మళ్లీ వీసాల నిబంధనలు కఠినం!

by Anukaran |
మళ్లీ వీసాల నిబంధనలు కఠినం!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం వెల్లడించారు. హెచ్ 1బీ వీసాల సంఖ్యను తగ్గించడమే కాకుండా, ఈ వీసాల జారీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త విధానం వల్ల అమెరికన్లకు మరింత మేలు కలుగుతుందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ప్రకటించింది. అయితే, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల టెక్ కంపెనీలకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లనుంది. భారత్‌లోని టెకీల ఉద్యోగాలపై కూడా దీని ప్రభావం ఉండనుంది.

అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో హెచ్ 1బీ వీసా పరిధిలోకి వచ్చే ప్రయోగ నైపుణ్యాలపై అధికంగా కోత ఉండనుందని తెలుస్తోంది. అయితే, కరోనా ప్రభావం స్థానికులపై ఉండకూడదనే కారణంగానే అమెరికా ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి వల్ల అమెరికాలో ఉద్యోగాల కల్పన భారంగా మారింది. దీంతో వలసలను అరికట్టి, స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ట్రంప్ ప్రభుత్వం భావించింది.

అందుకే ఈ నిర్ణయం తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, ఈ కొత్త విధానంతో అమెరికాలోని కంపెనీల్లో ఏడాది 85 వేల మంది అత్యంత నైపుణ్యం ఉన్న విదేశీయూలను మాత్రమే నియమించుకునే అవకాశముంటుందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభగాం వెల్లడించింది. కొత్త వీసా ఆంక్షలు గురువారం నుంచి అమల్లోకి వచ్చే అవకాశముందని, ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది నుంచి హెచ్ 1బీ వీసాల దఖాస్తుల సంఖ్య మూడో వంతు తగ్గిపోవచ్చని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభగాం అభిప్రాయపడింది.

Advertisement

Next Story