000 శానిటైజర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. ముందు జాగ్రత్త చర్యగా అదనంగా 500- పీపీఈ కిట్లు, 500ఎన్-95 మాస్కులు, 1500 సర్జికల్ గ్లౌజులు, 100 శానిటైజర్స్, 200 బాడీ సూట్స్, 100 వీఐఎంలు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టినట్టు కలెక్టర్ వివరించారు. W H O, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు వేటిని ఎక్కడ, ఎలా, ఎన్ని వాడాల్లో అలానే చేస్తున్నామన్నారు. పేషంట్లకు సేవ చేస్తున్న నర్సులను ఆదుకునే బాధ్యత మనపై ఉందన్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేసేలా వైద్య సన్నద్దతపై జిల్లాలో కొందరు వ్యక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. రాబోయే 15రోజులు ప్రజలందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్ సూచించారు.

Tags: corona,lockdown, fake news, don’t spread, serious action, collector shashanka

Advertisement

Next Story

Most Viewed